ఇ'షాన్‌దార్‌' రైజర్స్‌ | Sunrisers Hyderabad beat Rajasthan by 44 runs | Sakshi
Sakshi News home page

ఇ'షాన్‌దార్‌' రైజర్స్‌

Published Mon, Mar 24 2025 4:01 AM | Last Updated on Mon, Mar 24 2025 10:47 AM

Sunrisers Hyderabad beat Rajasthan by 44 runs

హైదరాబాద్‌ సూపర్‌ బ్యాటింగ్‌

286 పరుగుల స్కోరు నమోదు

44 పరుగులతో రాజస్తాన్‌పై గెలుపు

ఇషాన్‌ కిషన్‌ అజేయ సెంచరీ

చెలరేగిన ట్రావిస్‌ హెడ్‌ 

సామ్సన్, జురేల్‌ మెరుపులు వృథా  

తొలి 42 బంతుల్లో 100 పరుగులు... 87 బంతుల్లో 200 పరుగులు... ఇక మిగిలింది 300 లక్ష్యమే... ఐపీఎల్‌లో 300 పరుగులు సాధ్యమా అనే ప్రశ్నకు జవాబిచ్చేలా ఆడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు దానిని ఈసారి అందుకోలేకపోయినా దాదాపు చేరువగా వచ్చిoది. తమ అత్యధిక టీమ్‌ స్కోరుకు ఒక పరుగు మాత్రమే తక్కువ చేసి ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో రెండో అత్యధిక స్కోరును తమ పేరిటే లిఖించుకుంది. మారింది సీజన్‌ మాత్రమే తాము కాదు అంటూ సన్‌రైజర్స్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. 

గత ఏడాది లాగే అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ మెరుపులకు తోడు ఈసారి కొత్తగా జట్టులో చేరిన ఇషాన్‌ కిషన్‌ కూడా దూకుడుగా ఆడడంతో జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఛేదనకు ముందే ఓటమిని అంగీకరించినట్లు కనిపించిన రాజస్తాన్‌ కొంత పోరాడినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో చివరకు ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మొత్తానికి 528 పరుగుల మ్యాచ్‌తో హైదరాబాద్‌ అభిమానులు ఆదివారం పండుగ చేసుకున్నారు.  

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌–18 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమదైన రీతిలో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగింది. ఘన విజయంతో టోర్నీని మొదలు పెట్టింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గత ఏడాది రన్నరప్‌ సన్‌రైజర్స్‌ 44 పరుగుల తేడాతో మాజీ చాంపియన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (47 బంతుల్లో 106 నాటౌట్‌; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కాడు. ట్రావిస్‌ హెడ్‌ (31 బంతుల్లో 67; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ (14 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (15 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా దూకుడుగా ఆడారు. సన్‌రైజర్స్‌ టాప్‌–5 బ్యాటర్లంతా 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. 3

ఇషాన్‌ కిషన్‌
పరుగులు 106 
బంతులు 47 
ఫోర్లు 11 
సిక్స్‌లు
స్ట్రయిక్‌రేట్‌ 225.53 

అనంతరం 287 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసి ఓడిపోయింది. ధ్రువ్‌ జురేల్‌ (35 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), సంజూ సామ్సన్‌ (37 బంతుల్లో 66; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సిమర్‌జీత్‌ సింగ్, హర్షల్‌ పటేల్‌ రెండు వికెట్ల చొప్పున తీశారు. సన్‌రైజర్స్‌ జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 27న ఉప్పల్‌ స్టేడియంలోనే లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుతో ఆడుతుంది.  

మెరుపు బ్యాటింగ్‌... 
అభిషేక్‌ శర్మ (11 బంతుల్లో 24; 5 ఫోర్లు), హెడ్‌ ఎప్పటిలాగే రైజర్స్‌కు శుభారంభం అందించారు. ఫారుఖీ ఓవర్లో అభిషేక్‌ మూడు ఫోర్లు కొట్టగా, అదే ఓవర్లో హెడ్‌ సిక్స్‌ కొట్టాడు. తొలి వికెట్‌కు 19 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యం తర్వాత అభిషేక్‌ వెనుదిరిగాడు. అభిషేక్‌ స్థానంలో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ కూడా అదే జోరును కొనసాగించాడు. ఆర్చర్‌ వేసిన ఐదో ఓవర్లో హెడ్‌ చెలరేగిపోయాడు. 

ఈ ఓవర్లో అతను 4 ఫోర్లు, సిక్స్‌ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లే ముగిసేసరికి సన్‌రైజర్స్‌ స్కోరు 94 పరుగులకు చేరగా, 21 బంతుల్లోనే హెడ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు హెడ్‌ను తుషార్‌ అవుట్‌ చేసినా... కిషన్‌ తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. హెడ్, కిషన్‌ రెండో వికెట్‌కు 39 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. ఆర్చర్‌ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లతో కిషన్‌ 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. అదే ఓవర్లో అతను మరో సిక్సర్‌ బాదాడు. 

మరోవైపు నితీశ్‌ రెడ్డి, క్లాసెన్‌ ఎక్కడా తగ్గలేదు. వీరిద్దరు దూకుడుతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. సందీప్‌ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన క్లాసెన్, ఆర్చర్‌ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. సందీప్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాది 98కి చేరిన కిషన్‌ తర్వాతి బంతికి రెండు పరుగులు చేసి సెంచరీ (45 బంతుల్లో)తో విజయనాదం చేశాడు.  

శతక భాగస్వామ్యం... 
దాదాపు అసాధ్యమైన లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రాజస్తాన్‌ 50 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్‌ (1), రియాన్‌ పరాగ్‌ (4), నితీశ్‌ రాణా (11) వెనుదిరగడంతో జట్టు ఛేదనావకాశాలు తగ్గిపోయాయి. అయితే సామ్సన్, జురేల్‌ కొద్దిగా ప్రయత్నం చేశారు. సిమర్‌జీత్‌ ఓవర్లో సామ్సన్‌ 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టగా, కమిన్స్‌ ఓవర్లో జురేల్‌ 3 ఫోర్లు, సిక్స్‌ కొట్టడం హైలైట్‌గా నిలిచాయి. 

రాయల్స్‌ బ్యాటర్లు కూడా అక్కడక్కడా మెరుపులు మెరిపించినా హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ముందు అవన్నీ దిగదుడుపుగా కనిపించాయి. నాలుగో వికెట్‌కు 60 బంతుల్లో 111 పరుగులు జత చేసిన అనంతరం ఒకే స్కోరు వద్ద సామ్సన్, జురేల్‌ అవుట్‌ కావడంతో రాజస్తాన్‌ ఆశలు అడుగంటాయి. చివర్లో హెట్‌మైర్‌ (23 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్‌లు), శుభమ్‌ దూబే (11 బంతుల్లో 34 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది.  

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి) యశస్వి జైస్వాల్‌ (బి) తీక్షణ 24; హెడ్‌ (సి) హెట్‌మైర్‌ (బి) తుషార్‌ దేశ్‌పాండే 67; ఇషాన్‌ కిషన్‌ (నాటౌట్‌) 106; నితీశ్‌ కుమార్‌ రెడ్డి (సి) యశస్వి జైస్వాల్‌ (బి) తీక్షణ 30; క్లాసెన్‌ (సి) పరాగ్‌ (బి) సందీప్‌ 34; అనికేత్‌ (సి) ఆర్చర్‌ (బి) తుషార్‌ దేశ్‌పాండే 7; అభినవ్‌ మనోహర్‌ (సి) పరాగ్‌ (బి) తుషార్‌ దేశ్‌పాండే 0; కమిన్స్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 286. వికెట్ల పతనం: 1–45, 2–130, 3–202, 4–258, 5–279, 6–279. బౌలింగ్‌: ఫారుఖీ 3–0–49–0, తీక్షణ 4–0–52–2, ఆర్చర్‌  4–0–76–0, సందీప్‌ శర్మ 4–0–51–1, నితీశ్‌ రాణా 1–0–9–0, తుషార్‌ దేశ్‌పాండే 4–0–44–3.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) మనోహర్‌ (బి) సిమర్‌జీత్‌ 1; సంజూ సామ్సన్‌ (సి) క్లాసెన్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 66; పరాగ్‌ (సి) కమిన్స్‌ (బి) సిమర్‌జీత్‌ 4; నితీశ్‌ రాణా (సి) కమిన్స్‌ (బి) షమీ 11; ధ్రువ్‌ జురేల్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) ఆడమ్‌ జంపా 70; హెట్‌మైర్‌ (సి) మనోహర్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 42; శుభమ్‌ దూబే (నాటౌట్‌) 34; ఆర్చర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1–20, 2–24, 3–50, 4–161, 5–161, 6–241. బౌలింగ్‌: మొహమ్మద్‌ షమీ 3–0–33–1, సిమర్‌జీత్‌ సింగ్‌ 3–0–46–2, కమిన్స్‌ 4–0–60–0, అభిషేక్‌ 2–0–17–0, ఆడమ్‌ జంపా 4–0–48–1, హర్షల్‌ పటేల్‌ 4–0–34–2.

286 ఐపీఎల్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు. గత ఏడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై సన్‌రైజర్స్‌ చేసిన 287 పరుగుల స్కోరు అగ్రస్థానంలో ఉంది. ఐపీఎల్‌ చరిత్రలో టాప్‌–5 అత్యధిక టీమ్‌ స్కోర్లలో నాలుగు సన్‌రైజర్స్‌ పేరిటే ఉండటం విశేషం.

76 జోఫ్రా ఆర్చర్‌ ఇచ్చిన పరుగులు. ఐపీఎల్‌లోని ఒక మ్యాచ్‌లో ఒక బౌలర్‌ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ మోహిత్‌ శర్మ అత్యధికంగా 73 పరుగులు ఇచ్చాడు. మోహిత్‌ పేరిట ఉన్న రికార్డును ఆర్చర్‌ తన పేరిట లిఖించుకున్నాడు. 

34 టి20 ఫార్మాట్‌లో ఒక మ్యాచ్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు (34) కొట్టిన జట్టుగా సన్‌రైజర్స్‌ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు మిడిల్‌సెక్స్‌ కౌంటీ (33 ఫోర్లు; సర్రే జట్టుపై 2023లో) జట్టు పేరిట ఉంది. ఐపీఎల్‌ టోర్నీ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన రికార్డు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ (31 ఫోర్లు; 2017లో గుజరాత్‌ లయన్స్‌పై) జట్టు పేరిట ఉంది. దానిని కూడా సన్‌రైజర్స్‌ బ్రేక్‌ చేసింది. 

3 ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన మూడో భారత ప్లేయర్‌గా ఇషాన్‌ కిషన్‌ (45 బంతుల్లో) గుర్తింపు పొందాడు. తొలి స్థానంలో యూసుఫ్‌ పఠాన్‌ (37 బంతుల్లో ముంబై ఇండియన్స్‌పై 2010లో) ఉన్నాడు. తాజా ఇన్నింగ్స్‌తో మయాంక్‌ అగర్వాల్‌ (45 బంతుల్లో; రాజస్తాన్‌ రాయల్స్‌పై 2020లో) సరసన ఇషాన్‌ కిషన్‌ చేరాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement