పలిమెల.. విలవిల, మూడు రోజులుగా బాహ్య ప్రపంచంతో బంధం కట్
భూపాలపల్లి: ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలం జలదిగ్బంధంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఐదురోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు పలురోడ్లు, బ్రిడ్జీలు కోతకు గురవడంతో రవాణా సౌకర్యం స్తంభించింది. ఏడు 33 కేవీ విద్యుత్ లైన్ స్తంభాలు కూలిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మూడురోజులుగా మండలానికి వెలుపల ఉన్న బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోయింది.
మండలంలో 8 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మొత్తం జనాభా సుమారు 7,500 ఉంటుంది. ఈ మండలానికి మూడు వైపుల ఉన్న దారులు స్తంభించాయి. మండల ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం ఎక్కువగా మహదేవ్పూర్ మీదుగా జిల్లాకేంద్రానికి వస్తుంటారు. శనివారంరాత్రి ఆ దారిలోని పెద్దంపేట వాగు ఉధృతంగా ప్రవహించడంతో మధ్యలోని బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురైంది. పక్కనే పొలాల్లో ఉన్న ఏడు 33 కేవీ కరెంటు లైన్ స్తంభాలు కూలిపోయాయి.
గర్భిణి రజితను వాగు దాటించి తీసుకొస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం
దీంతో ఆ మండలం మొత్తానికి శనివారంరాత్రి నుంచి రవాణా, విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. తాగు, వంట, ఇతర అవసరాలకు వర్షపు నీరే దిక్కు అయింది. మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో పలువురు యువకులు ట్రాలీలు, కార్లు, ట్రాక్టర్ల బ్యాటరీలతో సెల్ఫోన్లు చార్జింగ్ చేసుకొని అధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. మండల ప్రజల దయనీయ పరిస్థితి తెలుసుకొని కలెక్టర్ భవేశ్ మిశ్రా వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించారు.
గర్భిణులతోపాటు పాలు, కూరగాయల వ్యాపారులను వాగు దాటిస్తూ ఆపత్కాలంలో సేవలు అందిస్తున్నారు. వైద్య సిబ్బంది పలుచోట్ల వాగులు దాటుకుంటూ వచ్చి నలుగురు గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు తరలించి ప్రసవాలు చేశారు. పలిమెల, పంకేన గ్రామాలకు పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా తాగునీరు సరఫరా చేశారు. మండల కేంద్రంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు.
ట్రాక్టర్ బ్యాటరీతో సెల్ చార్జింగ్
పలిమెల: విద్యుత్ సరఫరా లేక ఫోన్ చార్జింగ్కు ఇబ్బంది ఏర్పడటంతో ఒక రైతు వినూత్నంగా ట్రాక్టర్ బ్యాటరీతో ఇన్వర్టర్ ఏర్పాటు చేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఫోన్లు మూగబోయాయి. దీంతో మండల కేంద్రంలో వంగల శివ అనే రైతు సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం ట్రాక్టర్ బ్యాటరీ సహాయంతో ఇన్వర్టర్ ఏర్పాటు చేశాడు. దానికి స్విచ్ బోర్డు కనెక్షన్ ఇచ్చాడు. ఈ విషయం తెలియడంతో స్థానికులతోపాటు సమీప గ్రామాల ప్రజలు ట్రాక్టర్ నడిచేందుకు డీజిల్ తెచ్చి శివకు అందిస్తున్నారు. ట్రాక్టర్ ఇంజన్‌ను ఆన్‌లో ఉంచుతూ ఫోన్లు చార్జింగ్ చేసుకుంటున్నారు. (క్లిక్: 64 ఏళ్ల రికార్డు బద్దలు.. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు)