పీఎన్‌బీలో నీరవ్ మోదీ భారీ స్కాం (ఫైల్ ఫోటో)
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయల్లో కన్నం వేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆ నగదును విదేశాలకు తరలించినట్టు తెలిసింది. పీఎన్‌బీ నగదును అక్రమంగా విదేశీ కంపెనీలకు చెల్లించి, డైమాండ్ వ్యాపారాల్లో నీరవ్ మోదీ భారీ మొత్తంలో లబ్ది పొందారు. అయితే ఆ డబ్బు ఎవరికి వెళ్లింది? ఎవరూ ఈ అక్రమ నగదును సొంతం చేసుకున్నారు? అని సర్వత్రా చర్చనీయాంశమైంది. ఔరా జెమ్ కంపెనీ, సినో ట్రేడర్స్ కంపెనీ, యునిటీ ట్రేడింగ్, సన్‌షైన్ జెమ్స్, ట్రై కలర్ జెమ్స్, పసిఫిక్ డైమాండ్ విదేశీ కంపెనీలు ఈ నగదును పొందినట్టు తెలిసింది. గత ఏడేళ్లుగా పీఎన్‌బీ, ఇచ్చిన ఉత్తర్వులపై భారతీయ బ్యాంకులు ఈ కంపెనీలకు డబ్బులు చెల్లించినట్టు ఉంది. ఈ కంపెనీల పేర్లు పీఎన్‌బీ, సీబీఐకి దాఖలు చేసిన ఫిర్యాదులో వెల్లడయ్యాయి. అయితే ఈ నగదును ఎలా వాడారన్నది మిస్టరీగానే ఉంది.
పసిఫిక్ డైమాండ్స్ ఎఫ్‌జడ్‌ఈ, యూనిటీ ట్రేడింగ్ ఎఫ్‌జడ్‌ఈ, ట్రై కలర్ జెమ్స్ ఎఫ్‌జడ్‌ఈ ఈ మూడు యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందినవి కాగ, సన్‌షైన్ జెమ్స్, సినో ట్రేడర్స్ హాంకాంగ్ చెందినవిగా తెలుస్తోంది. ఔరా జెమ్ ఏ దేశ కంపెనీనో ఇంకా తెలియలేదు. తమ విదేశీ కార్యాలయాలు, ఈ కంపెనీల క్రెడిబిలీటిని పరీక్షిస్తున్నాయని, 2010 నుంచి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు సీనియర్ కౌంటర్‌పార్టీ బ్యాంకర్ చెప్పారు. వారం తర్వాత ఈ కంపెనీలపై ఓ నివేదిక వస్తుందని, ఆ సమాచారం మేరకు అంతర్గత విచారణ కూడా చేపడతామని పేర్కొన్నారు. బాహ్యాంగా కన్సల్టెంట్‌ను ఏర్పాటుచేయాలా? లేదా? అన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు.
నీరవ్ మోదీ, మెహల్ చౌక్సి గీతాంజలి జెమ్స్ కంపెనీలతో సంబంధాలున్న మరికొన్ని కంపెనీలను కూడా ఇన్వెస్టిగేటర్లు, బ్యాంకర్లు అనుమానస్పంద కంపెనీలుగా భావిస్తున్నారు. మొత్తం 150 లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్స్ ద్వారా నీరవ్ మోదీ పీఎన్‌బీకి రూ.11,400 కోట్లు కన్నం వేశారు. పీఎన్‌బీ ఉద్యోగులు బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియకుండా ఈ మోసానికి పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment