దూడల పెంపకంతో నాలుగింతల ఆదాయం
సకాలంలో వ్యాధులు గుర్తిస్తే ప్రయోజనం
గుడ్లవల్లేరు(గుడివాడ) :గ్రామాల్లో వ్యవసాయం తరువాత పాడి పశువుల పెంపకం ప్రధానం ఉంది. అయితే పెంపకంతో మెలకువలతో ఆదాయం పెందవచ్చు. అందులో దూడల పెంపకంతో అనతి కాలంలోనే పాడిరైతు నాలుగింతల ఆదాయం సంపాదించుకోవచ్చు. పశువుల పెంపకంలో ఆవులు, గేదెల పెంపకంతో పాటు లేగ దూడల పెంపకం పాడి రైతులకు ఎంతో లాభదాయకమే.
నాణ్యమైన దాణా అందిస్తూ క్రమం తప్పకుండా రోగ నిరోధక టీకాలు వేయిస్తే మేలు జాతి దూడల్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా నష్టం తప్పదు. దూడలకు సోకే వ్యాధులు, నివారణ చర్యలపై గుడ్లవల్లేరు వెటర్నరీ మండల వైద్యాధికారి డాక్టర్ కె.అభిలాష్ ఇస్తున్న సలహాలు ఇలా ఉన్నాయి.
అజీర్తితో తెల్ల విరేచనాలు...
మోతాదుకు మించి పాలు తాగించటం వలన అజీర్తి చేసిన దూడలు తెల్లగా పారతాయి. సూక్ష్మజీవులు, నట్టల వలన కూడా దూడల్లో విరేచనాలు అవుతాయి. ఈ సమయంలో పాల మోతాదును తగ్గించాలి. గ్లూకోజ్, ఉప్పు, నీరు కలిపిన మిశ్రమాన్ని తాగించి ఆ తర్వాత పశు వైద్యుల్ని సంప్రదించాలి.రక్షణ లేకపోతే న్యూమోనియా...దూడలకు రాత్రి సమయంలో సరైన రక్షణ లేక తగిలే గాలుల వలన న్యూమోనియా వస్తుంది. అలాంటి గాలులు తగలకుండా వాటికి గృహవసతి కల్పించాలి. ఈ వ్యాధి వచ్చిన దూడల్లో జ్వరం వస్తుంది. శ్వాస పీల్చడం కష్టతరమవుతుంది.
వ్యాధి ముదిరితే చనిపోయే అవకాశం ఉంది. వ్యాధి వచ్చిందని తెలిస్తే వెంటనే పశు వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించాలి. నట్టలతో ఎదుగుదలకు అవరోధం...నట్టల వ్యాధి సోకితే దూడను ఎదగనివ్వదు. దూడల్లో ఈ వ్యాధి బుడద సాధారణమే. దూడల్లో ఈ వ్యాధి ఉంటే తరచూ విరేచనాలు అవుతాయి. వెంట్రుకలు బిరుసుగా ఉంటాయి. కడుపు కిందకు జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరుతుంది. దూడలకు సకాలంలో నట్టల నివారణ మందులు తాగించాలి. 8–10రోజుల వయసులో మొదటి, ఆ తర్వాత నెలకో సారి చొప్పున నాలుగు నెలల వరకూ క్రమం తప్పకుండా మందులు తాగించాలి.
కాక్సిడియోసిస్తో రక్త విరేచనాలు...
ఈ వ్యాధి సోకడం వలన దూడలు రక్త విరేచనాలతో బాధ పడతాయి.
15రోజులకు ఒకసారి పశువుల కొట్టంలో సున్నం చల్లితే కాక్సిడియాసిస్ వ్యాధి రాకుండా నివారించవచ్చు.
దూడలకు మరిన్ని సమస్యలు...
గేదె దూడలకు మూడు నెలల దాటిన తర్వాత నెలకో సారి ఏడాది వరకు దాని శరీరంపై వెంట్రుకలు కత్తిరించి పేలు, గోమార్లు రాకుండా కాపాడుకోవాలి.
దూడలకు 6–8 వారాల వయసులో మొదటి సారి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. దూడలకు 6నెలల వయసులో జబ్బ వాపు, గొంతు వాపు, బ్రూసెల్లోసిస్ వంటి అంటువ్యాధులు ప్రబలకుండా టీకాలు వేయించాలి.
పరిశుభ్రత లోపిస్తే బొడ్డు వ్యాధి...
దూడ పుట్టినపుడు దాని బొడ్డును శుభ్రమైన బ్లేడు లేదా కత్తెరతో రెండు అంగుళాల పొడవు ఉంచి కత్తిరించి టింక్చర్ ఆయోడిన్ అద్దాలి. అలా చేయకపోతే సూక్ష్మజీవులు ప్రవేశించి బొడ్డువాపు కలిగే ప్రమాదం ఉంది. బొడ్డువాపు వ్యాధి వచ్చినపుడు ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి.
వైద్యంతో మల బద్ధకానికి చెక్...
దూడల్లో మల బద్ధకం సాధారణంగా కనిపిస్తుంది.
దూడలకు జున్ను పాలు తగినవన్ని తాగిస్తే ఈ సమస్య ఉత్పన్నం కాదు.
దూడ తాగే పాలలో కోడిగుడ్డు సొన, ఇం గువ, బెల్లం కలిపి రెండు రోజుల పాటు తాగిస్తే మల బద్ధకం తగ్గుముఖం పడుతుంది. లేదా ఎనిమా ఇప్పించాలి.
వ్యాధి నిరోధక టీకాల షెడ్యూల్ ఇదే...
గొంతువాపు నిర్మూలనకు ఐదో నెలలో, రెండో సారి ఏడాదికి ఒకసారి మే, జూన్ ల్లో టీకా వేయించాలి.
జబ్బ వాపు నివారణకు 7వ నెలలో, రెండో సారి ఏడాదికి ఒకసారి మే, జూన్ నెలల్లో వేయించటం ఉత్తమం.
రొమ్ము రోగానికి 6వ నెలలో, రెండో సారి ఏడాదికి ఒకసారి ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వేయించాలి.
ఈసుడు రోగానికి 4–6నెలల్లో, రెండో సారి ఏడాదికి ఒకసారి ఎప్పుడైనా వేయించటం ఉత్తమం.
థైలేరియాసిస్కు 4నెలల తర్వాత, రెండో సారి ఏడాదికి ఒకసారి ఎప్పుడైనా వేయించవచ్చు.
గాలికుంటుకు 2 నెలల వయసులో, రెండో సారి ఏడాదికి ఒకసారి మార్చి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వేయించటం ఉత్తమం.