
వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ
జిల్లాలో ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన
సాక్షి, హన్మకొండ: వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన బుధవారం సాయంత్రం ముగిసింది. పర్యటన సందర్భంగా జిల్లా, నగర అభివృద్ధికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. మంగళ, బుధవారాల్లో జిల్లా, నగర అభివృద్ధికి సంబంధించి మొత్తం 86 అంశాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. బుధవారం ఉదయం 11:20 గంటలకు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న సీఎం.. గుడుంబా నిర్మూలన కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా గుడుంబా తయారీ నుంచి తప్పుకున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు జిల్లాకు రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
గుడుంబా నిర్మూలనకు కృషి చేసిన అధికారుల వివరాలను అందజేస్తే వారికి ప్రోత్సాహకాలు, పదోన్నతులు కల్పించే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మధ్యాహ్నం నందనా గార్డెన్‌లో నగర అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో ఉన్న హంటర్ రోడ్డును ఆరు లేన్ల రహదారిగా విస్తరించాలని, ఇందుకు అవసరమయ్యే నిధులు బడ్జెట్‌లో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వరంగల్ కలెక్టరేట్, కార్పొరేషన్, కమిషనరేట్, ఎంజీఎంలతో పాటు పాత ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు.
జర్నలిస్టు కాలనీ నిర్మిస్తా
డబుల్ బెడ్‌రూం పథకానికి అదనంగా నిధులు వెచ్చించి వరంగల్‌లో జర్నలిస్టు కాలనీని నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. హైదరాబాద్ జర్నలిస్టులు అసూయ పడేలా తానే బాధ్యత వహించి ఈ కాలనీని కట్టిస్తానన్నారు. జెనెసిస్ అనే ఆర్కిటెక్చర్‌తో కాలనీని డిజైన్ చేయిస్తానని తెలిపారు. ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసి ఏడాదిలోగా ఇళ్లను ప్రారంభించేలా పనులు చేపడతామన్నారు. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు, కెమెరామెన్లు, చిన్న పత్రికల రిపోర్టర్లు, వీడియో జర్నలిస్టులు.. ఇలా జర్నలిస్టుందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. మధ్యాహ్నం కొండా దంపతుల ఇంటికి భోజనానికి వెళ్లిన సీఎం.. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు పయనమయ్యారు.