
రాజధాని కోసం ప్రత్యేక అథారిటీ
పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ వెల్లడి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేక అథారిటీని నియమిస్తున్నట్టు పురపాలకశాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ తెలిపారు. కలెక్టర్లు, మున్సిపాలిటీ అధికారులతో సంబంధం లేకుండా ఈ అథారిటీకి ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నట్టు చెప్పారు. గత మూడు రోజులుగా వివిధ రాజధాని నగరాలను పరిశీలించి వచ్చిన నేపథ్యంలో మంత్రి నారాయణ శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. తొలి దశలో నిర్మాణంలో భాగంగా సచివాలయం, అసెంబ్లీ, కొన్ని పరిపాలనా భవనాలు మూడేళ్లలో పూర్తిచేస్తామన్నారు.
రాజధాని చుట్టూ (గుంటూరు-తెనాలి-గన్నవరం-ఇబ్రహీంపట్నం) 185 కిలోమీటర్లతో రింగ్‌రోడ్డు నిర్మించనున్నామని, ఈ రింగురోడ్డు పరిధిలో (ఇన్నర్ సర్కిల్‌లో) 6 లక్షల ఎకరాల్లో నగరం ఉంటుందని నారాయణ అన్నారు.
చండీగఢ్, నయా రాయ్‌పూర్, గాంధీనగర్ నగరాలను పరిశీలించామని, అక్కడి స్థలాల సేకరణ, ల్యాండ్ పూలింగ్ పద్ధతులు పరిశీలించామని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఇక్కడ కూడా భూముల సేకరణ చేస్తామని మంత్రి అన్నారు.
చండీగఢ్ బావుంది..
ప్రస్తుతం రాజధాని సలహా కమిటీ పరిశీలించి వచ్చిన అన్ని నగరాలకంటే చండీగఢ్ నగరం అద్భుతంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. ఇది రెండు రాష్ట్రాలకు రాజధాని అయినందున అభివృద్ధి వేగంగా జరిగిందన్నారు. గాంధీనగర్ నిర్మాణంలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించారని, నయా రాయ్‌పూర్ కూడా చక్కటి రహదారులతో పాటు గ్రీన్‌సిటీ రూపకల్పన అద్భుతంగా జరిగిందన్నారు.
22 తర్వాత సింగపూర్, పుత్రజయలలో పర్యటన
ఈ నెల 22 తర్వాత సింగపూర్, పుత్రజయలలో పర్యటించనున్నామని, వచ్చేనెల 5 తర్వాత చైనాలో షాంఘై, ఉత్తర కొరియాలలో బృందం పర్యటిస్తామని మంత్రి తెలిపారు. ఈ నగరాల పర్యటన అనంతరం రాజధాని సలహా కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని, ఆ తర్వాత ముఖ్యమంత్రి పలువురితో చర్చించి నిర్ణయిస్తారన్నారు.