పన్నీరుపై వేటుకు చాన్సే లేదు
సాక్షి, చెన్నై: పన్నీరు సెల్వంతో పాటు 11 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి అవకాశం లేదని, ఈ విషయంలో అసలు స్పీకర్‌కు ఆదేశాలు ఇచ్చే అధికారం కోర్టుకు లేదని సీఎం పళనిస్వామి తరఫున హైకోర్టులో బుధవారం వాదనలు వినిపించారు. దినకరన్ మద్దతు ఎమ్మెల్యే అనర్హత వేటును గుర్తు చేస్తూ, పన్నీరు బృందం మీద వేటు ఎందుకు వేయరంటూ వాదనలు వాడి వేడిగా సాగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగి సీఎం పళనిస్వామి బల పరీక్ష సమయంలో పన్నీరు సెల్వంతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే విప్‌నకు వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. అయితే, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోని స్పీకర్ ధనపాల్, అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్ మద్దతు ఎమ్మెల్యేల మీద మాత్రం ఇటీవల చర్యలు తీసుకోవడం చర్చకు దారి తీసింది. దినకరన్ మద్దతు ఎమ్మెల్యే అనర్హత వేటును పరిగణలోకి తీసుకుని , ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పన్నీరుసెల్వంతో పాటు 11 మంది మీద సైతం వేటు పడాల్సిందేనన్న నినాదాన్ని డీఎంకే అందుకుంది. డీఎంకే విప్ చక్రపాణి దాఖలు చేసిన పిటిషన్ విచారణ బుధవారం వాడివేడిగా సాగింది.
స్పీకర్‌కే అధికారం
పన్నీరుతో పాటు 11 మంది ఎమ్మెల్యేలపై వేటుకు అవకాశం లేనే లేదని సీఎం పళనిస్వామి తరఫున కోర్టుకు వాదనలు చేరాయి. ప్రధాన న్యాయమూర్తి ఇందిరాబెనర్జీ, న్యాయమూర్తి అబ్దుల్ కుదుష్ నేతృత్వంలోని బెంచ్ ముందు ఉదయం వాదనలు సాగాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్‌సిబాల్, అమరేంద్ర సింగ్ హాజరయ్యారు. సీఎం పళనిస్వామి, అసెంబ్లీ స్పీకర్ తరఫున న్యాయవాది వైద్యనాథన్ హాజరై వాదనలు వినిపించారు. అసెంబ్లీలో సాగే వ్యవహారాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఒక్క స్పీకర్‌కు మాత్రమే ఉందన్నారు. ఆయన నిర్ణయానికి కట్టుబడాల్సిన అవసరం ఉందని, అయితే, స్పీకర్‌కు ఆదేశాలు ఇచ్చే అధికారం ఎవ్వరికీ లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ నియమ నిబంధనల మేరకు స్పీకర్ చర్యలు ఉంటాయని, ఆయన తీసుకునే నిర్ణయం సుప్రీం అని వ్యాఖ్యానించారు. అనర్హత వేటు విషయంగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు ఇచ్చే అధికారం కోర్టుకు లేదన్నారు. దీంతో పిటిషనర్ చక్రపాణి తరఫున కపిల్‌సిబాల్ వాదన వినిపించారు. స్పీకర్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ప్రజా స్వామ్య విరుద్ధంగా రాష్ట్రంలోపాలన సాగుతున్నదని, ఈ ప్రభుత్వ కొనసాగేందుకు వీలు లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయవాది వైద్యనాథన్ జోక్యం చేసుకుని సుప్రీంకోర్టులో ఇలాం టి కేసు పెండింగ్‌లో ఉందని, ఈ దృష్ట్యా, ఎలాంటి ఆదేశాలు ఇవ్వ వద్దు అని, అలాగే, పన్నీరు, అండ్ ఎమ్మెల్యే తరఫున అదనపు పిటిషన్ దాఖలుకు అవకాశం ఇవ్వాలని కోరారు. చివరకు స్పీకర్ ధనపాల్‌ను వివరణ కోరుతూ, అదనపు పిటిషన్ల దాఖలకు అవకాశం కల్పిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేశారు. అదనపు పిటిషన్లు ఫిబ్రవరి ఐదో తేదీలోపు వేయాలని ఆదేశించారు.
ఢిల్లీకి పన్నీరు
ఓ వైపు తమ మీద దాఖలైన పిటిషన్ల విచారణ వాడివేడిగా సాగుతుంటే, మరో వైపు డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం ఢిల్లీ చెక్కేశారు. ప్రధాని నరేంద్రమోదీతో భేటీకి ఈ పయనం అని పాలకుల్లో చర్చ. ఎంజీయార్ శతజయంతి ఉత్సవాలకు స్వయంగా ఆహ్వానించేందుకు నిర్ణయించిన దృష్ట్యా, ఇందుకు తగ్గ ఆహ్వానాలు ఢిల్లీలో గురువారం సాగే అవకాశాలు ఉన్నాయి. అలాగే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు పలువురు మంత్రులతో భేటీలకు పన్నీరు అపాయింట్ మెంట్లు సిద్ధం చేసుకుని వెళ్లడం గమనార్హం. ఢిల్లీలో జరిగే ఆర్థిక శాక సమావేశానికి సైతం హాజరు కాబోతున్నారు.