‘ఓటుకు కోట్లు 2.0’ ప్రకంపనలు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు చేసిన ఓటుకు కోట్లు 2.0 కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. తననూ టీడీపీ నేతలు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని సోమవారం గుంటూరు (పశ్చిమ) ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ కూడా వెల్లడించడం సంచలనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలని.. టీడీపీ అగ్రనేతతో మాట్లాడిస్తామంటూ స్థానిక నేతలు తనను సంప్రదించారని మద్దాళి గిరిధర్ చెప్పారు. స్థానిక నేతలకు తాను స్పందించకపోవడంతో మాజీ ఎమ్మెల్సీ, చంద్రబాబు సన్నిహితుడు టీడీ జనార్దన్ ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించారని.. కానీ, తాను ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు.
కుట్రలు, కుతంత్రాలు, విలువల్లేని రాజకీయాలు చేసే చంద్రబాబు వైఖరి నచ్చక.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన చూసి టీడీపీ వీడానని ఆయన స్పష్టంచేశారు. టీడీపీ అగ్రనేతల నుంచి తనకు వచ్చిన ఫోన్‌కాల్ లిస్ట్‌ను ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ బహిర్గతం చేయడంతో టీడీపీ ప్రలోభాల పర్వం మరోసారి బట్టబయలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే రూ.పది కోట్లు ఇస్తామంటూ తనను ప్రలోభపెట్టేందుకు ఉండి ఎమ్మెల్యే రామరాజు ప్రయత్నించారని ఎమ్మెల్యే రాపాక ఇప్పటికే వెల్లడించడం.. ఓటును అమ్ముకుంటే వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లేనని భావించి ఆ ప్రతిపాదనను తిరస్కరించానని స్పష్టంచేసిన విషయం విదితమే.
టీడీపీ ప్రలోభాలకు లొంగే ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటు చేశారన్నది స్పష్టమవుతోంది. గెలిచే బలం లేకున్నప్పటికీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించడాన్ని బట్టి చూస్తుంటే.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే ఓటుకు రూ.కోట్లు ఎరవేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చంద్రబాబు వ్యూహం రచించారని ఆదిలోనే వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ నేతలు చెప్పారు.
టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు రావడాన్ని బట్టి చూస్తే.. ఆ పార్టీకి ఉన్న 19 మంది ఎమ్మెల్యేల కంటే అదనంగా నలుగురు ఓట్లేసినట్లు స్పష్టమవుతోంది. ఆ నలుగురికి ఒక్కొక్కరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసినట్లు సజ్జల ఇప్పటికే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రలోభాల పర్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రలోభాలు, కుట్రలు, కుతంత్రాలు బాబు నైజం..
ప్రజలకు మంచి చేసి.. వారి ఆశీస్సులతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించరని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రలోభాల పర్వాన్నే ఆయన ఎంచుకున్నారని గుర్తుచేస్తున్నారు.
కుట్రలు, కుతంత్రాల ద్వారానే అధికారంలోకి రావడంపైనే చంద్రబాబు ఆలోచన చేస్తారని వారు స్పష్టంచేస్తున్నారు. తెలంగాణలో 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఎరవేసి ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ.. ఆడియో వీడియో టేపులతో ఆ రాష్ట్ర ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చంద్రబాబు దొరికిపోవడాన్ని వారు గుర్తుచేస్తున్నారు.