
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా మొదలు.. తాజాగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు ఇందుకు నిదర్శనం. అయితే, ఒకప్పుడు టీమిండియా స్టార్‌గా వెలిగి.. ఇప్పుడు జట్టులో చోటే కరువైన ప్లేయర్ ఇషాన్ కిషన్(Ishan Kishan).
సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదు
జాతీయ జట్టు ఓపెనర్‌గా చిన్న వయసులోనే ఓ వెలుగు వెలిగిన 26 ఏళ్ల ఇషాన్.. క్రమశిక్షణా రాహిత్యం వల్ల బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. ఫలితంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం ఓపెనింగ్ స్థానంతో పాటు వికెట్ కీపర్‌గానూ సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదు.
కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సంజూ శాంసన్ కీపర్ల కోటాలో పాతుకుపోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఆయా ఫార్మాట్లలో కొనసాగుతున్నారు. అయితే, ఇషాన్ కిషన్‌కు ఐపీఎల్-2025 రూపంలో సువర్ణావకాశం వచ్చిందంటున్నాడు భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.
రూ. 11.25 కోట్లకు కొనుగోలు
క్యాష్ రిచ్ లీగ్ పద్దెమినిదవ ఎడిషన్‌లో సత్తా చాటితే మరోసారి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించవచ్చని పేర్కొన్నాడు. కాగా గతేడాది వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఇషాన్‌ను మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ వదిలేసింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతడిని ఏకంగా రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే, రైజర్స్ జట్టులో ఇప్పటికే విధ్వంసకర ఓపెనింగ్ జోడీగా ట్రవిస్ హెడ్- అభిషేక్ శర్మ తమ స్థానాలు సుస్థిరం చేసుకున్నారు. గతేడాది జట్టు ఫైనల్ వరకు చేరడంలో ఈ ఇద్దరిది కీలక పాత్ర. కాబట్టి ఇషాన్ కిషన్‌కు ఓపెనర్‌గా ఛాన్స్ రాదు. టాపార్డర్‌లోనే ఉండాలంటే.. అతడు మూడో స్థానంలో ఆడాల్సిన పరిస్థితి.
ఎవరూ కనీసం మాట్లాడటం లేదు
ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఇషాన్ కిషన్‌కు మరోసారి గొప్ప అవకాశం వచ్చింది. కారణమేదైనా టీమిండియా సెలక్టర్లు అతడిని అస్సలు పట్టించుకోవడం లేదు. రంజీల్లో ఆడి తనను తాను నిరూపించుకున్నాడు. పరుగులు చేశాడు.
అయినా సరే అతడి ప్రాధాన్యాన్ని సెలక్టర్లు గుర్తించడం లేదు. అతడి గురించి ఎవరూ కనీసం మాట్లాడటం లేదు. జాతీయ జట్టులో స్థానం కోసం చేయాల్సిందంతా చేస్తున్నాడు. కానీ.. అసలు అతడి పేరు కూడా తెరమీదకు రావడం లేదు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడం అందరికీ సాధ్యం కాదు.
కానీ ఇషాన్ ఆ పని చేసి చూపించాడు. భారీ సిక్సర్లు బాదగల సమర్థత, మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగల సత్తా అతడికి ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ అతడిని మూడో స్థానంలో ఆడించేందుకు తీసుకుందని తెలిసి నేను ఆశ్చర్యపోయాను.
సద్వినియోగం చేసుకుంటే
ఓపెనర్ల కోటా ఖాళీ లేదు కాబట్టి వాళ్లకూ వేరే ఆప్షన్ లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో వేరే స్థానంలో ఆడి పరుగులు రాబట్టడం అంత తేలికేమీ కాదు. అయితే, ఇషాన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అతడికి తిరుగు ఉండదు.
ప్రస్తుతం టీమిండియలో బ్యాటర్ల స్థానాలు ఫిక్స్‌డ్‌గా ఏమీ లేవు. ఏస్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నాడు. కాబట్టి ఇషాన్ ఐపీఎల్-2025లో సత్తా చాటితే కచ్చితంగా టీమిండియాలోకి రాగలడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్ ఆరంభం కానుండగా.. సన్‌రైజర్స్ మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రాజస్తాన్ రాయల్స్‌తో హైదరాబాద్ వేదికగా తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment