సాక్షి, జనగామ: జనగామ బీఆర్‌ఎస్ ఆధిపత్య పోరు మరింత రాజుకుంటోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలని పల్లాను డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, ఇన్ బ్యాలెన్స్ ఉండేందుకు. అందుకే ఆహ్వానించారే తప్ప కుక్కల్ని చేయడానికి కాదని విషయాన్ని గమనించాలి. పల్లా తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. తప్పు జరిగిందని క్షమాపణ చెప్పాలి అని ముత్తిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చారు. ‘ బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుక్కలు. అటువైపు ఉంటే మొరుగుతారనే బీఆర్‌ఎస్‌లో చేర్చుకొని దొడ్లో కట్టేశారు. అటువైపు ఉన్న కుక్కలను ఇటు తీసుకుని.. వారిని పిల్లిలాగా కేసీఆర్ మార్చేశారు. అలా కేసీఆర్ వారిని గీత దాటకుండా చేసేశారు’ అని వ్యాఖ్యానించారు పల్లా.
ముత్తిరెడ్డి ఆగ్రహం..
పల్లా వ్యాఖ్యలపై ముత్తిరెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘బలుపెక్కువై డబ్బు ఎక్కువ ఉన్నవారు అమాయక ప్రజల మీద డబ్బులు చల్లి అయోమయానికి గురి చేస్తున్నారు. అలా చేయడం సీఎం కేసీఆర్ సంకల్పానికి విరుద్ధం. అమ్ముడుపోయేవారు ఆగమై మట్లే కలిసిపోతారు. కేసీఆర్ నిర్ణయం శిరోధార్యం. కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే అందరం కలిసే ప్రయాణం చేస్తాం. ప్రజల అభిమానాన్ని కోరికను కేసీఆర్ తీరుస్తాడు. ముఖ్యమంత్రి పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. 14ఏళ్లుగా మీ కష్టాలు మీ జ్ఞాపకాలు కేసీఆర్ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి సీఎం కోరిక తీరుస్తాడు. సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. భారీ మెజార్టీతో గెలుస్తాం’’ అని ముత్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
చైర్‌పర్సన్ ప్రసంగానికి అంతరాయం
దివ్యాంగుల ఆసరా పెంపు కార్యక్రమంలో ఇవాళ ముత్తిరెడ్డి పల్లాపై మండిపడ్డారు. అయితే.. ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ జమున మాట్లాడారు. ముత్తిరెడ్డి కూడా తన బాధను చెప్పుకున్నారని, ఎవరికీ టికెట్ ఇచ్చిన పని చేయాలని ప్రసంగించారు. ఆ సమయంలో కార్యకర్తలు చైర్‌పర్సన్ ప్రసంగానికి అడ్డుతలిగారు. ముత్తిరెడ్డి కి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఆ కార్యక్రమం గందరగోళంగా మారింది. దీంతో ముత్తిరెడ్డి జోక్యం చేసుకునితన అనుచరుల్ని శాంతింపజేశారు. మరోవైపు జనగామ అభ్యర్థిని త్వరగా ఖరారు చేసి ఉత్కంఠకు తెరదించాలని ముత్తిరెడ్డి వర్గం బీఆర్‌ఎస్ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment