కోహ్లి వికెట్ తీయాలనుంది!
ఐపీఎల్‌తో మా కష్టాలన్నీ తీరతాయి
పేస్ బౌలర్ సిరాజ్
హైదరాబాద్: ఆటో డ్రైవర్ కొడుకైనా సరే... అంకితభావం, పట్టుదల ఉంటే పెద్ద స్థాయికి చేరవచ్చనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్. ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 2 కోట్ల 60 లక్షలకు దక్కించుకుంది. చాలీచాలని సంపాదనతో కూడా తనను ప్రోత్సహించిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునే సమయం వచ్చిందని అతను అంటున్నాడు. ‘మా నాన్న గౌస్ ఆటోడ్రైవర్‌గా ఎంతో కష్టపడ్డారు. అమ్మ షబానా కూడా కొన్నిసార్లు పని చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ వేలం మా జీవితాలను మార్చేస్తుందని నమ్ముతున్నా. ఒక మంచి ఇల్లు కొనుక్కొని వారిద్దరిని బాగా చూసుకుంటాను’ అని సిరాజ్ ‘సాక్షి టీవీ’తో చెప్పాడు. ఐపీఎల్‌లో అవకాశం దక్కాలన్న తన కల పూర్తయిందని, ఇక ముందు భారత జట్టుకు ఆడటమే తన లక్ష్యమని అతను అన్నాడు. ‘టెన్నిస్ బాల్‌తోనే ఫ్రెండ్స్‌తో కలిసి ఆట మొదలు పెట్టాను. బంతి ఏదైనా వేగంగా విసరడం ఒక్కటే నాకు తెలి సింది. అదే ఇక్కడికి తీసుకొచ్చింది. అవకాశం దక్కిన ప్రతీసారి నా టాలెంట్‌ను చూపించా. ఈ ప్రయాణంలో నాకు అమ్మా నాన్న, మామయ్యతో పాటు కోచ్‌లు అర్జున్ యాదవ్, భరత్ అరుణ్ ఎంతో సహకరించారు. ప్రాథమిక అంశాలు ఎక్కడా నేర్చుకోకపోయినా వారిచ్చిన ప్రోత్సాహం వల్లే రాణించగలిగాను’ అని సిరాజ్ వెల్లడించాడు.
నా ఫేవరెట్ స్టార్క్...
ముందుగా తాను కూడా బ్యాట్స్‌మన్ కావాలనే భావించానని, అయితే ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ స్టార్క్ వేగం చూసిన తర్వాత పేస్ బౌలింగ్‌పై మక్కువ పెరిగిందని సిరాజ్ పేర్కొన్నాడు. ‘నా ఫేవరెట్ బౌలర్ స్టార్క్. అతనిలాగే పదునైన యార్కర్లు సంధిం చడం చాలా ఇష్టం. 140 కిలోమీటర్లకు పైగా వేగంతో మంచి బౌన్సర్లూ సంధించగలను కానీ నా బలం ఇన్‌స్వింగ్‌గా భావిస్తా. అవకాశం దొరి కితే కోహ్లి వికెట్ తీయాలని కోరుకుంటున్నా’ అని సిరాజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా ఎలాంటి ట్రైనింగ్, జిమ్ లేకుండా సహజంగానే ఒక పేసర్‌కు ఉండే ఫిట్‌నెస్‌కు తనకు ఉందని, మున్ముందు దీనిని మరింతగా మెరుగు పర్చుకుంటానని అతను చెప్పాడు. తల్లిదండ్రుల దీవెనలతో ఇక్కడి వరకు చేరానని, ఐపీఎల్‌లో అంచనాలు నిలబెట్టుకుంటానని చెప్పిన సిరాజ్... ఈ నెల 25 నుంచి జరిగే వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి సన్నద్ధమవుతున్నాడు.
కొడుకును కోల్పోయిన పదేళ్లకు...
మొహమ్మద్ గౌస్‌కు మొత్తం ముగ్గురు కొడుకులు. అయితే పదేళ్ల క్రితం ఆ ఇంట్లో పెద్ద విషాదం జరిగింది. సిరాజ్ పెద్దన్నయ్య ఒక వరద ప్రమాదంలో మునిగి చనిపోయాడు. దానినుంచి కోలుకునేందుకు వారికి చాలా సమయం పట్టింది. ‘నా పెద్ద కొడుకు మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. మా ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మా ఇంట్లో మళ్లీ సంతోషం తిరిగొచ్చింది. సిరాజ్ మా బాధను దూరం చేశాడు. ఏం చెప్పాలో నాకు మాటలు రావడం లేదు. ఇంతకంటే ఏం ఆశించను’ అని గౌస్ కన్నీళ్లతో తన ఆనందాన్ని వ్యక్త పరిచారు.