పాల్మన్పేట ఘటనపై వైఎస్ఆర్ సీపీ నిజ నిర్థారణ కమిటీ
హైదరాబాద్ : విశాఖ జిల్లా పాల్మన్ పేట ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్థారణ కమిటీని వేసింది. కమిటీ సభ్యులుగా మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, చెంగల వెంకట్రావు, గొల్ల బాబూరావు, కోలా గురువులు తదితరులు నియమితులయ్యారు. జులై 1, 2 తేదీల్లో నిజ నిర్థారణ కమిటీ పాల్మన్ పేటలో పర్యటించనున్నారు. బాధితుల నుంచి వాస్తవాలను తెలుసుకోనున్నారు.
కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలా ఉన్న పాల్మన్పేటను పూర్తిగా నేల మట్టం చేయాలని టీడీపీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సర్పంచ్ దోని నాగార్జున, ఎంపీటీసీ గరికిన రమణల ఇళ్లు ప్రధానంగా టార్గెట్ చేశారు. వాటిపై దాడి చేసి ఇళ్లలోని సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వారి వాహనాలు, ఇళ్లు లక్ష్యం చేసుకున్నారు. దీనంతటికీ ముందుగానే పక్కా వ్యూహం రచించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఊరిపై దాడికి రాగానే ఎవరెవరు ఎవరిపై దాడిచేయాలనే స్పష్టతతోనే దాడులకు పాల్పడం వెనుక నిందుతులు ఓ ప్రణాళికతోనే దాడులకు వచ్చినట్లు రూఢీ అవుతోంది.
కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని ఆ ఊరిలో లేకుండా చేయాలనే ప్రధాన లక్ష్యంతోనే ఈ దురాగతానికి టీడీపీ పాల్పడినట్లు బాధితుల మాటలను బట్టి అర్ధమవుతోంది. ఏకంగా 86 వాహనాలను నాశనం చేయడంతో పాటు ఇళ్లల్లోకి చొరబడి బీరువాల్లో ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. చివరికి బియ్యం బస్తాలు కూడా దొమ్మీ చేశారు.