పాలేరులో కాంగ్రెస్ కు మద్దతివ్వం: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎలాంటి మద్దతు ఇవ్వ డం లేదని శనివారం ఆయన విలేకరులకు చెప్పారు. పాలేరులో అసాధారణ పరిస్థితులు లేనందున ఏకగ్రీవం లేదా ఇతర చర్యలకు ఆస్కారం లేదన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క తమను కలిసినపుడు కచ్చితంగా పోటీచేస్తామని చెప్పామన్నారు. ఈ ఎన్నికలో మద్దతునివ్వాలని ఇప్పటికే సీపీఐని కోరినట్లు, ఆదివారం జిల్లాపార్టీ కార్యవర్గసమావేశంలో దీనిపై నిర్ణయిస్తామని వారు చెప్పారన్నారు. న్యూడెమోక్రసీకీ లేఖలు రాశామని 2 రోజుల్లో తమ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.
ప్రభుత్వం ప్రజలను పిచ్చోళ్లను చేస్తోంది
రాష్ర్ట ప్రభుత్వం ప్రజలను పిచ్చోళ్లను చేస్తోందని తమ్మినేని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులు, ఎన్నికలపై ఉన్న ఆసక్తి, కరువుతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవడంపై లేదని అన్నారు. శనివారం ఆయన ఎంబీభవన్‌లో పార్టీ నాయకులు డీజీ నరసింహారావు, ఎం.శ్రీనివాస్‌లతో కలసి విలేకరులతో మాట్లాడుతూ, కరువు పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తూ ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.