pamplets
-
గవర్నర్ వైఖరిపై అధికార పార్టీ విస్తృతస్థాయి నిరసన
తిరువనంతపురం: కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వాన్ని బహిరంగంగా తీవ్రంగా తప్పుబట్టే ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌పై క్షేత్రస్థాయి విస్తృత నిరసన కార్యక్రమాలకు ఎల్డీఎఫ్ శ్రేణులు తెరతీశాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గవర్నర్ ఖాన్‌కు వ్యతిరేకంగా కరపత్రాలు పంచిపెట్టాయి. భారత రాజ్యాంగంపై కనీస అవగాహనలేని గవర్నర్ పూర్తిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరఫున పనిచేస్తున్నారని ఆ కరపత్రాల్లో ప్రచురించారు. ఉన్నత విద్య పరిరక్షణకు ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ సొసైటీ పేరిట ఈ కరపత్రాలు ముద్రితమయ్యాయి. ఈనెల 15వ తేదీన రాజ్‌భవన్ ఎదుట ఏకంగా లక్షమందితో భారీ నిరసన కార్యక్రమానికి ఏర్పాటుచేస్తున్నట్లు ఎల్డీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమిస్తున్నారని, గుత్తాధిపత్యం రాజ్యమేలుతోందని గవర్నర్ ఖాన్ సోమవారం విమర్శించిన విషయం తెల్సిందే. ఇదీ చదవండి: గవర్నర్‌కు ఇలా చేసే అధికారం ఉందా?.. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? -
కాటారంలో 'మావో' కరపత్రాల కలకలం
సాక్షి, కాటారం(వరంగల్) : కాటారం సబ్ డివిజన్లోని పలు మండలాల్లో కొన్ని రోజులుగా కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పలిమెల మండలంలోని సర్వాయిపేట, మహాముత్తారం మండలం కనుకునూర్‌లో పలువురు ప్రజాప్రజాప్రతినిధులు, నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టులు కరపత్రాలు వేయగా తాజాగా మంగళవారం కాటారం మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) పేరిట కరపత్రాలు వెలిశాయి. మండల కేంద్రానికి కూత వేటు దూరంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల గేటుతో పాటు కాటారంలోని పలు ఇళ్ల గోడలపై మావోల పేరిట రాసిన కరపత్రాలు దర్శనమిచ్చాయి. కాటారం మండల కేంద్రానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు బొమ్మ మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ కరపత్రాలు వెలిసాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చైర్మన్ పదవిని అడ్డుపెట్టుకుని మేడారం, తాడ్వాయి మండలంలో 150 ఎకరాల భూమి కబ్జాకు పాల్పడటంతో పాటు ముకునూరు, నీలంపల్లిలో 430 ఎకరాల భూమి అక్రమంగా స్వాధీనపర్చుకున్నారని కరపత్రాల్లో పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఆ భూములను ప్రజలకు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఆయనతో పాటు కుటుంబసభ్యులను కాల్చి చంపుతామని కరపత్రాల ద్వారా హెచ్చరించారు. కాగా, కరపత్రాల్లో భారతకమ్యూనిస్టూ పార్టీ (మావోయిస్టు) అనేది మాత్రమే ఎరుపు రంగు పెన్నుతో రాసి మిగితా లేఖ మొత్తం బ్లూ పెన్నుతో రాయడంతో ఇవి నకిలీ కరపత్రాలనే సందేహాలు వెలువడుతున్నాయి. మల్లారెడ్డితో వైరం ఉన్నవారు ఎవరో భయభ్రాంతులకు గురి చేయడానికి నకిలీ కరపత్రాలు సృష్టించి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. కరపత్రాల్లో పేర్కొన్నట్లు మల్లారెడ్డికి భూములు లేనట్లు సమాచారం. కాగా, సమాచారం తెలుసుకున్న సీఐ హతీరాం, ఎస్సై2 జహీర్‌ఖాన్ సంఘటనా స్థలానికి చేరుకుని కరపత్రాలను స్వాధీనపర్చుకున్నారు. ఈ విషయమై సీఐ హతీరాంను వివరణ కోరగా అవి నకిలీ కరపత్రాలని కొట్టిపారేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, త్వరలోనే ఈ చర్యలకు పాల్పడిన వారిని పట్టుకుంటామని తెలిపారు. -
మన్యంలో కరపత్రాల కలకలం
రహదారిపై అనుమానాస్పద మూట మందుపాతరగా అనుమానం పేగ (చింతూరు): మావోయిస్టుల వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం చింతూరు మండలం పేగ, మల్లంపేట ప్రధాన రహదారిపై పేగ గ్రామం వద్ద కరపత్రాలు, పోస్టర్లు వెలిశాయి. అదే రహదారిపై ఓచోట బరువైన వస్తువున్న ప్లాస్టిక్‌సంచి అనుమానాస్పదంగా పడి ఉండడంతో మావోయిస్టులు మందుపాతర అమర్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంచి పక్కనే పోస్టర్లు, కరపత్రాలు ఉన్నాయి. వాటిని తీసేందుకు వచ్చే పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు సంచిలో మందుపాతర పెట్టి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులు ఇంకా ఆ ప్రాంతానికి రాలేదు. ఆ సంచిలో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వివిధ ఎన్కౌంటర్లలో మృతిచెందిన మావోయిస్టు నాయకుల ఫోటోలతో కూడిన పోస్టర్లను మావోయిస్టులు అక్కడ ఉంచారు.