Pallaswamy
-
ఎడపాడి ప్రభుత్వంలో ఎన్ని మలుపులో?
► నాడు శాసనసభ్యుల ఉపసంహరణతో భయం ► ఎమ్మెల్యేలకు అనర్హత వేటు సంజాయిషీ నోటీసులతో ధైర్యం ► కేంద్ర హోంమంత్రితో గవర్నర్ చర్చలు వాయిదా ► పుదుచ్చేరి రిసార్టులో ఎమ్మెల్యేలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి ఏ ముహూర్తాన ఎన్నికయ్యారోగానీ ఆనాటి నుంచి చిక్కులపై చిక్కులు వెన్నంటుతూనే ఉన్నాయి. 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఎడపాడి క్రమేణా అస్థిర ప్రభుత్వంగా అగాథంలోకి జారిపోయారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికార పార్టీకి సవాలు విసురుతున్న పన్నీర్‌సెల్వం వర్గంతో కొన్ని నెలలు పడరాని పాట్లు పడ్డారు. ప్రధాని మోదీ పుణ్యమాని పన్నీర్ సెల్వం ఎడపాడి పక్కకు చేరిపోయారు. హమ్మయ్యా.. అంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఎడపాడికి దినకరన్ దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారు. తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేల చేత మద్దతు ఉపసంహరణతో ఎడపాడి ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేశారు. 117 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఎడపాడికి అందుబాటులోకి రావాల్సి ఉంది. తన ఎమ్మెల్యేలకు ఎడపాడి ఎరవేయకుండా దినకరన్ పుదుచ్చేరిలో క్యాంప్ రాజకీయాలను ప్రారంభించారు. గవర్నర్ నుంచి లేదా న్యాయస్థానం నుంచి బలపరీక్ష ఆదేశాలు అందేలోపే జాగ్రత్తపడాలని అప్రమత్తమైన ఎడపాడి గురువారం స్పీకర్, ప్రభుత్వ విప్‌లతో సమావేశమయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నేరంపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదని 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ద్వారా గురువారం నోటీసులు జారీచేయించి దినకరన్‌కు షాకిచ్చారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు పది రోజుల్లోగా బదులివ్వాల్సి ఉంది. నోటీసులు జారీచేసింది వేటు వేసేందుకే కాబట్టి ఎమ్మెల్యేల సమాధానానికి అసంతృప్తి వ్యక్తంచేస్తూ వేటు ఆదేశాలు జారీచేసే అకాశం ఉంది. స్పీకర్ అనర్హత వేటు వేసిన పక్షంలో అసెంబ్లీలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య 135 నుంచి 116 కు పడిపోతుంది. ఈ లెక్కన మ్యాజిక్ ఫిగర్ 117 లేకున్నా ఎడపాడి ప్రభుత్వ మనుగడకు ముప్పు ఉండక పోవచ్చు. పొంచి ఉన్న మరో ముప్పు ఎమ్మెల్యేలను వదిలించుకోవడం ద్వారా తలనొప్పి బయటపడిన పక్షంలో ఎడపాడికి మరో ముప్పు పొంచి ఉం టుంది. రెండు పిల్లుల తగవు కోతి తీర్చినట్లుగా అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాట డీఎంకేని అధికార పీఠంలో కూర్చోబెట్టగలదని భావిస్తున్నారు. అసెంబ్లీలో డీఎం కేకు 89, మిత్రపక్ష కాంగ్రెస్‌కు 8, ఇండియన్ ముస్లింలీగ్‌కు 1 కలుపుకుంటే ప్రతిపక్షానికి మొత్తం 98 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 19 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఖాళీ అయిన పక్షంలో ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలను నిర్వహించాలి. జయలలిత ప్రాతిని«ధ్యం వహించిన ఆర్కేనగర్ కూడా ఎంతోకాలంగా ఖాళీగా ఉంది. అమ్మ మరణం అన్నాడీఎంకేకి శాపంగా మారగా డీఎంకేకు వరంగా పరిణమించే పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ఎన్నికల్లో డీఎంకే గెలిస్తే.. ఉప ఎన్నికలు జరిగే 20 స్థానాల్లో డీఎంకే గెలిసిన పక్షంలో ప్రతిపక్ష బలం 118 కి చేరుకుంటుంది. అసెంబ్లీలో సీఎం ఎడపాడి కంటే ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. శాసనసభాపక్ష నేత (సీఎం)గా స్టాలిన్ ఎన్నిక య«థావిధిగా జరిగిపోతుంది. హోంమంత్రితో గవర్నర్ చర్చలు వాయిదా ఇదిలా ఉండగా, తమిళనాడు ప్రభుత్వంలో చోటుచేసుకున్న పరిణామాలను కేంద్ర హోంమంత్రి రాజ్నా«థ్సింగ్కు వివరించేందుకు తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు గురువారం తీసుకున్న అపాయింట్మెంట్ రద్దయింది. ఈ చర్చలు శుక్రవారం జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. పుదుచ్చేరిలో పదనిసలు పుదుచ్చేరి రిసార్టులో 19 మంది ఎమ్మెల్యేలు జోరుగా హుషారుగా కాలక్షేపం చేస్తున్నారు. రిసార్టులో ఎమ్మెల్యేల పోషణకు రోజుకు రూ.5 లక్షలు ఖర్చు అవుతోంది. అనేక వసతులున్నా స్పా సౌకర్యం లేదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి వరకు పనిచేస్తుండిన స్పా మసాజ్ సెంటర్ రెండు రోజుల క్రితం మూతపడింది. దీంతో ఇక చేసేదిలేక పిల్లల పార్కులో రకరాల ఆటలు ఆడుతూ, ఉయ్యాలలు ఊగుతూ గడుపుతున్నారు. ఈ రకంగా వారి ఫొటోలను వారే విడుదల చేస్తున్నారు. పార్టీ నుంచి శశికళను తొలగించే ప్రయత్నాలను నిరసిస్తూ ఎమ్మెల్యే రత్న సభాపతి.. దినకరన్‌కు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. ఇదే నిజమైతే దినకరన్ వర్గ ఎమ్మెల్యేల సంఖ్య 20కి పెరుగుతుంది. దినకరన్ క్యాంపును కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి సమర్థించారు. కరూరు జిల్లా అరవకురిచ్చి ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఇతర ఎమ్మెల్యేలతోపాటూ పుదుచ్చేరి రిసార్టులో బసచేసి ఉండడంతో ఆయన నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని పోలీసు స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. పార్టీ నుంచి బహిష్కరించే అధికారం దినకరన్‌కు లేదని పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ అన్నారు. అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించాలని కోరుతూ దినకరన్ వర్గ ఎమ్మెల్యే ఒకరు తన న్యాయవాది ద్వారా మద్రాసు హైకోర్టులో గురువారం పిటిషన్ వేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేల క్యాంప్ వల్ల రిసార్ట్స్ పరిసరాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని కొందరు పోలీసుల కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రిసార్ట్స్‌లో తనిఖీ చేసి అంతా సవ్యంగా ఉందని తెలిపారు. -
వరాల జల్లు
ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలపై వరాలజల్లు కురిపించారు. ఒక్క విద్యుత్ శాఖ పరిధిలోనే రూ.5,760 కోట్లతో పలు పథకాలను ప్రకటించారు. 1600 ఎకరాల్లో ఐటీ కారిడార్, పలుచోట్ల పారిశ్రామిక వాడలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. రూ.1,000 కోట్లతో కొత్త డ్యాంలు, చెక్‌డ్యాంలు నిర్మించనున్నామని వెల్లడించారు. ♦ రూ.5,760 కోట్లతో కొత్త విద్యుత్ పథకాలు ♦ బహుళ ప్రయోజనాల కంటైనర్ టెర్మినల్స్ ♦ వివాహ రిజిస్ట్రేషన్ 154 రోజులకు పెంపు బిల్లు ♦ ఉచిత పథకాలకు రూ.490 కోట్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ సమావేశాల్లో గురువారం 110 నిబంధన కింద సీఎం ఎడపాడి పళనిస్వామి కార్మికశాఖ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖల పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపం పుళుదివాక్కం, వాయలూరు గ్రామాల్లో 360 ఎకరాల విస్తీర్ణంలో తమిళనాడు కార్మికశాఖాభివృద్ధి కార్యాలయం, కేంద్రప్రభుత్వ జాతీయ రహదారులశాఖతో కలిసి బహుళ ప్రయోజనాల కంటైనర్ టెర్మినల్స్‌ను రూ.1,295 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. సముద్ర, వాయు, రోడ్డు మార్గాల రవాణాను దృష్టిలో పెట్టుకుని సిప్కాట్ పారిశ్రామికవాడలకు పక్కనే, ఒట్టప్పిటారమ్ దక్షిణం, మీలవిట్టాన్ గ్రామాల్లో సుమారు 1600 ఎకరాల్లో సిప్కాట్ తూత్తుకూడి ఐటీ కారిడార్–2 ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కారిడార్ ఏర్పాటుకు ముందుగా 600 ఎకరాల్లో రోడ్లు, వీధి దీపాలు, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం తదితరాలను కల్పించనున్నట్లు చెప్పారు. ఇక్కడి ఐటీ కారిడార్ వల్ల రూ.500 కోట్ల పెట్టుబడి, 20 వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. వేలూరు జిల్లా ఆర్కాడు, ముల్లువాడి, నాగలేరి గ్రామాల్లో సుమారు 20 ఎకరాల్లో రూ.4.74 కోట్ల అంచనాతో, తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట, ఏనంబాక్కం గ్రామాల్లో 216.37 ఎకరాల్లో రూ.58.82 కోట్లతో, తిరువన్నామలై జిల్లా సెంగం మండలం పెరియకొలపాడి, కన్నక్కురుగై గ్రామాల్లో 57.18 ఎకరాల్లో రూ.13 కోట్ల పెట్టుబడితో పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రిజిష్టరు అయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 6.92 లక్షల వరకు ఉండగా వీటి ప్రయోజనాలకు పలు పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రూ.2,350 కోట్లతో రామనాథపురం జిల్లాలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పొంగల్ పండుగ ఉచిత పంచలు, చీరల కోసం రూ.490 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రూ.1000 కోట్లతో కొత్త డ్యాంలు, చెక్‌డ్యాంలు నిర్మించనున్నామని అన్నారు. 2009 వివాహ చట్టం ప్రకారం వివాహమైన తేదీ నుంచి 90 రోజుల్లోగా రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఆలస్యమైతే మరో 60 రోజుల్లో వధూవరులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అయితే మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 150 రోజుల్లోగా వివాహ రిజిస్ట్రేషన్ పూర్తికావాలి, వధూవరులు నేరుగా హాజరుకాకుండా రిజిస్ట్రేషన్ చేయరాదనే కోర్టు ఆదేశాల మేరకు చట్టంలో సవరణలకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. చట్టంలో సవరణకు ముస్లింలీగ్ సభ్యుడు అబూబకర్ నిరసన తెలిపారు. విద్యుత్ వరాలు రాష్ట్రంలో పలుచోట్ల రూ.1,347 కోట్లతో 230 కిలోవాట్ల సబ్స్టేషన్లు, 110 కిలోవాట్ల సబ్స్టేషన్లు, 33 కిలోవాట్ల సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాగపట్టణం జిల్లా మనల్మేడు ప్రాంతంలో రూ.650 కోట్ల పెట్టుబడితో 400 కిలోవాట్ల సబ్స్టేషన్లను, విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గ్రేటర్ చెన్నై కోయంబేడులో రూ.1,300 కోట్లతో 400 కిలోవాట్ల ఇంధన విద్యుత్ శక్తి నిలయాన్ని ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ప్రస్తుతం 230 కిలోవాట్ల సామర్థ్యంతో ఉన్న తరమణి విద్యుత్ కేంద్రాన్ని రూ.710 కోట్లతో రూ.400 కిలోవాట్ల ఇంధనశక్తి సబ్‌స్టేషన్‌గా స్థాయిని పెంచనున్నట్లు తెలిపారు. చెన్నై శివార్లలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు అదనంగా 31 కొత్త సబ్స్టేషన్లు నిర్మించి 314 సబ్స్టేషన్ల స్థాయిని పెంచనున్నట్లు తెలిపారు.