ఎడపాడి ప్రభుత్వంలో ఎన్ని మలుపులో? | How many times do you go in the yedapaadi government? | Sakshi
Sakshi News home page

ఎడపాడి ప్రభుత్వంలో ఎన్ని మలుపులో?

Published Fri, Aug 25 2017 3:57 AM | Last Updated on Sun, Sep 17 2017 5:55 PM

ఎడపాడి ప్రభుత్వంలో ఎన్ని మలుపులో?

ఎడపాడి ప్రభుత్వంలో ఎన్ని మలుపులో?

నాడు శాసనసభ్యుల ఉపసంహరణతో భయం
ఎమ్మెల్యేలకు అనర్హత వేటు సంజాయిషీ నోటీసులతో ధైర్యం
కేంద్ర హోంమంత్రితో గవర్నర్‌ చర్చలు వాయిదా
పుదుచ్చేరి రిసార్టులో ఎమ్మెల్యేలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా


ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి ఏ ముహూర్తాన ఎన్నికయ్యారోగానీ ఆనాటి నుంచి చిక్కులపై చిక్కులు వెన్నంటుతూనే ఉన్నాయి. 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఎడపాడి క్రమేణా అస్థిర ప్రభుత్వంగా అగాథంలోకి జారిపోయారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికార పార్టీకి సవాలు విసురుతున్న పన్నీర్‌సెల్వం వర్గంతో కొన్ని నెలలు పడరాని పాట్లు పడ్డారు. ప్రధాని మోదీ పుణ్యమాని పన్నీర్‌ సెల్వం ఎడపాడి పక్కకు చేరిపోయారు. హమ్మయ్యా.. అంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఎడపాడికి దినకరన్‌ దిమ్మతిరిగేలా షాక్‌ ఇచ్చారు. తన వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేల చేత మద్దతు ఉపసంహరణతో ఎడపాడి ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేశారు. 117 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్‌ ఫిగర్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఎడపాడికి అందుబాటులోకి రావాల్సి ఉంది. తన ఎమ్మెల్యేలకు ఎడపాడి ఎరవేయకుండా దినకరన్‌ పుదుచ్చేరిలో క్యాంప్‌ రాజకీయాలను ప్రారంభించారు.

గవర్నర్‌ నుంచి లేదా న్యాయస్థానం నుంచి బలపరీక్ష ఆదేశాలు అందేలోపే జాగ్రత్తపడాలని అప్రమత్తమైన ఎడపాడి గురువారం స్పీకర్, ప్రభుత్వ విప్‌లతో సమావేశమయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నేరంపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదని 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ ద్వారా గురువారం నోటీసులు జారీచేయించి దినకరన్‌కు షాకిచ్చారు. స్పీకర్‌ ఇచ్చిన నోటీసులకు పది రోజుల్లోగా బదులివ్వాల్సి ఉంది. నోటీసులు జారీచేసింది వేటు వేసేందుకే కాబట్టి ఎమ్మెల్యేల సమాధానానికి అసంతృప్తి వ్యక్తంచేస్తూ వేటు ఆదేశాలు జారీచేసే అకాశం ఉంది.  స్పీకర్‌ అనర్హత వేటు వేసిన పక్షంలో అసెంబ్లీలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య 135 నుంచి 116 కు పడిపోతుంది. ఈ లెక్కన మ్యాజిక్‌ ఫిగర్‌ 117 లేకున్నా ఎడపాడి ప్రభుత్వ మనుగడకు ముప్పు ఉండక పోవచ్చు.

పొంచి ఉన్న మరో ముప్పు
ఎమ్మెల్యేలను వదిలించుకోవడం ద్వారా తలనొప్పి బయటపడిన పక్షంలో ఎడపాడికి మరో ముప్పు పొంచి ఉం టుంది. రెండు పిల్లుల తగవు కోతి తీర్చినట్లుగా అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాట డీఎంకేని అధికార పీఠంలో కూర్చోబెట్టగలదని భావిస్తున్నారు. అసెంబ్లీలో డీఎం కేకు 89, మిత్రపక్ష కాంగ్రెస్‌కు 8, ఇండియన్‌ ముస్లింలీగ్‌కు 1 కలుపుకుంటే ప్రతిపక్షానికి మొత్తం 98 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 19 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఖాళీ అయిన పక్షంలో ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలను నిర్వహించాలి. జయలలిత ప్రాతిని«ధ్యం వహించిన ఆర్కేనగర్‌ కూడా ఎంతోకాలంగా ఖాళీగా ఉంది. అమ్మ మరణం అన్నాడీఎంకేకి శాపంగా మారగా డీఎంకేకు వరంగా పరిణమించే పరిస్థితులు నెలకొన్నాయి.

ఉప ఎన్నికల్లో డీఎంకే గెలిస్తే..
ఉప ఎన్నికలు జరిగే 20 స్థానాల్లో డీఎంకే గెలిసిన పక్షంలో ప్రతిపక్ష బలం 118 కి చేరుకుంటుంది. అసెంబ్లీలో సీఎం ఎడపాడి కంటే ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. శాసనసభాపక్ష నేత (సీఎం)గా స్టాలిన్‌ ఎన్నిక య«థావిధిగా జరిగిపోతుంది.

హోంమంత్రితో గవర్నర్‌ చర్చలు వాయిదా
ఇదిలా ఉండగా, తమిళనాడు ప్రభుత్వంలో చోటుచేసుకున్న పరిణామాలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నా«థ్‌సింగ్‌కు వివరించేందుకు తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు గురువారం తీసుకున్న అపాయింట్‌మెంట్‌  రద్దయింది. ఈ చర్చలు శుక్రవారం జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

పుదుచ్చేరిలో పదనిసలు
పుదుచ్చేరి రిసార్టులో 19 మంది ఎమ్మెల్యేలు జోరుగా హుషారుగా కాలక్షేపం చేస్తున్నారు. రిసార్టులో ఎమ్మెల్యేల పోషణకు రోజుకు రూ.5 లక్షలు ఖర్చు అవుతోంది. అనేక వసతులున్నా స్పా సౌకర్యం లేదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి వరకు పనిచేస్తుండిన స్పా మసాజ్‌ సెంటర్‌ రెండు రోజుల క్రితం మూతపడింది. దీంతో ఇక చేసేదిలేక పిల్లల పార్కులో రకరాల ఆటలు ఆడుతూ, ఉయ్యాలలు ఊగుతూ గడుపుతున్నారు. ఈ రకంగా వారి ఫొటోలను వారే విడుదల చేస్తున్నారు. పార్టీ నుంచి శశికళను తొలగించే ప్రయత్నాలను నిరసిస్తూ ఎమ్మెల్యే రత్న సభాపతి.. దినకరన్‌కు మద్దతు ప్రకటించినట్లు సమాచారం.

ఇదే నిజమైతే దినకరన్‌ వర్గ ఎమ్మెల్యేల సంఖ్య 20కి పెరుగుతుంది. దినకరన్‌ క్యాంపును కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విజయధరణి సమర్థించారు. కరూరు జిల్లా అరవకురిచ్చి ఎమ్మెల్యే సెంథిల్‌ బాలాజీ ఇతర ఎమ్మెల్యేలతోపాటూ పుదుచ్చేరి రిసార్టులో బసచేసి ఉండడంతో ఆయన నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని పోలీసు స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. పార్టీ నుంచి బహిష్కరించే అధికారం దినకరన్‌కు లేదని పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌ అన్నారు. అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించాలని కోరుతూ దినకరన్‌ వర్గ ఎమ్మెల్యే ఒకరు తన న్యాయవాది ద్వారా మద్రాసు హైకోర్టులో గురువారం పిటిషన్‌ వేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేల క్యాంప్‌ వల్ల రిసార్ట్స్‌ పరిసరాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని కొందరు పోలీసుల కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రిసార్ట్స్‌లో తనిఖీ చేసి అంతా సవ్యంగా ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement