paalamooru
-
నాలుగేళ్లలో 'పాలమూరు'
ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇంజనీరింగ్, ఫైనాన్స్, పాలనా వ్యవహారాలన్నీ దాని పరిధిలోకే సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో విధులు.. శరవేగంగా పనులు జరిగేలా చర్యలు 'ప్రాణహిత'లో మిడ్‌మానేరు- నిజాంసాగర్ మధ్య లైడార్ సర్వే వేర్వేరు ఎత్తులో 'తుమ్మిడిహెట్టి' ముంపుపైనా అధ్యయనం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు, రాష్ట్ర రాజధానికి తాగునీరు అందించే ప్రతిష్టాత్మక ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకాన్ని నాలుగేళ్లలో పూర్తిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మానస పుత్రిక అయిన ఈ ప్రాజెక్టు పనులను శరవేగంగా చేపట్టేందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది. ఇంజనీరింగ్ నైపుణ్యం నుంచి భూసేకరణ, ఫైనాన్స్, వివిధ ఏజెన్సీలను సమన్వయం చేయడం, పాలనా వ్యవహారాలు వంటి బాధ్యతలన్నీ ఈ అథారిటీకి అప్పగించనుంది.ఈ మేరకు అథారిటీ ఏర్పాటు చేస్తూ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో నిర్ణయించిన మేరకు నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలన్న లక్ష్యంతోనే ఈ అథారిటీ ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. వీలైనంత వేగంగా: రూ.35,200కోట్లతో చేపడుతున్న ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తిచేసేందుకు అథారిటీ ఏర్పాటు చేయాలని నెల రోజుల కింద కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అథారిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారి చైర్మన్‌గా వ్యవహరిస్తారని అందులో తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణ నైపుణ్యంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేసుకునేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేయాలని జూన్ 11న జరిగిన శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారని ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రస్తుతం చాలా ప్రాజెక్టుల్లో భూసేకరణ, సహాయ పునరావాసం పెద్ద సమస్యగా మారి సమయానికి ప్రాజెక్టుల పూర్తికి అవరోధంగా మారిందని... అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ప్రాజెక్టు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రాజెక్టులో భాగంగా ఉండే ఇంజనీరింగ్, భూసేకరణ, ఫైనాన్స్, ప్రాజెక్టు మానిటరింగ్, కార్యాలయ పరిపాలనా విభాగాలన్నీ అథారిటీ కింద పనిచేస్తాయన్నారు. కొత్త భూసేకరణ చట్టం మేరకు పరస్పర అంగీకారంతో భూములను తీసుకోవడానికి లేక సేకరించడానికి అథారిటీకి అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ప్రాజెక్టుకు ఏవైనా అడ్డంకులు ఎదురైతే, వాటిని గుర్తించి, అధిగమించాల్సిన చర్యలను ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ చూస్తుందని... ఏయే పనులను ఎంత కాలంలో చేయాలో నిర్ధారిస్తుందని వెల్లడించారు. ఇక ఫైనాన్స్ యూనిట్ ఆర్థిక నిబంధనలకు లోబడి ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు విధానాలు రూపొందించుకోవచ్చని... అవసరాల మేరకు నిధులను నేరుగా ఖర్చు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాణహిత లైడార్ సర్వేకు రూ. 2.85 కోట్లు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మిడ్‌మానేరు నుంచి నిజాంసాగర్ వరకు లైడార్, డీజీపీఎస్ సర్వే చేసేందుకు వ్యాప్కోస్‌కు బాధ్యతలు కట్టబెడుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. సమగ్ర సర్వే నివేదిక కోసం రూ. 2.85 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. మిడ్‌మానేరు-తడ్కపల్లి-గంధమల-బస్వాపూర్-పాములపర్తి-నిజాంసాగర్ వరకు నీటి సరఫరా వ్యవస్థ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ఏర్పాటుతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మిస్తే జరిగే ముంపు ప్రాంతాన్ని సైతం అధ్యయనం చేయనున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద గతంలో సర్వేలు జరిగినా లైడార్ సర్వే చేయలేదు. లైడార్ సర్వే చేస్తే.. మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా 148 మీటర్ల ఎత్తు నుంచి 149, 150, 151, 152 మీటర్ల వరకు ఎంతెంత ముంపు ఉంటుందన్నది కచ్చితంగా తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. -
పాలమూరులో 56 శాతం
-
పాలమూరులో 56 శాతం
జిల్లాలో ‘మండలి’ పోలింగ్ ప్రశాంతం మహబూబ్‌నగర్‌లో అత్యల్ప ఓటింగ్ తలకొండపల్లిలో ప్రలోభాల పర్వం? జడ్చర్లలో మంత్రి లక్ష్మారెడ్డి ఓటింగ్ 25న హైదరాబాద్‌లో లెక్కింపు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ ఒకటి రెండు స్వల్పఘటనలు మిన హా అంతా సవ్యంగానే సాగింది. జిల్లాలో 68,721 మంది ఓటర్లకు 56శాతం మంది పట్టభద్రులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్‌లో అత్యల్పం గా పోలింగ్ శాతం నమోదైంది. మహబూబ్‌నగర్ ప్ర భుత్వ మహిళా డిగ్రీ కాలేజీలోని 41వ పోలింగ్ బూత్‌లో 650 మంది ఓటర్లకు 170 మంది మాత్రమే (26శాతం) ఓటువేశారు. గద్వాల ఆదిలక్ష్మమ్మ కాలేజీలోని 83వ పో లింగ్ బూత్లోనూ కేవలం 27 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. సీసీకుంట మండలంలో అత్యధికంగా 85.37 శాతం నమోదైంది. 335 మంది ఓటర్లకు 286 మంది పట్టభద్రులు ఓట్లువేశారు. తలకొండపల్లి మం డల కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.41వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంపిణీ కోసం తెచ్చారనే అనుమానంతో అధికారులకు సమాచారమందించారు. ఘటనపై విచారణ జరిపిన అధికారులు సదరు ఓటరు వ్యక్తిగత అవసరాల కోసమే డబ్బులు వెంట తెచ్చుకున్నట్లు నిర్ధారించుకుని తిరిగి ఇచ్చేశారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ వద్ద ఓ ఉపాధ్యాయ సంఘానికి చెందిన కొందరు ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు తోపులాటకు దిగడంతో పోలీసులు చెదరగొట్టారు. ఆ తర్వాత ఇరువర్గాలు స్థానిక పోలీసుస్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మందకొడిగా పోలింగ్ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఉదయం 10 గంటల వరకు 8శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 22శాతం పోలింగ్ నమోదైంది. కోస్గిలో సాయంత్రం నాలుగు గంటల తర్వాత కూడా ఓటర్లు బారులు తీరడంతో టోకెన్లు అందజేసి మరో అరగంట పాటు పోలింగ్ కొనసాగించారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ శిబిరాలు ఏర్పాటు చేసి ఓటర్లను చివరి నిముషంలో ప్రసన్నం చేసుకునేందుకు యత్నించారు. ఆరోగ్యశాఖ మంత్రి సి.ల క్ష్మారెడ్డి జడ్చర్లలో, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవికుమార్‌గుప్తా కొత్తూరులో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు బాలానగర్, జడ్చర్ల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నియోజకవర్గ కేంద్రంలో మకాం వేసి పోలింగ్ సరళిపై ఆరాతీశారు. కలెక్టర్ టీకే శ్రీదేవి కల్వకుర్తిలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థుల తరఫున కార్యకర్తలు ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలను సమకూర్చారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో బ్యాలెట్ బాక్స్‌లను ఆదివారం రాత్రికి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌కు తరలిస్తున్నారు. సోమవారం ఉదయం బ్యాలెట్ బాక్సులను హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ విక్టరీ ప్లే గ్రౌండ్‌కు తరలిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ నెల 25న వీపీజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. -
పాలమూరు పురోగతికి సమష్టిగా కృషి చేద్దాం
మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సమష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ శ్రీదేవి పిలుపునిచ్చారు. 66వ గణతంత్ర వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆమె జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా అన్ని విభాగాలు దృష్టి సారించాలన్నారు. ఆయా శాఖల ద్వారా చేపడుతున్న పథకాలు, వాటి ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధిని ఆమె వివరించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ విశ్వప్రసాద్, ఇన్చార్జ్ జేసీ రాజారాం, డీఆర్వో ఎం.రాంకిషన్, ఏఎస్పీ మల్లారెడ్డి, ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.