
టూరిజం ప్లాజాలో ఆయన ప్రత్యక్షమవడంతో నేతలు షాకయ్యారు.
సాక్షి, హైదరాబాద్: జనగామ బీఆర్‌ఎస్ టికెట్ రేస్ పంచాయితీ హైదరాబాద్‌కి చేరింది. ప్రగతి భవన్‌కి కూతవేటు దూరంలో క్యాంప్ రాజకీయం ఆసక్తికరంగా సాగింది. ఎమ్మెల్సీ పల్లాను కలిసేందుకు బీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్‌కు రాగా, వారు హైదరాబాద్ వెళ్లారనే సమాచారంతో హుటాహుటిన నగరానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి వచ్చారు.
టూరిజం ప్లాజాలో ఆయన ప్రత్యక్షమవడంతో జనగామ బీఆర్‌ఎస్ నేతలు షాకయ్యారు. ముత్తిరెడ్డికి తెలియకుండానే పల్లా పిలిపించాడని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. అధిష్టానం ఇలాంటి చర్యలను క్షమించదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. ‘‘ఇక్కడకు వచ్చిన వారిలో ముఖ్య కార్యకర్తలు ఎవరూ లేరు. జడ్పీటీసీ, ఎంపీపీ, మండలాధ్యక్షులు నా వెంటే ఉన్నారు. కొంత మంది మా నియోజకవర్గ పార్టీ నేతలు హరిత ప్లాజాకు వచ్చారని తెలిసింది. ఎవరు వచ్చారో తెలుసుకుందామని వచ్చాను.
..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన వ్యక్తిని నేను. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి నాకు ఫోన్ చేసి ఇలాంటివి ప్రోత్సహించనని చెప్పారు. అసమ్మతి సంగతి అధిష్టానం చూసుకుంటుంది’’ అని ముత్తిరెడ్డి అన్నారు.
చదవండి: టార్గెట్ కేసీఆర్.. రేవంత్ ఆరోపణలకు అర్థాలు లేవులే!