Pace bowler Mohammad Siraj
-
రాటుదేలుతున్న సిరాజ్.. బుమ్రాను మరిపిస్తూ, టీమిండియా గర్వపడేలా..!
Mohammed Siraj: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలి కాలంలో టీమిండియా ప్రధాన బౌలర్‌గా మారిపోయాడనడం అతిశయోక్తి కాదు. గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా అతని ప్రదర్శనను ఓసారి గమనిస్తే ఈ విషయం ఇట్టే స్పష్టమవుతుంది. 2017లో అతడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి 2021 ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ వరకు సిరాజ్‌పై పలు అపవాదులు ఉండేవి. పరుగులు ధారాళంగా సమర్పించుకుంటాడు, వికెట్లు పడగొట్టలేడు, పవర్ ప్లేలో పూర్తిగా చేతులెత్తేస్తాడు, లైన్ అండ్ లెంగ్త్ మెయింటెయిన్ చేయడు.. ఇలా తనలోని లోపాలన్నిటినీ ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు సైతం వేలెత్తి చూపేవారు. దీనికి తోడు నాటి జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మెహర్భానిపై జట్టులో నెట్టుకొస్తున్నాడు అన్న పుకార్లు ఉండేవి. అయితే గత ఏడాదిన్నర కాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సిరాజ్.. తనలోని లోపాలను అధిగమించి, టీమిండియా ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. తనకు మద్దతుగా నిలిచిన కోహ్లిని కాలర్ ఎగరేసుకునేలా చేయడంతో పాటు యావత్ భారతావని గర్వపడేలా రాటుదేలాడు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా లేని లోటును సైతం పూడుస్తూ, జనాలు పేసు గుర్రాన్ని (బుమ్రా) మరిచిపోయేలా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. నిన్న తన సొంత మైదానమైన ఉప్పల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ నుంచి.. అంతకుముందు అతనాడిన 10 మ్యాచ్‌లపై ఓ లుక్కేస్తే సిరాజ్ ఇటీవలి కాలంలో ఎంతలా రాటుదేలాడో అర్ధమవుతుంది. కివీస్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్న సిరాజ్.. తన కోటా ఓవర్లు మొత్తం పూరిచేసి 4 కీలక వికెట్లు పడగొట్టి, టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతకుమందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో 2/30, రెండో వన్డేలో 3/30, మూడో వన్డేలో 4/32.. ఇలా మ్యాచ్ మ్యాచ్‌కు తనలోని టాలెంట్‌ను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. అంతకుమందు బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో 4, రెండో టెస్ట్‌లో 2 వికెట్లు.. అదే జట్టుతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 3/32, రెండో మ్యాచ్‌లో 2/73, మూడో మ్యాచ్‌లో 1/27 గణాంకాలతో ఈ పర్యటన మొత్తంలో 12 వికెట్లు నేలకూల్చాడు. బంగ్లా పర్యటనకు ముందు జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో ఆకాశమే హద్దుగా చెలరేగిన సిరాజ్.. రెండో టీ20లో 2/24, మూడో టీ20లో 4/17 గణాంకాలు నమోదు చేసి పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్న ఈ హైదరాబాదీ పేసర్.. టీమిండియా తరఫున 15 టెస్ట్‌ల్లో 46 వికెట్లు, 20 వన్డేల్లో 37 వికెట్లు, 8 టీ20ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. సీనియర్ల గైర్హాజరీలో భారత పేస్ అటాక్‌ను అద్భుతంగా లీడ్ చేస్తున్న సిరాజ్ మున్ముందు మరింత రాణించాలని ఆశిద్దాం. -
భారత్ వెళ్లేందుకు బోర్డు అవకాశం ఇచ్చినా...
ముంబై: తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ను హైదరాబాద్ పంపించేందుకు బీసీసీఐ సన్నద్ధమైనా... అతను అంగీకరించలేదు. టూర్ మధ్యలో వెనక్కి రాకుండా సిడ్నీలోనే ఉండిపోవాలని అతను నిర్ణయించుకున్నాడని బోర్డు వెల్లడించింది. ‘తండ్రి మరణవార్త అనంతరం సిరాజ్‌తో బీసీసీఐ అధికారులు మాట్లాడారు. ఇలాంటి బాధాకర సమయంలో కుటుంబంతో ఉండే విధంగా భారత్‌కు తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే అతను హైదరాబాద్‌కు వెళ్లకుండా ఆస్ట్రేలియాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. జట్టుతోపాటు ప్రాక్టీస్ కొనసాగిస్తానని సిరాజ్ అన్నాడు. అతని బాధను పంచుకుంటూ బోర్డు ఈ స్థితిలో సిరాజ్‌కు అండగా నిలుస్తుంది’ అని బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు సిరాజ్‌కు ధైర్యం చెబుతూ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ‘ఈ బాధను అధిగమించే శక్తి అతనికిప్పుడు కావాలి. ఆసీస్ పర్యటనలో అతను రాణించాలని కోరుకుంటున్నా. అతని మనోధైర్యానికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశాడు. భారత్ తరఫున 1 వన్డే, 3 టి20లు ఆడిన సిరాజ్ ఇప్పటి వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఆసీస్ పర్యటనలో అతను టెస్టు సిరీస్‌కు మాత్రమే ఎంపికయ్యాడు. -
కోహ్లి వికెట్ తీయాలనుంది!
ఐపీఎల్‌తో మా కష్టాలన్నీ తీరతాయి పేస్ బౌలర్ సిరాజ్ హైదరాబాద్: ఆటో డ్రైవర్ కొడుకైనా సరే... అంకితభావం, పట్టుదల ఉంటే పెద్ద స్థాయికి చేరవచ్చనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్. ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 2 కోట్ల 60 లక్షలకు దక్కించుకుంది. చాలీచాలని సంపాదనతో కూడా తనను ప్రోత్సహించిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునే సమయం వచ్చిందని అతను అంటున్నాడు. ‘మా నాన్న గౌస్ ఆటోడ్రైవర్‌గా ఎంతో కష్టపడ్డారు. అమ్మ షబానా కూడా కొన్నిసార్లు పని చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ వేలం మా జీవితాలను మార్చేస్తుందని నమ్ముతున్నా. ఒక మంచి ఇల్లు కొనుక్కొని వారిద్దరిని బాగా చూసుకుంటాను’ అని సిరాజ్ ‘సాక్షి టీవీ’తో చెప్పాడు. ఐపీఎల్లో అవకాశం దక్కాలన్న తన కల పూర్తయిందని, ఇక ముందు భారత జట్టుకు ఆడటమే తన లక్ష్యమని అతను అన్నాడు. ‘టెన్నిస్ బాల్తోనే ఫ్రెండ్స్‌తో కలిసి ఆట మొదలు పెట్టాను. బంతి ఏదైనా వేగంగా విసరడం ఒక్కటే నాకు తెలి సింది. అదే ఇక్కడికి తీసుకొచ్చింది. అవకాశం దక్కిన ప్రతీసారి నా టాలెంట్‌ను చూపించా. ఈ ప్రయాణంలో నాకు అమ్మా నాన్న, మామయ్యతో పాటు కోచ్‌లు అర్జున్ యాదవ్, భరత్ అరుణ్ ఎంతో సహకరించారు. ప్రాథమిక అంశాలు ఎక్కడా నేర్చుకోకపోయినా వారిచ్చిన ప్రోత్సాహం వల్లే రాణించగలిగాను’ అని సిరాజ్ వెల్లడించాడు. నా ఫేవరెట్ స్టార్క్... ముందుగా తాను కూడా బ్యాట్స్‌మన్ కావాలనే భావించానని, అయితే ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ స్టార్క్ వేగం చూసిన తర్వాత పేస్ బౌలింగ్‌పై మక్కువ పెరిగిందని సిరాజ్ పేర్కొన్నాడు. ‘నా ఫేవరెట్ బౌలర్ స్టార్క్. అతనిలాగే పదునైన యార్కర్లు సంధిం చడం చాలా ఇష్టం. 140 కిలోమీటర్లకు పైగా వేగంతో మంచి బౌన్సర్లూ సంధించగలను కానీ నా బలం ఇన్స్వింగ్గా భావిస్తా. అవకాశం దొరి కితే కోహ్లి వికెట్ తీయాలని కోరుకుంటున్నా’ అని సిరాజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా ఎలాంటి ట్రైనింగ్, జిమ్ లేకుండా సహజంగానే ఒక పేసర్‌కు ఉండే ఫిట్‌నెస్‌కు తనకు ఉందని, మున్ముందు దీనిని మరింతగా మెరుగు పర్చుకుంటానని అతను చెప్పాడు. తల్లిదండ్రుల దీవెనలతో ఇక్కడి వరకు చేరానని, ఐపీఎల్లో అంచనాలు నిలబెట్టుకుంటానని చెప్పిన సిరాజ్... ఈ నెల 25 నుంచి జరిగే వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి సన్నద్ధమవుతున్నాడు. కొడుకును కోల్పోయిన పదేళ్లకు... మొహమ్మద్ గౌస్‌కు మొత్తం ముగ్గురు కొడుకులు. అయితే పదేళ్ల క్రితం ఆ ఇంట్లో పెద్ద విషాదం జరిగింది. సిరాజ్ పెద్దన్నయ్య ఒక వరద ప్రమాదంలో మునిగి చనిపోయాడు. దానినుంచి కోలుకునేందుకు వారికి చాలా సమయం పట్టింది. ‘నా పెద్ద కొడుకు మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. మా ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మా ఇంట్లో మళ్లీ సంతోషం తిరిగొచ్చింది. సిరాజ్ మా బాధను దూరం చేశాడు. ఏం చెప్పాలో నాకు మాటలు రావడం లేదు. ఇంతకంటే ఏం ఆశించను’ అని గౌస్ కన్నీళ్లతో తన ఆనందాన్ని వ్యక్త పరిచారు.