
'పొలాలు ఖాళీ చేయండి'
తాడికొండ: గుంటూరు జిల్లా రైతులు ఏప్రిల్ 15వ తేదీలోగా పొలాలను ఖాళీ చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అల్టిమేటం జారీ చేశారు. ఖాళీ అయితే రాజధాని అభివృద్ధి పనులకు సన్నాహాలు చేస్తామని స్పష్టం చేశారు. తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఇప్పటి వరకూ 1,100 ఎకరాల భూములిచ్చిన రైతులకు కౌలు చెక్కులు అందజేశామని తెలిపారు. మిగతా వారికి పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించి, కంప్యూటర్‌లో పొందుపరచి చెక్కులు అందిస్తామని వివరించారు. పది రోజుల్లో చెక్కుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. రాజధాని నిర్మాణ విషయంలో ఈ నెల 29న సీఎంతో సింగపూర్ వెళ్లనున్నట్లు ప్రకటించారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని కొండవీటివాగును టూరిజం కింద అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ప్రతిపాదన మేరకు సీఎం చంద్రబాబు అనంతవరంలోనే ఉగాది వేడుకలు నిర్వహించేందుకు సమ్మతించారని చెప్పారు. సీఎం పర్యటన వివరాలు ముడు రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ.. అనంతవరంలోనే పూర్తి స్థాయి ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు.