ఎకరాకు రూ.23 వేలే రుణమాఫీ?
- రుణమాఫీ భారీగా కుదింపునకు అధికారుల కసరత్తు
- సొసైటీల్లో ఖరారవుతున్న లబ్ధిదారుల జాబితాలు
కాళ్ల : రైతు రుణమాఫీ భారాన్ని భారీగా తగ్గించుకుని ఎంతోకొంత మాఫీ చేసి మమ అనిపించుకునేందుకు టీడీపీ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా సొసైటీల్లో మాఫీ లబ్ధి పొందే రైతుల తుది జాబితాలు ఖరారవుతున్నాయి. రేపోమాపో సహకార సంఘాలు ఈ జాబితాలను డీసీసీబీ ద్వారా ప్రభుత్వానికి నివేదించనున్నాయి. జిల్లాలోని 257 సహకార సంఘాల్లో పరిధిలో సుమారు లక్షా 70 వేల మంది రైతులకు రూ.11 వేల కోట్ల పంట రుణాలను డీసీసీబీ అందజేసింది. రుణమాఫీకి తుది జాబితాలు అందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రాత్రింబవళ్లు సహకార సంఘాల ఉద్యోగులు రైతుల వివరాలను కంప్యూటర్లో పొందుపరుస్తున్నారు.
ఏరోజుకారోజు ఒక్కరోజే గడువు ఉందని అధికారులు చెప్పడంతో ఉద్యోగులు పరుగులెత్తుతున్నారు. ఇదిలా ఉండగా రుణమాఫీ వర్తించాలంటే రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్పుస్తకంను అధికారులు తప్పనిసరి చేశారు. అంతేకాకుండా పంట రుణపరపతి పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ప్రకారం రుణాలు మాఫీ చేసేందుకు చాపకింద నీరులా వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. దీని ప్రకారం రుణమాఫీ చేస్తే మొత్తం 15 శాతానికి పడిపోనుంది. ఈ లెక్కన ఎకరానికి రూ.23వేలు చొప్పున రుణమాఫీ అమలుకానుందని తెలిసింది.
ఇక కౌలు రైతులకు రుణమాఫీ అమలు కొండెక్కినట్లే కనిపిస్తోంది. కౌలు రైతుల పేర్లను రుణమాఫీ జాబితాలో చేర్చలేదు. కౌలు రైతులు ఎల్ఈసీ కార్డు అందజేసినా సంబంధిత భూమి యజమాని పట్టాదారు పాస్‌బుక్ కూడా ఇవ్వాలని ఇద్దర్లో ఒకరికే రుణమాఫీ అవుతుందని అధికారులు పేర్కొనడంతో భూమి యజమానులు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. బంగారు ఆభరణాలపై రుణాలు పొందినవారు కూడా పట్టాదారు పాస్ పుస్తాకలు ఇవ్వాలని బ్యాంకర్లు కోరుతున్నారు. ఈపరిణామాలతో రుణమాఫీపై రైతులు పెట్టుకున్న ఆశలు అడిఆశలుగానే మిగిలిపోనున్నాయి.