breaking news
Padmavati Ammavari annual Brahmotsavam
-
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి రథోత్సవం (ఫొటోలు)
-
అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రేపు ధ్వజారోహణం
తిరుచానూరు: పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఆటంకాలు లేకుండా జరగాలని సకల దేవతలను కోరుతూ అంకురార్పణ నిర్వహించడం ఆనవాయితీ. సర్వసేనాధిపతియైన విశ్వక్సేనుల వారి సమక్షంలో ఉద్యానవనంలో సేకరించిన పుట్టమన్ను ఆలయానికి తీసుకొచ్చి, పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా నవపాలికలలో నింపి, అందులో నవదాన్యాలు వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టనున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు 19వ తేదీ ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభంకానున్నాయి. ఉదయం 9.16 నుంచి 9.30 గంటల లోపు ధనుర్లగ్నంలో ధ్వజస్తంభంపై గజచిత్రపటాన్ని ఎగురవేయనున్నారు. రాత్రి చిన్న శేషవాహనంతో అమ్మవారి వాహన సేవలు ప్రారంభంకానున్నాయి. లక్షకుంకుమార్చన అంకురార్పణ రోజు ఉదయం ఆలయంలో లక్షకుంకుమార్చన సేవ నిర్వహించడం 19ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలు బాగా పండి, రైతులు, కర్షకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, సకల జీవరాశులు సుఖసంతోషాలతో వర్థిల్లాలని అమ్మవారి అష్టోత్తర శత(108) నామావళిని వేదపండితులు లక్షసార్లు స్తుతిస్తూ ఈ సేవను లోకకల్యాణార్థం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారిని కొలువుదీర్చి ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు లక్షకుంకుమార్చన సేవను నిర్వహించనున్నారు. ఈ సేవలో పాల్గొనదలచిన భక్తులు రూ.1,116 చెల్లించి సేవా టికెట్ కొనుగోలు చేయాలి. ఒక టికెట్‌పై ఇద్దరిని అనుమతించనున్నారు. వీరికి వస్త్ర బహుమానం, అమ్మవారి ప్రసాదాలను అందజేయనున్నారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులతో హాజరు కావాలని ఆలయ అధికారులు సూచించారు. రేపు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం నాలుగేళ్లుగా ఆనవాయితీ. ఈ ఏడాది కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే 19వ తేదీ మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సీఎం సమర్పించనున్నట్లు తెలిసింది. టీటీడీ ఉన్నతాధికారులు హైదరాబాదులో సీఎం చంద్రబాబునాయుడిని కలిసి ఆహ్వానించారు. ఆయన హాజరు కాలేని పక్షంలో ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రుల్లో ఒకరు ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన మంత్రి పట్టువస్త్రాలు సమర్పించవచ్చని ఆలయ అధికారుల ద్వారా తెలిసింది.