ఓటుకు కోట్లు కేసును... ‘సీబీఐతో విచారణ చేయించాలి’
ఓటుకు కోట్లు కేసును... ‘సీబీఐతో విచారణ చేయించాలి’
Published Mon, Aug 29 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
– కేసీఆర్‌కు చంద్రబాబు రూ.500 కోట్ల ముడుపులు..!!
– ఈ కేసులో అనుబంధ చార్జిషీటు వేయకపోవడం దీన్ని బలపరుస్తుంది
– సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ కూడా అవసరం
– అప్పీలుకు వెళ్లకుండా చంద్రబాబు తన సచ్ఛీలతను చాటుకోవాలి
– వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన డిమాండ్
సాక్షిప్రతినిధి, తిరుపతి : ఓటుకు కోట్లు కేసును కేంద్రం సీబీఐతో విచారణ చేయించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రుల మ«ధ్య చోటుచేసుకున్నట్లు వినిపిస్తోన్న రూ.500 కోట్ల ఆర్థిక లావాదేవీల అంశాన్ని బయటకు తీసేందుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమన ఓటుకు కోట్లు కేసును ప్రస్తావించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసు విషయంలో రెండు రాష్ట్రాల సీఎంల మధ్య పెద్ద తతంగమే నడిచిందన్నారు. బ్రహ్మదేవుడు దిగొచ్చినా బాబు రక్షించలేడన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడాది దాటినప్పటికీ ఈ కేసులో అనుబంధ చార్జిషీటు వేయలేదని ఆరోపించారు. కేంద్రం దగ్గర సాగిలపడి, కేసీఆర్ కాళ్లుపట్టుకుని ఊగిన చంద్రబాబు నాయుడు రాష్ట్రప్రయోజనాలను తుంగలో తొక్కారని ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్‌కు రూ.500 కోట్ల ముడుపులు అందాయని తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపించాయని భూమన పేర్కొన్నారు. శాస్త్రీయంగా, పరిశోధన చేసి బయట పెట్టిన ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించిన ఏసీబీ కోర్టు కేసు పునర్‌విచారణకు ఆదేశించడంతో చంద్రబాబులో మళ్లీ వణుకు మొదలైందన్నారు. తిరుపతిలో జరిగే జాతీయస్థాయి వైద్యసదస్సుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ హఠాత్తుగా తిరుపతి పర్యటన వాయిదా వేసుకుని ఆయన బెంగళూర్ వెళ్లారన్నారు.
అడుగడుగునా కుట్ర రాజకీయాలే...
చంద్రబాబువి అడుగడుగునా కుట్ర రాజకీయాలేనని భూమన ధ్వజమెత్తారు. పదేపదే తాను సచ్ఛీలుడనని చెప్పుకునే సీఎం చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అప్పీలుకు వెళ్లకుండా తన సచ్చీలతను నిరూపించుకోవాలని భూమన సవాల్ విసిరారు. అవినీతిపరుడైన నాయకుడు రాష్ట్రానికి సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తమకు అపారమైన నమ్మకం ఉందనీ, అందుకే సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా తానెవ్వరికీ భయపడనన్న సీఎం మాటలను ప్రస్తావించిన భూమన ..ఎవరినైనా కొనగలన నీ, మేనేజ్ చేయగలనన్న ధైర్యం ఉండటం వల్లనే సీఎం చంద్రబాబు ఎవ్వరికీ భయపడరన్నారు.ప్రత్యేక హోదా సాధన విషయంలో ఎవ్వరితోనైనా వైఎస్సార్‌సీపీ కలిసి పోరాడుతుందని భూమన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Advertisement
Advertisement