సోమయాజులు లేని లోటు పూడ్చలేనిది
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు, దివంగత డీఏ సోమయాజులు మహామేధావి, అ పార విజ్ఞానఖని, గొప్ప మానవత్వం ఉన్న మనిషని, సమయస్ఫూర్తిలో అందరికన్నా మిన్నగా ఉండేవారని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. సమకాలీన ప్రపంచంలో అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటా రని కొనియాడారు. ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ సెంటర్లో కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఘనంగా జరిగింది. సోమయాజులు తల్లి సుబ్బలక్ష్మి, భార్య కళ్యాణి, కుమారుడు డీఏ కృష్ణ, కుమార్తె సువర్ణను పలువురు ప్రముఖులు కలసి ధైర్యం చెప్పారు. సోమయాజులుతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నా రు. గొప్ప మానవత్వం ఉన్న మహామనిషి సోమ యాజులు అన్న ఇకలేరంటే చాలా బాధనిపిస్తోందని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ అన్నారు. వైఎస్సార్, సోమయాజులు ఆశయాలు, లక్ష్యాలు ఒక్కటేనని.. క్లిష్ట సమయంలో తమ కుటుం బానికి అండగా ఉండేవారని, ఆయన మరణం వైఎస్సార్సీపీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
సోమయాజులు మంచి ఆప్తుడు, ఆత్మీయుడని, ఎప్పటికీ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. వైఎస్సార్సీపీకి ఇది కీలక సమయమని, ఈ సమయంలో ఆయన లేకపోవడం పెద్ద లోటని లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. సొమ యాజులంత తెలివైన వ్యక్తిని ఇక చూడలేమని డాక్టర్ గురివిరెడ్డి చెప్పారు. అన్ని విషయాల్లోనూ అత్యంత లోతైన పరిశీలన చేసిన మేధావి, దార్శనికుడిని కోల్పోవటం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ప్రధా న కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం పరితపించిన మేధావి, తమలాంటి వారికి గురువుగా ఉండేవారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేసుకున్నారు. అనేక అంశాలపై అభిప్రాయాల్ని తెలియ జేసి, దిశా నిర్దేశం చేసేవారని, ఆ మహనీయుడు మళ్లీ పుట్టాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.
సోమయాజులు లేని లోటు తీర్చలేనిదని, ఆయన మరణం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీని అన్ని విధాలుగా బాధించిందని వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతి సబ్జెక్టులో విషయాలు సోమయాజులుకు తెలిసి నంతగా ఇతరులకు తెలియవని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు అన్నారు. సోమయాజులు వాకింగ్ ఎన్ సైక్లోపీడియా అని, మేధావే కాదు.. మంచి సంగీత ప్రియుడని మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ అన్నారు. ఎనర్జీ రంగంపై సోమ యాజులుకున్న పట్టు తిరుగులేనిదని, ఆయనను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా సోమయాజులు ఉండగా ఆయన వద్ద చాలా నేర్చు కున్నానని విశ్రాంత చీఫ్ సెక్రటరీ మోహన్ కందా చెప్పారు. మార్గదర్శిగా, గైడ్‌గా సోమయాజులు తమను ముందుకు నడిపించారని ఏపీ మాజీ మంత్రి ఆనం రామనారా యణ రెడ్డి అన్నారు.
ఆత్మీయుడ్ని కోల్పోయామని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారా యణ, అంబటి రాంబాబు, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాద్‌రెడ్డి, ఎమ్మెల్యే కో న రఘుపతి, పార్టీ నేతలు మోపిదేవి వెంకటరమణ, వాసిరెడ్డి పద్మ, నారమిల్లి పద్మజ, ఎస్.దుర్గాప్రసాద్ రాజు, విజయ చందర్, మాజీ ఎంపీలు కొణతాల రామకృష్ణ, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు, పారిశ్రామికవేత్త రఘు రామరాజు, మాజీ డీజీపీ అరవిందరావు, శాంతా బయోటిక్స్ అధినేత వరప్రసాద్‌రెడ్డి, ఎం.ప్రతాప్, మోహన్ కుమార్, జి.విష్ణు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కార్మిక నేత జనక్‌ప్రసాద్, పూర్వపు ప్రెస్ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.