మన్యంలో కరపత్రాల కలకలం
-
రహదారిపై అనుమానాస్పద మూట
-
మందుపాతరగా అనుమానం
పేగ (చింతూరు):
మావోయిస్టుల వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం చింతూరు మండలం పేగ, మల్లంపేట ప్రధాన రహదారిపై పేగ గ్రామం వద్ద కరపత్రాలు, పోస్టర్లు వెలిశాయి. అదే రహదారిపై ఓచోట బరువైన వస్తువున్న ప్లాస్టిక్‌సంచి అనుమానాస్పదంగా పడి ఉండడంతో మావోయిస్టులు మందుపాతర అమర్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంచి పక్కనే పోస్టర్లు, కరపత్రాలు ఉన్నాయి. వాటిని తీసేందుకు వచ్చే పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు సంచిలో మందుపాతర పెట్టి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులు ఇంకా ఆ ప్రాంతానికి రాలేదు. ఆ సంచిలో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వివిధ ఎన్‌కౌంటర్లలో మృతిచెందిన మావోయిస్టు నాయకుల ఫోటోలతో కూడిన పోస్టర్లను మావోయిస్టులు అక్కడ ఉంచారు.