రైజర్స్‌ బొణీ కొట్టేనా! | Sunrisers Hyderabad face Rajasthan Royals today | Sakshi
Sakshi News home page

రైజర్స్‌ బొణీ కొట్టేనా!

Published Sun, Mar 23 2025 4:19 AM | Last Updated on Sun, Mar 23 2025 4:20 AM

Sunrisers Hyderabad face Rajasthan Royals today

నేడు రాజస్తాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఢీ 

ఉప్పల్‌ మైదానంలో తొలి పోరు 

మధ్యాహ్నం గం. 3:30 నుంచి  

బాదుడే పరామావధిగా చెలరేగి గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రజర్స్‌ హైదరాబాద్‌... ఈ ఏడాది అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై మాజీ చాంపియన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌తో... నేడు కమిన్స్‌ సేన కప్‌ వేట ప్రారంభించనుంది. 

ట్రావిస్‌ హెడ్, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్, నితీశ్‌కుమార్‌ రెడ్డి, హెన్రిచ్‌ క్లాసెన్‌తో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ శత్రు దుర్బేధ్యంగా ఉండగా... యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, రియాన్‌ పరాగ్, హెట్‌మైర్, ధ్రువ్‌ జురెల్‌తో సవాలు విసిరేందుకు రాజస్తాన్‌ రాయల్స్‌ రెడీ అయింది. మరి రైజర్స్‌ దూకుడుకు రాయల్స్‌ అడ్డుకట్ట వేస్తుందా చూడాలి! 

సాక్షి, హైదరాబాద్‌: గత ఏడాది అందినట్లే అంది దూరమైన ఐపీఎల్‌ ట్రోఫీని ఈసారైనా ఒడిసి పట్టాలనే లక్ష్యంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తొలి మ్యాచ్‌కు రెడీ అయింది. ఐపీఎల్‌ 18వ సీజన్‌లో భాగంగా జరగనున్న తొలి ‘డబుల్‌ హెడర్‌’లో ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో హైదరాబాద్‌ అమీతుమీ తేల్చుకోనుంది. ఒకప్పుడు కట్టుదిట్టమైన బౌలింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌... గత సీజన్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో రికార్డులు తిరగరాసింది. 

ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ నుంచి మొదలు పెట్టుకొని కెప్టెన్‌ కమిన్స్‌ వరకు ప్రతి ఒక్కరూ దూకుడుగా ఆడేవాళ్లు ఉండటం రైజర్స్‌కు కలిసి రానుండగా... సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. గత ఏడాది మ్యాచ్‌ మ్యాచ్‌కు మరింత రాటుదేలుతూ అరాచకం సృష్టించిన రైజర్స్‌ బ్యాటర్లు... ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ నుంచే జోరు కనబర్చాలని తహతహలాడుతున్నారు. 

ప్రాక్టీస్‌ సెషన్‌లలో హెడ్, క్లాసెన్, అభిషేక్, నితీశ్‌ వంతులు వేసుకొని మరి భారీ షాట్లు సాధన చేశారు. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వేలంలో కొత్తగా తీసుకున్న ఇషాన్‌ కిషన్‌ రాకతో రైజర్స్‌ బ్యాటింగ్‌ మరింత పదునెక్కింది. గతేడాది ఒకటికి మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు చేసిన రైజర్స్‌... ఈ సారి 300 మార్క్‌ అందుకోవాలనే లక్ష్యంతో కనిపిస్తోంది.

 గాయం నుంచి కోలుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి మిడిలార్డర్‌లో కీలకం కానున్నాడు. మరోవైపు వేలి గాయంతో ఇబ్బంది పడుతున్న రాజస్తాన్‌ రాయల్స్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ సంజూ సామన్స్‌ ఈ మ్యాచ్‌లో కేవలం ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. సీజన్‌ తొలి మూడు మ్యాచ్‌లకు సామ్సన్‌ స్థానంలో రియాన్‌ పరాగ్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.  

సామ్సన్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా... 
స్వదేశీ ఆటగాళ్ల నైపుణ్యంపైనే ప్రధానంగా ఆధారపడుతున్న రాజస్తాన్‌ రాయల్స్‌కు... రెగ్యులర్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ గాయం ఇబ్బంది పెడుతోంది. అతడు కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. అంటే ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్యాటింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అతడి స్థానంలో రియాన్‌ పరాగ్‌ జట్టును నడిపించనుండగా... ధ్రువ్‌ జురెల్‌ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు అందుకోనున్నాడు. 

యశస్వి జైస్వాల్, సామ్సన్, నితీశ్‌ రాణా, పరాగ్, ధ్రువ్‌ జురేల్‌ ఇలా టాప్‌–5లో స్వదేశీ ఆటగాళ్లే బ్యాటింగ్‌ చేయనున్నారు. మిడిలార్డర్‌లో విండీస్‌ హిట్టర్‌ హెట్‌మైర్‌ కీలకం కానుండగా... ఆర్చర్, తీక్షణ, వనిందు హసరంగ బౌలింగ్‌ భారం మోయనున్నారు. విధ్వంసానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న రైజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను రాయల్స్‌ బౌలింగ్‌ దళం ఎలా అడ్డుకుంటుందనే దానిపైనే ఈమ్యాచ్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. 

బ్యాటింగ్‌ బలంగా... 
ఇంటా బయటా అనే తేడా లేకుండా గతేడాది బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన సన్‌రైజర్స్‌... ముఖ్యంగా ఉప్పల్‌లో ఊచకోత సాగించింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో పోరులో ఆ జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఆరెంజ్‌ ఆర్మీ 9.4 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండానే ఛేదించి సంచలనం సృష్టించింది.

ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, హెడ్‌ బంతిపై పగబట్టినట్లు విజృంభిస్తుండటం రైజర్స్‌కు ప్రధాన బలం కాగా... ఇషాన్‌ కిషన్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హెన్రిచ్‌ క్లాసెన్‌తో కూడిన మిడిలార్డర్‌ జట్టుకు మరింత బలాన్నిస్తోంది. అయితే ఫ్రాంఛైజీ తరఫున తొలిసారి బరిలోకి దిగనున్న అభినవ్‌ మనోహర్, అనికేత్‌ వర్మ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం. 

గాయం కారణంగా శ్రీలంకతో పర్యటనతో పాటు ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి దూరమైన ఆ్రస్టేలియా స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌... గాయం నుంచి కోలుకొని జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. పేస్‌ బౌలింగ్‌లో మొహమ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌ కీలకం కానుండగా, ఆడమ్‌ జంపా స్పిన్‌ బాధ్యతలు మోయనున్నాడు. 

తుది జట్లు (అంచనా) 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: కమిన్స్‌ (కెప్టెన్‌), హెడ్, అభిషేక్, ఇషాన్‌ కిషన్, నితీశ్‌ రెడ్డి, క్లాసెన్, అనికేత్‌ వర్మ, అభినవ్‌ మనోహర్, హర్షల్‌ పటేల్, రాహుల్‌ చాహర్, షమీ, జాంపా. 
రాజస్తాన్‌ రాయల్స్‌: రియాన్‌ పరాగ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, నితీశ్‌ రాణా, ధ్రువ్‌ జురెల్, హెట్‌మైర్, హసరంగ, శుభమ్‌ దూబే, ఆర్చర్, తీక్షణ, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌ పాండే. 

పిచ్, వాతావరణం 
గతేడాది ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. మొత్తం 13 మైదానాల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగగా... అందులో రెండో అత్యధికం (ఓవర్‌కు 10.54 పరుగులు) హైదరాబాద్‌లో నమోదైంది. ఈసారి కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.  

చెన్నై X ముంబై
సాయంత్రం గం. 7:30 నుంచి
చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా చెరో ఐదు సార్లు ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య చెపాక్‌ వేదికగా ఆదివారం రెండో మ్యాచ్‌ జరగనుంది. గాయం కారణంగా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, నిషేధం కారణంగా హార్దిక్‌ పాండ్యా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోగా... సూర్యకుమార్‌ యాదవ్‌ ముంబై ఇండియన్స్‌ జట్టును నడిపించనున్నాడు. రోహిత్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్, రికెల్టన్, నమన్‌ ధిర్‌తో ముంబై బ్యాటింగ్‌ బలంగానే ఉంది. 

బౌలింగ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ అనుభవం ముంబైకి ప్రధానాయుధం కాగా... దీపక్‌ చాహర్, కరణ్‌ శర్మ, సాంట్నర్, ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌ మిగిలిన బాధ్యతలు చూసుకోనున్నారు. మరోవైపు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్‌ అశ్విన్‌ సుదీర్ఘ విరామం తర్వాత చెన్నై జట్టులో తిరిగి చేరాడు. చెపాక్‌ లాంటి స్లో పిచ్‌పై అశ్విన్, జడేజా, నూర్‌ అహ్మద్‌ను ఎదుర్కోవడం కష్టమైన పనే. 

ఎప్పట్లాగే మహేంద్ర సింగ్‌ ధోని వికెట్ల వెనుక నుంచి చెన్నై జట్టుకు దిశానిర్దేశం చేయనుండగా... బ్యాటింగ్‌లో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్, కాన్వే, రాహుల్‌ త్రిపాఠి, శివమ్‌ దూబే, స్యామ్‌ కరన్, జడేజా కీలకం కానున్నారు. గత సీజన్‌లో ఎక్కువ శాతం బ్యాటింగ్‌కు రాని ధోని ఈ సారి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు వస్తాడా చూడాలి. ఇరు జట్ల మధ్య చివరగా జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట చెన్నై విజయం సాధించింది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో పట్టిక అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌ను తాజాగా ప్రారంభించాలని చూస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement