నోట్ల రద్దుపై మోదీని పిలవం
పెద్దనోట్ల రద్దు విషయం మీద వివరణ ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని పార్లమెంటరీ కమిటీ ముందుకు పిలిచేది లేదని కమిటీ సభ్యులు తెలిపారు. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ప్రధానిని కూడా విచారణకు పిలిపిస్తామని పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ కేవీ థామస్ (కాంగ్రెస్) ఇంతకుముందు చెప్పారు. కానీ సభ్యులు మాత్రం దానికి విరుద్ధంగా చెప్పడం విశేషం. దేశంలో అప్పటివరకు చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ విచారణ జరుపుతోంది. ప్రభుత్వ సలహా మేరకే తాము పెద్దనోట్ల రద్దుకు చర్య తీసుకున్నట్లు రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ ఇంతకు ముందు ఈ కమిటీకి రాతపూర్వకంగా చెప్పారు.
పీఏసీ చైర్మన్ కేవీ థామస్ చెప్పిన విషయాలతో కమిటీలోని ముగ్గురు బీజేపీ సభ్యులు తీవ్రంగా విభేదించారు. ప్రధానమంత్రిని విచారణకు పిలిచే అవకాశం లేదని వాళ్లు స్పష్టం చేశారు. అందుకు నిబంధనలు అనుమతించబోవని తెలిపారు. సాక్ష్యం ఇవ్వడానికి లేదా మరే ఇతర అవసరం కోసం ఆయనను పిలవలేమని తెలిపారు. 2జీ స్కాం విషయంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను విచారణకు పిలవాలని అప్పటి పీఏసీ చైర్మన్ మురళీ మనోహర్ జోషి భావించగా, కమిటీలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ సభ్యులు కూడా దానికి తీవ్రంగా వ్యతిరేకించారు.