- ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- ఇంజనీరింగ్, ఫైనాన్స్, పాలనా వ్యవహారాలన్నీ దాని పరిధిలోకే
- సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో విధులు.. శరవేగంగా పనులు జరిగేలా చర్యలు
- 'ప్రాణహిత'లో మిడ్‌మానేరు- నిజాంసాగర్ మధ్య లైడార్ సర్వే
- వేర్వేరు ఎత్తులో 'తుమ్మిడిహెట్టి' ముంపుపైనా అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు, రాష్ట్ర రాజధానికి తాగునీరు అందించే ప్రతిష్టాత్మక ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకాన్ని నాలుగేళ్లలో పూర్తిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మానస పుత్రిక అయిన ఈ ప్రాజెక్టు పనులను శరవేగంగా చేపట్టేందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది. ఇంజనీరింగ్ నైపుణ్యం నుంచి భూసేకరణ, ఫైనాన్స్, వివిధ ఏజెన్సీలను సమన్వయం చేయడం, పాలనా వ్యవహారాలు వంటి బాధ్యతలన్నీ ఈ అథారిటీకి అప్పగించనుంది.ఈ మేరకు అథారిటీ ఏర్పాటు చేస్తూ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో నిర్ణయించిన మేరకు నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలన్న లక్ష్యంతోనే ఈ అథారిటీ ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
వీలైనంత వేగంగా: రూ.35,200కోట్లతో చేపడుతున్న ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తిచేసేందుకు అథారిటీ ఏర్పాటు చేయాలని నెల రోజుల కింద కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అథారిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారి చైర్మన్‌గా వ్యవహరిస్తారని అందులో తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణ నైపుణ్యంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేసుకునేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేయాలని జూన్ 11న జరిగిన శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారని ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రస్తుతం చాలా ప్రాజెక్టుల్లో భూసేకరణ, సహాయ పునరావాసం పెద్ద సమస్యగా మారి సమయానికి ప్రాజెక్టుల పూర్తికి అవరోధంగా మారిందని... అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ప్రాజెక్టు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.
ప్రాజెక్టులో భాగంగా ఉండే ఇంజనీరింగ్, భూసేకరణ, ఫైనాన్స్, ప్రాజెక్టు మానిటరింగ్, కార్యాలయ పరిపాలనా విభాగాలన్నీ అథారిటీ కింద పనిచేస్తాయన్నారు. కొత్త భూసేకరణ చట్టం మేరకు పరస్పర అంగీకారంతో భూములను తీసుకోవడానికి లేక సేకరించడానికి అథారిటీకి అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. ఇక ప్రాజెక్టుకు ఏవైనా అడ్డంకులు ఎదురైతే, వాటిని గుర్తించి, అధిగమించాల్సిన చర్యలను ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ చూస్తుందని... ఏయే పనులను ఎంత కాలంలో చేయాలో నిర్ధారిస్తుందని వెల్లడించారు. ఇక ఫైనాన్స్ యూనిట్ ఆర్థిక నిబంధనలకు లోబడి ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు విధానాలు రూపొందించుకోవచ్చని... అవసరాల మేరకు నిధులను నేరుగా ఖర్చు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రాణహిత లైడార్ సర్వేకు రూ. 2.85 కోట్లు
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మిడ్‌మానేరు నుంచి నిజాంసాగర్ వరకు లైడార్, డీజీపీఎస్ సర్వే చేసేందుకు వ్యాప్కోస్‌కు బాధ్యతలు కట్టబెడుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. సమగ్ర సర్వే నివేదిక కోసం రూ. 2.85 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. మిడ్‌మానేరు-తడ్కపల్లి-గంధమల-బస్వాపూర్-పాములపర్తి-నిజాంసాగర్ వరకు నీటి సరఫరా వ్యవస్థ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ఏర్పాటుతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మిస్తే జరిగే ముంపు ప్రాంతాన్ని సైతం అధ్యయనం చేయనున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద గతంలో సర్వేలు జరిగినా లైడార్ సర్వే చేయలేదు. లైడార్ సర్వే చేస్తే.. మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా 148 మీటర్ల ఎత్తు నుంచి 149, 150, 151, 152 మీటర్ల వరకు ఎంతెంత ముంపు ఉంటుందన్నది కచ్చితంగా తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.