రెండు రోజుల్లో పీఏబీఆర్ నుంచి నీరు
కూడేరు : మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన సమగ్ర గ్రామీణ రక్షిత నీటి పథకం నుంచి రెండు రోజుల్లో మండలంలోని గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరాంనాయక్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గతంలో ఆందోళనకు దిగినపుడు అధికారులు తేదీలు ప్రకటిస్తూ వచ్చారు. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని వెంటనే ప్రాజెక్ట్ను ప్రారంభించాలని ఆదేశించినట్లు సమాచారం.
అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఏమీ చెప్పలేక అధికారులు లోలోపలే ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఉన్నతాధికారులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ కావడంతో బుధవారం నీటిని సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా నియోజకవర్గ టీడీపీ నేత ఫోన్ చేసి ‘మళ్లీ నేను ఫోన్ చేస్తా.. అంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దు’ అని హుకుం జారీ చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.