మూడు రోజులుగా కొనసాగుతున్న ఎన్కౌంటర్
జమ్ము కశ్మీర్లోని పాంపోర్ ప్రాంతంలోగల ఓ ప్రభుత్వ భవనంలో నక్కిన ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు గత మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఈడీఐ) భవనంలో దాగిన ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతాదళాలు హతమార్చాయి. శ్రీనగర్- జమ్ము జాతీయ రహదారి సమీపంలో గల ఈ భవనంమీద పలుమార్లు మోర్టార్లతో దాడి చేయడంతో పాటు ఉగ్రవాదులను హతమార్చేందుకు ఐఈడీ కూడా పేల్చారు. సోమవారం ఉదయం మొదలైన ఈ ఎన్కౌంటర్ బుధవారం ఉదయం కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యమధ్యలో భవనం లోపలి నుంచి కాల్పుల మోతలు వినిపిస్తున్నాయి. భవనంలో చాలా భాగం పూర్తిగా కుప్పకూలింది.
ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు ఆర్మీకి చెందిన పారా కమాండోలను కూడా పిలిపించారు. కానీ, ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లకూడదన్న ఉద్దేశంతో భవనంలోకి భద్రతాదళాలు వెళ్లడంలేదు. ఉగ్రవాదులు ఎటూ పారిపోకుండా ఉండేందుకు ఈడీఐ భవనం చుట్టు పక్కల ప్రాంతం మొత్తాన్ని భద్రతాదళాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఇద్దరు లేదా ముగ్గరు ఉగ్రవాదులు లోపలకు వెళ్లినట్లు భావిస్తున్నారు. వాళ్లు బోటులో ప్రయాణించి వచ్చి భవనం వెనకవైపు నుంచి లోపలకు వచ్చి ఉంటారని అంటున్నారు.