Paleru election
-
మండలి సభ్యత్వానికి తుమ్మల రాజీనామా
26న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు రాజీనామా లేఖ పంపగా ఆయన ఆమోదించారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించడంతో తుమ్మల ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఈ నెల 26న ఎమ్మెల్యేగా తుమ్మల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, తుమ్మల రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవి కోసం అధికార పార్టీలో అప్పుడే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పలువురు ఆశావహులు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీ అధినేత కేసీఆర్‌కు విన్నవించుకుంటున్నారు. తుమ్మలను అభినందించిన సీఎం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు అభినందనలు తెలి పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎస్బి.బేగ్, కొండబాల కోటేశ్వరరావు, పిడమర్తి రవి, నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పాలేరులో కాంగ్రెస్ కు మద్దతివ్వం: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎలాంటి మద్దతు ఇవ్వ డం లేదని శనివారం ఆయన విలేకరులకు చెప్పారు. పాలేరులో అసాధారణ పరిస్థితులు లేనందున ఏకగ్రీవం లేదా ఇతర చర్యలకు ఆస్కారం లేదన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క తమను కలిసినపుడు కచ్చితంగా పోటీచేస్తామని చెప్పామన్నారు. ఈ ఎన్నికలో మద్దతునివ్వాలని ఇప్పటికే సీపీఐని కోరినట్లు, ఆదివారం జిల్లాపార్టీ కార్యవర్గసమావేశంలో దీనిపై నిర్ణయిస్తామని వారు చెప్పారన్నారు. న్యూడెమోక్రసీకీ లేఖలు రాశామని 2 రోజుల్లో తమ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం ప్రజలను పిచ్చోళ్లను చేస్తోంది రాష్ర్ట ప్రభుత్వం ప్రజలను పిచ్చోళ్లను చేస్తోందని తమ్మినేని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులు, ఎన్నికలపై ఉన్న ఆసక్తి, కరువుతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవడంపై లేదని అన్నారు. శనివారం ఆయన ఎంబీభవన్‌లో పార్టీ నాయకులు డీజీ నరసింహారావు, ఎం.శ్రీనివాస్‌లతో కలసి విలేకరులతో మాట్లాడుతూ, కరువు పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తూ ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
పాలేరుపై టీఆర్ఎస్ కన్ను!
♦ ఉప ఎన్నికపై అధికార పార్టీలో చర్చలు మొదలు ♦ పాలేరులో పోటీపై పలువురు నేతల ఆసక్తి ♦ ‘ఇండిపెండెంట్’ వ్యూహంతో కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు ప్రణాళిక ♦ తెరపైకి నూకల నరేశ్‌రెడ్డి.. మంత్రి తుమ్మల పోటీపైనా ప్రచారం సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో మరో ఎన్నికల హడావుడి మొదలైంది. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఆ స్థానం ఖాళీకావడంతో కొద్ది నెలల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనిపై టీఆర్ఎస్లో అప్పుడే చర్చ మొదలైంది. గత నెలలో నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు చెందిన పి.కిష్టారెడ్డి మరణంతో ఖాళీ అయిన నారాయణఖేడ్ స్థానాన్ని ఆయన కుటుంబ సభ్యులకే ఏకగ్రీవంగా వదిలిపెట్టాలని కాంగ్రెస్ కోరినా... టీఆర్ఎస్ ఎన్నికకే మొగ్గింది. ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలోనూ రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకే ఏకగ్రీవమయ్యే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది. అయితే నారాయణఖేడ్‌లో పోటీకి దిగి. పాలేరులో పక్కకు తప్పుకోవడం సరికాదన్న అభిప్రాయంతో గులాబీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. టికెట్ ప్రయత్నాల్లో నేతలు పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయడానికే ఆస్కారం ఉండడంతో పలువురు టీఆర్ఎస్ నేతలు టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాల్లో పడ్డారు. అందులో భాగంగా పార్టీ అధిష్టానంలోని ముఖ్యులను కలుస్తున్నారని సమాచారం. ఖమ్మం జిల్లా పార్టీ ఇన్చార్జిగా సుదీర్ఘకాలం పనిచేసిన వరంగల్ జిల్లాకు చెందిన నూకల నరేశ్‌రెడ్డి తనకు అవకాశమివ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేడర్‌తో సత్సంబంధాలు ఉండడం, ఆయన సొంత నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడ్ కావడంతో పాలేరు నుంచి అవకాశం కోసం అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాలేరులో పోటీ చేసి ఓడిపోయిన నరేశ్ అనే మరో నేత టీఆర్ ఎస్‌లో చేరారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి సైతం టీఆర్ఎస్ తరఫున పోటీకి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, రాంరెడ్డి వెంకటరెడ్డి మరో సోదరుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డితోపాటు వెంకటరెడ్డి అన్న గోపాల్‌రెడ్డి కుమారుడు చరణ్‌రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో గులాబీ నాయకత్వం దీటైన అభ్యర్థిని బరిలోకి దింపడం ఖాయమంటున్నారు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పోటీ చేస్తారన్న ప్రచారమూ జరిగింది. ఆయన ఎమ్మెల్సీ పదవి ఇంకా ఐదున్నరేళ్లు ఉంది. కానీ సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా సరేనని ఆయన పేర్కొనడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. ఇండిపెండెంట్ వ్యూహం! పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండానే ప్రతిపక్షాలకు చెక్‌పెట్టే వ్యూహంలో అధికార పార్టీ ఉందని తెలిసింది. రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య లేదా ఆ కుటుంబం నుంచి ఎవరు ఎన్నికల్లో దిగినా... తమ పార్టీ పోటీకి దిగక తప్పదని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. అయితే రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య కాంగ్రెస్ టికెట్‌పై కాకుండా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తే మాత్రం... తాము పోటీ చేయకుండా మద్దతిస్తూ, ఇతర పార్టీల మద్దతు కోరడం ద్వారా వారిని ఆత్మరక్షణలోకి నెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాక టీఆర్ఎస్లో చేర్చుకోవడం కూడా తేలికన్న చర్చ పార్టీలో జరిగిన ట్లు చెబుతున్నారు. ఆమె కాకుండా ఇంకెవరు బరిలో నిలిచినా పోటీ చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.