గిరిజనం.. చేదు నిజం
కర్నూలు(అర్బన్) : కర్నూలు డివిజన్లో 48, ఆదోనిలో 18, నంద్యాల డివిజన్లో 117 మంది గిరిజనులు హెచ్ఐవీ బారిన పడ్డారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో స్త్రీ, పురుషులు సమాన నిష్పత్తిలో ఉన్నారు. ఆయుష్షు పెంచుకునేందుకు మందులు వాడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఐటీడీఏ ఏపీవో మురళీధర్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ బాధితులను కలుసుకొని వారి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
అసలు దోషి పేదరికమే...
వాస్తవానికి గిరిజనుల ఆర్థిక పరిస్థితే ఈ మొత్తం సమస్యకు కారణమనే వాదన వినిపిస్తోంది. ఉన్న చోటనే ఆహారం దొరకని దుస్థితిని గిరి జనులు ఎదుర్కొంటున్నారు. దీంతో వేరే చోటికి వలసలు వెళ్లి పొట్ట నింపుకోవాల్సి వస్తోంది. దీంతో పనికి వెళ్లిన చోట బలవంతపు లైంగిక వేధింపులకు గురికావాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికితోడు గిరిజన కుటుంబాల్లో పురుషులు ప్రధానంగా మద్యానికి బానిసలుగా ఉంటున్నారు.
దీంతో చిన్న వయసులోనే వీరు మృత్యువాత పడుతున్నారు. తద్వారా వీరిని నమ్ముకున్న మహిళలు వితంతువులుగా మారుతున్నారని నల్లమల సొసైటీ అధ్యక్షుడు పురుష్తోతం పేర్కొన్నారు. ‘చిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతుండటంతో వారు మైదాన ప్రాంతాలకు వ్యక్తిగత పనులకు వచ్చిన సందర్భాల్లో ఇతరులను నమ్మి మోసపోవడం వల్ల కూడా వారు అనార్యోలకు గురవుతున్నారని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు పురుషోత్తం చెబుతున్నారు.
ఆర్థిక చేయూత...
జీవో 31 ప్రకారం గిరిజనుల ఆర్థికాభివృద్ధి పథకం అమ లు చేస్తున్నారు. గిరిజనుల్లో బాగా వెనుకబడిన వికలాంగులు, హెచ్ఐవీ బాధితులకు ఈ పథకం కింద ఆర్థిక చేయూతను అందించనున్నారు. వీరికి కనీసం ఒక్కో కుటుంబానికి రూ.లక్షకు తగ్గకుండా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో 90 శాతం సబ్సిడీ కాగా, మిగిలిన 10 శాతాన్ని ఐటీడీఏ అధికారులే స్త్రీ నిధి బ్యాంకు నుంచి రుణంగా ఇప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.
అవగాహన సదస్సులు:
హెచ్ఐవీ బారిన పడి దుర్భరమైన జీవితాలను గడుపుతున్న గిరిజనులకు ప్రభుత్వం ద్వారా కనీస ఆర్థిక చేయూతను అందించేందుకు చర్యలు చేపట్టాం. అడిషనల్ డీఎంఅండ్హెచ్ఓ ద్వారా జిల్లాలోని మూడు డివిజన్లలోని గ్రామాలను పర్యటించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.
-పీ మురళీధర్, ఐటీడీఏ ఏపీఓ