స్త్రీలకు అభయం ‘నిర్భయ’
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) న్యూస్‌లైన్ : స్త్రీలకు నిర్భయ చట్టం అభయం లాంటిదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.లక్ష్మీశారద అన్నారు. బాలల హక్కులు, చట్టాలు, సంక్షేమ పథకాలపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీశారద మాట్లాడుతూ గతంలో చట్టాల్లో అత్యాచారం అనే పదం మాత్రమే ఉండేదని, నిర్భయ చట్టంలో ఆ పదాన్ని తీసివేసి లైంగిక దాడి అనే పదాన్ని ఉపయోగించారని తెలిపారు. దీని పరిధిని విస్తృతం చేశారని మహిళలు, బాలికలు ఇంటిలో ఉన్నప్పుడు వారికి తెలియకుండా ఫొటోలు తీసినా ఈ చట్టం నేరంగా పరిగణిస్తుందన్నారు. లైంగిక దాడులకు పాల్పడినట్లు రుజువైతే నిర్భయ చట్ట ప్రకారం మరణ శిక్ష, జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలు సైతం విధించే అవకాశముందని హెచ్చరించారు.
బాలికలు స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రేమ పేరుతో మోసపోవద్దని పిలుపునిచ్చారు. తమ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులకు గాని, ఉపాధ్యాయులకుగాని తెలపాలని లేదా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. బాలికలు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు పోలీసులు వారిపై మర్యాదగా నడుచుకోవాలని, అనవసరమైన ప్రశ్నలు వేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తే అటువంటి పోలీసు అధికారులపై కూడా కేసులు నమోదు చేసి శిక్షించే అవకాశముందన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనేలా బాలికలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డెరైక్టర్ కె.రాఘవరావు, ఆ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ వి.వసంతబాల, జిల్లా శిశు రక్షణాధికారి సీహెచ్ సూర్య చక్రవేణి, బాలికాభివృద్ధి అధికారి టి.ఉదయిని పాల్గొన్నారు.