Overseas Company
-
మెగా డీల్ : అంబానీ సరసన అదానీ
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ దిగ్గజ కంపెనీలకు వాటాను విక్రయిస్తూ, మెగాడీల్స్తో జోరుమీదున్న బడా వ్యాపారవేత్తల జాబితాలో తాజాగా బిలియనీర్ గౌతమ్ అదానీ చేరారు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఎల్)లో మైనారిటీ వాటాను ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్ఈకి విక్రయించనుంది. ఈ డీల్ విలువ 2.5 బిలియన్ డాలర్ల (రూ.18,200 కోట్లు) గా ఉండనుంది. ఈ ఒప్పందం ద్వారా సమకూరిన నిధులతో అదానీ తన వ్యాపార రుణాన్ని తగ్గించుకోనుందని అంచనా. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ గ్రీన్‌లో 20శాతం వాటా కొనేందుకు ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. అలాగే సోలార్ ఎనర్జీ అభివృద్ధిలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఉన్న అదానీ గ్రీన్ బోర్డులోకి టోటల్ చేరనుంది. మొత్తం 2.35 గిగావాట్స్ సోలార్ అసెట్ లో 50 శాతం వాటా అదానీ సొంతం. కంపెనీలో ప్రమోటర్లకు 74.92 శాతం వాటా ఉండగా, దీనిలో 20 శాతం వాటాను టోటల్‌కు విక్రయించనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్లకు చెందిన 16.4 శాతం వాటాకు సమానమైన 25.65 కోట్ల షేర్లను టోటల్ కొనుగోలు చేసినట్లు అదానీ గ్రీన్ వెల్లడించింది. పునరుత్పాదక , సహజ వాయువు అనే రెండు స్తంభాల ఆధారంగా శక్తి పరివర్తన వ్యూహాన్ని అమలు చేయడానికి భారతదేశం సరియైనదని తాము భావిస్తున్నామని టోటల్ సీఈఓ పాట్రిక్ పౌయన్నే ఒక ప్రకటనలో తెలిపారు. కాగా 1988లో వస్తువుల వ్యాపారిగా ప్రారంభమైన అదానీ గ్రూప్, భారతదేశపు అగ్రశ్రేణి ప్రైవేటు రంగ పోర్ట్ ఆపరేటర్ విద్యుత్ జనరేటర్‌గా ఎదిగింది. 2019 ఏడాదిలో విమానాశ్రయాలపై దృష్టి పెట్టిన, అదానీ తాజాగా డాటా స్టోరేజ్, ఆర్థిక సేవలు సహా ఇతర రంగాలలోకి ఎంట్రీ ఇస్తోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 1.483 ట్రిలియన్ డాలర్లు (20.25 బిలియన్ డాలర్లు). 20 శాతం వాటా ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 4.1 బిలియన్ డాలర్లు. మరోవైపు తన వ్యాపార స్రామాజ్యంలో వాటాలను విదేశీ దిగ్గజాలకు అమ్మడం ద్వారా పెట్టుబడులను సేకరిస్తూ రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ విశషంగా నిలిచారు. ఫేస్బుక్, గూగుల్, సిల్వర్‌లేక్, అబుదాబి సహా వివిధ విదేశీ పెట్టుబడిదారుల నుంచి సుమారు 27 బిలియన్ల డాలర్లను సంపాదించిన సంగతి తెలిసిందే. -
విదేశాలలో రిలయన్స్ జియో లిస్టింగ్!
అనుబంధ డిజిటల్, మొబైల్ విభాగం రిలయన్స్ జియోను విదేశాలలో లిస్ట్ చేసే యోచనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి విదేశాలలో రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకు వెళ్లే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల కొద్ది రోజులుగా రియలన్స్ జియో విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. గత నాలుగు వారాలలో 5 డీల్స్ కుదుర్చుకోవడం ద్వారా 10.3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 77250 కోట్లు)ను సమకూర్చుకుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 5.7 బిలియన్ డాలర్లను వెచ్చించడం ద్వారా రిలయన్స్ జియోలో 9.9 శాతం వాటాను సొంతం చేసుకోగా.. పలు పీఈ సంస్థలు సైతం స్వల్ప స్థాయిలో వాటాలు కొనుగోలు చేసిన విషయం విదితమే. ఫలితంగా జియో ప్లాట్‌ఫామ్స్ ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.15 లక్షల కోట్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. దీంతో అల్ఫాబెట్, టెన్సెంట్, అలీబాబా వంటి దిగ్గజాలతో పోల్చవచ్చని పేర్కొంటున్నారు. రిటైల్ సైతం ఐదేళ్లలోగా రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ బిజినెస్‌లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గతేడాది ఆగస్ట్‌లో పేర్కొన్నారు. ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు వీలుగా పలు విదేశీ సంస్థలను భాగస్వాములుగా చేసుకోనున్నట్లు తెలియజేశారు. కాగా.. దేశీ కంపెనీలు డైరెక్ట్‌గా విదేశాలలో లిస్టయ్యేందుకు వీలుగా అవసరమైన నిబంధనలను సవరించనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. తద్వారా దేశీ కంపెనీలకు విదేశీ నిధుల లభ్యతను పెంచేందుకు వీలు కలుగుతుందని వివరించింది. అయితే పన్ను సంబంధిత, విదేశీ మారక నిర్వహణ తదితర అంశాలలో నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేయవలసి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రుణ భారం తగ్గింపు ఓవైపు రిలయన్స్ జియోలో వాటాల విక్రయం ద్వారా 10.3 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోవైపు రైట్స్ ఇష్యూని చేపట్టింది. తద్వారా రూ. 53,000 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉంది. నిధులలో అధిక శాతాన్ని రుణ చెల్లింపులకు వినియోగించే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. 2021 మార్చికల్లా రుణ రహిత కంపెనీగా నిలవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆశిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
వేల కోట్ల డబ్బు ఎవరికి చేరింది?
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయల్లో కన్నం వేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆ నగదును విదేశాలకు తరలించినట్టు తెలిసింది. పీఎన్బీ నగదును అక్రమంగా విదేశీ కంపెనీలకు చెల్లించి, డైమాండ్ వ్యాపారాల్లో నీరవ్ మోదీ భారీ మొత్తంలో లబ్ది పొందారు. అయితే ఆ డబ్బు ఎవరికి వెళ్లింది? ఎవరూ ఈ అక్రమ నగదును సొంతం చేసుకున్నారు? అని సర్వత్రా చర్చనీయాంశమైంది. ఔరా జెమ్ కంపెనీ, సినో ట్రేడర్స్ కంపెనీ, యునిటీ ట్రేడింగ్, సన్‌షైన్ జెమ్స్, ట్రై కలర్ జెమ్స్, పసిఫిక్ డైమాండ్ విదేశీ కంపెనీలు ఈ నగదును పొందినట్టు తెలిసింది. గత ఏడేళ్లుగా పీఎన్బీ, ఇచ్చిన ఉత్తర్వులపై భారతీయ బ్యాంకులు ఈ కంపెనీలకు డబ్బులు చెల్లించినట్టు ఉంది. ఈ కంపెనీల పేర్లు పీఎన్బీ, సీబీఐకి దాఖలు చేసిన ఫిర్యాదులో వెల్లడయ్యాయి. అయితే ఈ నగదును ఎలా వాడారన్నది మిస్టరీగానే ఉంది. పసిఫిక్ డైమాండ్స్ ఎఫ్‌జడ్‌ఈ, యూనిటీ ట్రేడింగ్ ఎఫ్‌జడ్‌ఈ, ట్రై కలర్ జెమ్స్ ఎఫ్‌జడ్‌ఈ ఈ మూడు యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందినవి కాగ, సన్‌షైన్ జెమ్స్, సినో ట్రేడర్స్ హాంకాంగ్ చెందినవిగా తెలుస్తోంది. ఔరా జెమ్ ఏ దేశ కంపెనీనో ఇంకా తెలియలేదు. తమ విదేశీ కార్యాలయాలు, ఈ కంపెనీల క్రెడిబిలీటిని పరీక్షిస్తున్నాయని, 2010 నుంచి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు సీనియర్ కౌంటర్పార్టీ బ్యాంకర్ చెప్పారు. వారం తర్వాత ఈ కంపెనీలపై ఓ నివేదిక వస్తుందని, ఆ సమాచారం మేరకు అంతర్గత విచారణ కూడా చేపడతామని పేర్కొన్నారు. బాహ్యాంగా కన్సల్టెంట్‌ను ఏర్పాటుచేయాలా? లేదా? అన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు. నీరవ్ మోదీ, మెహల్ చౌక్సి గీతాంజలి జెమ్స్ కంపెనీలతో సంబంధాలున్న మరికొన్ని కంపెనీలను కూడా ఇన్వెస్టిగేటర్లు, బ్యాంకర్లు అనుమానస్పంద కంపెనీలుగా భావిస్తున్నారు. మొత్తం 150 లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్స్ ద్వారా నీరవ్ మోదీ పీఎన్బీకి రూ.11,400 కోట్లు కన్నం వేశారు. పీఎన్బీ ఉద్యోగులు బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియకుండా ఈ మోసానికి పాల్పడ్డారు. -
ఫుడ్ రిటైల్‌లో హంగామా!
♦ 500 మిలియన్ డాలర్లతో రంగంలోకి అమెజాన్ ♦ ఆసక్తిగా మరిన్ని కొత్త సంస్థలు ♦ విలీనాలకు చాన్స్ ప్రస్తుతం ఆహారోత్పత్తుల రిటైల్ విభాగంలో కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. దేశ, విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికన్ దిగ్గజం అమెజాన్ పెట్టుబడుల ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త సంస్థలు ఫుడ్ రిటైల్‌లోకి రావొచ్చని, పోటీ తీవ్రమైతే కన్సాలిడేషన్‌కి దారి తీయొచ్చని పరిశీలకులు చెబుతున్నారు. (సాక్షి, బిజినెస్ విభాగం) ఈ–కామర్స్ బూమ్ తర్వాత ప్రస్తుతం ఆహారోత్పత్తుల రిటైల్ విభాగంలో కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. దేశ, విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికన్ దిగ్గజం అమెజాన్ పెట్టుబడుల ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త సంస్థలు ఫుడ్ రిటైల్‌లోకి రావొచ్చని, పోటీ తీవ్రమైతే కన్సాలిడేషన్‌కి దారి తీయొచ్చని పరిశీలకులు చెబుతున్నారు. దేశీ ఫుడ్ రిటైల్‌లో సంస్కరణల ఊతంతో పలు సంస్థలు ఈ విభాగంలో కార్యకలాపాలు విస్తరించేందుకు పోటీపడుతున్నాయి. ఇప్పటికే బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ వంటి సంస్థలు ఆన్లైన్ మాధ్యమంగా నిత్యావసర సరుకులు విక్రయిస్తుండగా.. అమెజాన్ కూడా స్థానం పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ మూడు సంస్థలు కలిపి సుమారు 695 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించాయి. ఇందులో అమెజాన్‌దే 500 మిలియన్ డాలర్ల ప్రతిపాదన ఉంది. దీనికి కేంద్రం ఆమోదముద్ర కూడా వేసింది. ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్రం అనుమతిస్తోంది. నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీలు భారత్‌లో పూర్తి స్థాయి అనుబంధ సంస్థను ప్రారంభించి.. ఇక్కడే తయారయ్యే ఆహారోత్పత్తులను స్టోర్స్ లేదా ఆన్లైన్ మాధ్యమంలో విక్రయించుకోవచ్చు. ఈకామర్స్ సంస్థగా భారత కొనుగోలుదారులకు సుపరిచితమైన అమెజాన్.. ఫుడ్ రిటైల్లోనూ విస్తరించాలనుకుంటోంది. నిధులే బలం.. దేశీయంగా ఆహారోత్పత్తుల విక్రయ వ్యాపారం చాలా మటుకు అసంఘటితంగానే ఉంది. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ వంటి ఆన్లైన్ సంస్థలు తమ తమ స్థాయిల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే, దిగ్గజ సంస్థ అమెజాన్‌కి ఇవి పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేవు. సరుకు సమీకరించుకోవడం నుంచి డెలివరీ దాకా అన్ని విభాగాల్లోనూ రాణించేందుకు అమెజాన్‌కు సామర్థ్యం ఉంది. ఇటీవలే ఫిబ్రవరిలో అమెరికాలో ఫుడ్ రిటైల్ దిగ్గజంట హోల్ ఫుడ్స్ మార్కెట్ సంస్థను 13.7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా అక్కడి రిటైల్ స్టోర్స్ విభాగంలో అమెజాన్ పట్టు సాధించే ప్రయత్నాల్లో పడింది. ఇదే తరహాలో భారత ఫుడ్ రిటైల్ మార్కెట్లో కూడా దూసుకెళ్లే యోచనలో ఉంది. అమెజాన్ వ్యాపార విధానం ఏమిటన్నది ఇంకా పూర్తిగా వెల్లడి కానప్పటికీ.. స్థానిక కిరాణా దుకాణాలతో జత కట్టడం ద్వారా సర్వీసులు అందించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా స్టోర్స్ ఏర్పాటు చేయాలంటే రియల్టీ వ్యయాలు చాలా భారీగా ఉండటం వల్ల అమెజాన్.. కిరాణా దుకాణాలవైపే మొగ్గు చూపవచ్చని అంచనా. ఇక పుష్కలంగా నిధులున్న అమెజాన్ వంటి దిగ్గజానికి గట్టి పోటీనివ్వాలంటే వాల్‌మార్ట్ వంటి మరో దిగ్గజానికే సాధ్యం కాగలదు. అయితే, వాల్‌మార్ట్ ప్రస్తుతం హోల్‌సేల్ విభాగానికే పరిమితం కాగా.. ఆన్లైన్ షాపింగ్ ద్వారా రిటైల్ కొనుగోలుదారులకు ఇప్పటికే చేరువ కావడం అమెజాన్‌కు లాభించే అంశం. కన్సాలిడేషన్‌కు ఆస్కారం.. భారీ పెట్టుబడులతో అమెజాన్ రంగంలోకి దిగడంతో.. ఫుడ్ రిటైల్‌లో ఇప్పుడున్న.. ఇకపై రాబోయే ఏ సంస్థ అయినా కూడా దానికి దీటుగా సర్వీసులిస్తేనే నిలదొక్కుకోగలవు. అయితే, ఆ స్థాయిలో మనీ పవర్ ఉన్న దేశీ సంస్థలు తక్కువగానే ఉండొచ్చు కాబట్టి.. సంస్థల విలీనాలు, కొనుగోళ్లతో ఈ విభాగంలో కన్సాలిడేషన్‌కి ఆస్కారం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. సుమారు 200 మిలియన్ డాలర్లతో బిగ్‌బాస్కెట్‌లో మైనారిటీ వాటాలు దక్కించుకునే ప్రయత్నాల్లో పేటీఎం మాల్ ఉంది. ఒకవేళ ఈ డీల్ సాకారమైతే.. చైనా దిగ్గజం ఆలీబాబా పెట్టుబడులు ఉన్న పేటీఎం.. అమెజాన్‌కి పోటీనివ్వడానికి కొంత సాధన సంపత్తి సమకూర్చుకున్నట్లవుతుంది. ఇక బిగ్‌బాస్కెట్ సైతం అమెజాన్‌కి వాటాలు విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సవాళ్లు ఉన్నాయ్.. ఆన్లైన్లో పళ్లు, కూరగాయలు కొనుక్కునే ట్రెండ్ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. సాధారణంగా దేశీ వినియోగదారులు.. కూరగాయలు, నిత్యావసర సరుకులు వంటివి కొనుక్కునేందుకు మండీలు, కిరాణా స్టోర్లకు వెళ్లడమే పరిపాటి. ఆయా ఉత్పత్తులను స్వయంగా చూసి, తాజా సరుకేనా కాదా అన్నది తెలుసుకున్నాకే కొనుక్కుంటూ ఉంటారు. ప్రస్తుతం చాలా మటుకు కిరాణా వ్యాపారులు హోం డెలివరీ కూడా ఇస్తున్నారు. నిత్యావసర సరుకుల డెలివరీ వ్యాపారంలో పెట్టుబడులు చాలా భారీగా అవసరమవుతాయి.. మార్జిన్లు చాలా స్వల్పంగా ఉంటాయి. చాలా మటుకు సంస్థలు డెలివరీ కార్యకలాపాల్లో భారీగా నష్టాలు చవిచూస్తున్నాయి. ఇలాంటి పరిణామాలతో ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌కి చెందిన పెప్పర్‌ట్యాప్ ఇప్పటికే మూతబడింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఫుడ్ రిటైల్ ఎంత వరకూ నిలదొక్కుకోగలదన్నది చూడాల్సి ఉంటుందనేది విశ్లేషకులు అభిప్రాయం.