ఫుడ్‌ రిటైల్‌లో హంగామా! | Amazon Deal for Whole Foods Starts a Supermarket War | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ రిటైల్‌లో హంగామా!

Published Thu, Jul 13 2017 12:52 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

ఫుడ్‌ రిటైల్‌లో హంగామా! - Sakshi

ఫుడ్‌ రిటైల్‌లో హంగామా!

500 మిలియన్‌ డాలర్లతో రంగంలోకి అమెజాన్‌
ఆసక్తిగా మరిన్ని కొత్త సంస్థలు
విలీనాలకు చాన్స్‌  


ప్రస్తుతం ఆహారోత్పత్తుల రిటైల్‌ విభాగంలో కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. దేశ, విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికన్‌ దిగ్గజం అమెజాన్‌ పెట్టుబడుల ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త సంస్థలు ఫుడ్‌ రిటైల్‌లోకి రావొచ్చని, పోటీ తీవ్రమైతే కన్సాలిడేషన్‌కి దారి తీయొచ్చని పరిశీలకులు చెబుతున్నారు.  

(సాక్షి, బిజినెస్‌ విభాగం)
ఈ–కామర్స్‌ బూమ్‌ తర్వాత ప్రస్తుతం ఆహారోత్పత్తుల రిటైల్‌ విభాగంలో కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. దేశ, విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికన్‌ దిగ్గజం అమెజాన్‌ పెట్టుబడుల ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త సంస్థలు ఫుడ్‌ రిటైల్‌లోకి రావొచ్చని, పోటీ తీవ్రమైతే కన్సాలిడేషన్‌కి దారి తీయొచ్చని పరిశీలకులు చెబుతున్నారు.

దేశీ ఫుడ్‌ రిటైల్‌లో సంస్కరణల ఊతంతో పలు సంస్థలు ఈ విభాగంలో కార్యకలాపాలు విస్తరించేందుకు పోటీపడుతున్నాయి. ఇప్పటికే బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్‌ వంటి సంస్థలు ఆన్‌లైన్‌ మాధ్యమంగా నిత్యావసర సరుకులు విక్రయిస్తుండగా.. అమెజాన్‌ కూడా స్థానం పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ మూడు సంస్థలు కలిపి సుమారు 695 మిలియన్‌ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించాయి. ఇందులో అమెజాన్‌దే 500 మిలియన్‌ డాలర్ల ప్రతిపాదన ఉంది. దీనికి కేంద్రం ఆమోదముద్ర కూడా వేసింది.

ప్రస్తుతం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్రం అనుమతిస్తోంది. నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీలు భారత్‌లో పూర్తి స్థాయి అనుబంధ సంస్థను ప్రారంభించి.. ఇక్కడే తయారయ్యే ఆహారోత్పత్తులను స్టోర్స్‌ లేదా ఆన్‌లైన్‌ మాధ్యమంలో విక్రయించుకోవచ్చు. ఈకామర్స్‌ సంస్థగా భారత కొనుగోలుదారులకు సుపరిచితమైన అమెజాన్‌.. ఫుడ్‌ రిటైల్‌లోనూ విస్తరించాలనుకుంటోంది.

నిధులే బలం..
దేశీయంగా ఆహారోత్పత్తుల విక్రయ వ్యాపారం చాలా మటుకు అసంఘటితంగానే ఉంది. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్‌ వంటి ఆన్‌లైన్‌ సంస్థలు తమ తమ స్థాయిల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే, దిగ్గజ సంస్థ అమెజాన్‌కి ఇవి పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేవు. సరుకు సమీకరించుకోవడం నుంచి డెలివరీ దాకా అన్ని విభాగాల్లోనూ రాణించేందుకు అమెజాన్‌కు సామర్థ్యం ఉంది. ఇటీవలే ఫిబ్రవరిలో అమెరికాలో ఫుడ్‌ రిటైల్‌ దిగ్గజంట హోల్‌ ఫుడ్స్‌ మార్కెట్‌ సంస్థను 13.7 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా అక్కడి రిటైల్‌ స్టోర్స్‌ విభాగంలో అమెజాన్‌ పట్టు సాధించే ప్రయత్నాల్లో పడింది.

ఇదే తరహాలో భారత ఫుడ్‌ రిటైల్‌ మార్కెట్లో కూడా దూసుకెళ్లే యోచనలో ఉంది. అమెజాన్‌ వ్యాపార విధానం ఏమిటన్నది ఇంకా పూర్తిగా వెల్లడి కానప్పటికీ.. స్థానిక కిరాణా దుకాణాలతో జత కట్టడం ద్వారా సర్వీసులు అందించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగా స్టోర్స్‌ ఏర్పాటు చేయాలంటే రియల్టీ వ్యయాలు చాలా భారీగా ఉండటం వల్ల అమెజాన్‌.. కిరాణా దుకాణాలవైపే మొగ్గు చూపవచ్చని అంచనా. ఇక పుష్కలంగా నిధులున్న అమెజాన్‌ వంటి దిగ్గజానికి గట్టి పోటీనివ్వాలంటే వాల్‌మార్ట్‌ వంటి మరో దిగ్గజానికే సాధ్యం కాగలదు. అయితే, వాల్‌మార్ట్‌ ప్రస్తుతం హోల్‌సేల్‌ విభాగానికే పరిమితం కాగా.. ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా రిటైల్‌ కొనుగోలుదారులకు ఇప్పటికే చేరువ కావడం అమెజాన్‌కు లాభించే అంశం.

కన్సాలిడేషన్‌కు ఆస్కారం..
భారీ పెట్టుబడులతో అమెజాన్‌ రంగంలోకి దిగడంతో.. ఫుడ్‌ రిటైల్‌లో ఇప్పుడున్న.. ఇకపై రాబోయే ఏ సంస్థ అయినా కూడా దానికి దీటుగా సర్వీసులిస్తేనే నిలదొక్కుకోగలవు. అయితే, ఆ స్థాయిలో మనీ పవర్‌ ఉన్న దేశీ సంస్థలు తక్కువగానే ఉండొచ్చు కాబట్టి.. సంస్థల విలీనాలు, కొనుగోళ్లతో ఈ విభాగంలో కన్సాలిడేషన్‌కి ఆస్కారం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. సుమారు 200 మిలియన్‌ డాలర్లతో బిగ్‌బాస్కెట్‌లో మైనారిటీ వాటాలు దక్కించుకునే ప్రయత్నాల్లో పేటీఎం మాల్‌ ఉంది. ఒకవేళ ఈ డీల్‌ సాకారమైతే.. చైనా దిగ్గజం ఆలీబాబా పెట్టుబడులు ఉన్న పేటీఎం.. అమెజాన్‌కి పోటీనివ్వడానికి కొంత సాధన సంపత్తి సమకూర్చుకున్నట్లవుతుంది. ఇక బిగ్‌బాస్కెట్‌ సైతం అమెజాన్‌కి వాటాలు విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

సవాళ్లు ఉన్నాయ్‌..
ఆన్‌లైన్‌లో పళ్లు, కూరగాయలు కొనుక్కునే ట్రెండ్‌ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. సాధారణంగా దేశీ వినియోగదారులు.. కూరగాయలు, నిత్యావసర సరుకులు వంటివి కొనుక్కునేందుకు మండీలు, కిరాణా స్టోర్లకు వెళ్లడమే పరిపాటి. ఆయా ఉత్పత్తులను స్వయంగా చూసి, తాజా సరుకేనా కాదా అన్నది తెలుసుకున్నాకే కొనుక్కుంటూ ఉంటారు. ప్రస్తుతం చాలా మటుకు కిరాణా వ్యాపారులు హోం డెలివరీ కూడా ఇస్తున్నారు. నిత్యావసర సరుకుల డెలివరీ వ్యాపారంలో పెట్టుబడులు చాలా భారీగా అవసరమవుతాయి.. మార్జిన్లు చాలా స్వల్పంగా ఉంటాయి. చాలా మటుకు సంస్థలు డెలివరీ కార్యకలాపాల్లో భారీగా నష్టాలు చవిచూస్తున్నాయి. ఇలాంటి పరిణామాలతో ఈ–కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌కి చెందిన పెప్పర్‌ట్యాప్‌ ఇప్పటికే మూతబడింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ రిటైల్‌ ఎంత వరకూ నిలదొక్కుకోగలదన్నది చూడాల్సి ఉంటుందనేది విశ్లేషకులు అభిప్రాయం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement