Panchabhutas
-
కంటికి కనబడని ఆభరణం
ఒకనాడు యవ్వనంలో ఎంతో మిసమిసలాడుతున్న వ్యక్తి... వృద్ధాప్యం వచ్చేసరికి ఒళ్ళంతా ముడతలు పడిపోయి, దవడలు జారిపోయి, జుట్టు తెల్లబడిపోయి ఉండవచ్చు. కానీ భౌతికంగా ఎంత అందంగా ఉన్నారన్నది కాదు, కాలక్రమంలో అది నిలబడదు. భగవంతుడిచ్చిన విభూతులను వయసులో ఉన్నప్పుడే సక్రమంగా వాడుకుని ఆ అందాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆ చివరి సమయంలో మనిషికి అందం – ఆయన అనుభవం, గతంలో ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన నడవడిక మాత్రమే. ‘‘హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, కర్ణస్య భూషణం శాస్త్రం, భూషణైః కిం ప్రయోజనం’’ చేతికి కంకణములు, కేయూరములు, అంగదములు, ఉంగరములు... ఇవన్నీ కూడా అలంకారాలే.. భగవంతుడిచ్చినప్పుడు వేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మ ఒక్కటే...అని.. అవతలి ప్రాణి కష్టాన్ని తన కష్టంగా భావించి ఆదుకోవడం కోసం తన చేతితో తనదైన దానిని ఇవ్వగలిగిన వాడు ప్రాజ్ఞుడు. ఆ చేతికి దానమే అతి పెద్ద అలంకారం. మిగిలిన అలంకారాలు తొలగిపోయినా... పైకి కనబడకపోయినా అది శాశ్వతంగా నిలిచిపోయే, వెలిగిపోయే అలంకారం. దానం చేయడం అంటే ఏమీ మిగుల్చుకోకుండా అని కాదు. తనకున్న దానిలో తన శక్తికొద్దీ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయడం... అలా ఎందుకు? అంటే అలా చేయకుండా ఉండలేకపోవడమే మానవత్వం. శరీరంలో ఎక్కువగా ఆభరణాలు అలంకరించుకునే అవయవం కంఠం. వాటిలో మంగళప్రదమైనవి, ఐశ్వర్య సంబంధమైనవి ఉంటాయి.. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ... మనిషిని భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్ళేది... సత్య భాషణం. నిజాన్ని నిర్భయంగా, ప్రియంగా మాట్లాడడం. సత్యాన్ని మించిన ఆభరణం మరేదీ కంఠానికి అంత శోభనివ్వదు. ఇతర ఆభరణాలను తీసినట్లుగా ఈ ఆభరణాన్ని తీయడం అసాధ్యం. భగవంతుడు మనకు రెండు చెవులిచ్చాడు. మన అందాన్ని పెంచడానికి వీటిని కూడా అలంకరించుకుంటూ ఉంటాం. కానీ వాటికి నిజమైన ఆభరణం.. శాస్త్రాన్ని ఎప్పుడూ వింటూ ఉండడం, అంటే మన అభ్యున్నతికి దోహదపడే మంచి విషయాలను వినడం, అలా విన్న వాటితో సంస్కరింపబడి ఉన్నతిని పొందడం. నోటితో తిన్నది శరీర పుష్టికి కారణమవుతున్నది. చెవులద్వారా విన్నది... మనిషి సౌశీల్యానికి కారణం కావాలి. ఆయన ఊపిరి వదలడు, ఊపిరి తియ్యడు..అని నిర్ధారించుకున్న తరువాత చిట్టచివరన శరీరాన్ని పంచభూతాల్లో కలిపివేసేటప్పుడు ఇక ఆ శరీరం మీద ఏ ఒక్క ఆభరణాన్ని కూడా ఉంచరు.. అన్నీ తీసేస్తారు... అప్పుడు తీయలేనివి, పైకి కనపడనివి కొన్ని ఉంటాయి... తన జీవిత కాలంలో దానగుణంచేత, సత్యభాషణం చేత, తన ఉన్నతికి పనికొచ్చే విషయాలను శాస్త్రాల ద్వారా వినడం చేత సమకూర్చుకున్న ఆభరణాలు మాత్రం ఉండిపోతాయి. ఇవి నీ పేరు శాశ్వతంగా ఉండిపోవడానికి, కాలంతో సంబంధం లేకుండా నిన్ను పదిమంది ఎప్పుడూ స్మరిస్తూ ఉండడానికి, నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకోవడానికి, నిన్ను పరమాత్మకు చేరువ చేయడానికి ఎప్పుడూ నిన్ను అలంకరించి నీ అందాన్ని, వైభవాన్ని పెంచుతుంటాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పంచతత్వ పార్కు.. ఆకర్షణ, ఆరోగ్యం దీని ప్రత్యేకత
కంప్యూటర్ యుగంలో కాలంతో పాటే మనిషి పరుగెత్తుతూ యాంత్రిక జీవన విధానానికి అలవాటు పడిపోతున్నాడు. పని ఒత్తిడితో సతమతమవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ప్రశాంతంగా కొంత సమయాన్ని గడిపేందుకు వీలుగా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ఐజీ కాలనీలో పంచతత్వ పార్కు అందుబాటులోకి వచ్చింది. ఈ పార్కులో నడకతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే మానసిక ప్రశాంతతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. సాక్షి, హైదరాబాద్: పోచారం మున్సిపాలిటీలోని 3వ వార్డు ఎల్ఐజీ కాలనీలో ప్రభుత్వ ఆదేశానుసారం పోచారం పురపాలక సంఘం ఏర్పాటు చేసిన పంచతత్వ పార్కు చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. పార్కు కేంద్ర బిందువు వద్ద బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాని చుట్టూ సెక్టార్ల ఆకృతిలో పలు రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు. తదుపరి వలయంలో 20 ఎంఎం, 10 ఎంఎం కంకర రాళ్లు, రివర్ స్టోన్స్, 6 ఎంఎం చిప్స్, ఇసుక, నల్ల రేగడి మట్టి, చెట్ల బెరడు, నీటి బ్లాకుల అనుసంధానంతో ఆక్యుప్రెజర్ వాకింగ్ ట్రాక్‌ను నిర్మించారు. ఈ ట్రాక్‌పై నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై పలు స్థాయిల్లో ఒత్తిడి కలుగుతుంది. తద్వారా శరీరంలో సరైన రక్తప్రసరణ జరిగి అనారోగ్యాలు దూరమవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. రూ.15 లక్షల నిధులతో.. స్వచ్ఛమైన గాలితో పాటు ఆహ్లాదాన్ని పంచే పంచతత్వ పార్కు కోసం రూ.15లక్షల నిధులు వెచ్చించారు. పలు ప్రత్యేకతలతో నిర్మించిన ఈ పంచతత్వ పార్కు సందర్శకులను ఆకట్టుకుంటోంది. పార్కులోని మొక్కల పేర్లు.. పార్కులో ఫైకస్ పాండా, అలోవిరా, కృష్ణ తులసి, రణపాల, రియో, మినీ దురంతో ఎల్లో, ఇప్రోబియా మిల్లి, మినీ దురంతో పింక్, పాండనస్, మినీ ఎక్సోరా వైట్, వాము, లెమన్ గ్రాస్, ధవనమ్, పొడపత్రి తదితర మొక్కలున్నాయి. పంచతత్వ పార్కులో వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ► నిద్రలేమిని నివారిస్తోంది ► కంటి చూపు మెరుగవుతుంది ► నాడీ వ్యవస్థ బలోపేతమవుతుంది ► రోగనిరోధక శక్తి పెరుగుతుంది ►శక్తి వృద్ధి చెందుతుంది ►రుతుచక్రం సజావుగా సాగుతుంది ► వేడిని తగ్గిస్తుంది ► బీపీ తగ్గుతుంది ► గుండె పనితీరు మెరుగవుతుంది ► ఒత్తిడి తగ్గి, ప్రశాంతత కులుగుతుంది ► ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది పార్కులో ఇవి పాటించాలి.. ►పాదరక్షలు లేకుండా నడవాలి. ► సమయం తీసుకుని నెమ్మదిగా నడవాలి. ► క్రమం తప్పకుండా నడుస్తూ పురోగతిలో ఉండాలి. ►గాలిని పీల్చుతూ వదులుతూ ఉండాలి. ►ఎక్కడైనా నడవలేకపోతే, అక్కడ మరో రోజు ప్రయత్నించాలి ►నడక విషయంలో పట్టుదల ఉండాలి ►శరీరంలోని వ్యర్థాలు పోవాలంటే నీరు తాగాలి రీయో ►రీయో ఆకులతో డికాషన్ తయారు చేసుకుని తాగుతారు. దీని వల్ల దగ్గు, జలుబు, ఆస్తమా, ముక్కు నుంచి రక్తం కారడం వంటివి తగ్గుతాయి. అంతేకాకుండా ఒంట్లో చల్లదనం కోసం కూడా తీసుకుంటారు. వాము ►వాము మొక్క ఆకుల వాసన ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. మానసికి ఒత్తిడిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. గ్యాస్ సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. లెమన్ గ్రాస్ ►లెమన్ గ్రాస్ మొక్కలున్న చోటకు దోమలు రావు. దీనిలో ఏ, బీ1, బీ2, బీ3, బీ5, బీ6, కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ శాతం చాలా ఎక్కువ. లెమన్ గ్రాస్‌తో చేసిన టీ(చాయ్) నిద్రలేమిని తగ్గిస్తుంది. మస్తిష్కంతో పాటు కండరాలను రిలాక్స్ అయ్యేట్లు చేస్తుంది. అల్జీమర్స్ చికిత్సలో దీనిని వాడతారు. పొడపత్రి ►పొడపత్రి ఆకుల రసాన్ని పరగడుపున 7 రోజులు తీసుకుంటే చక్కెర వ్యాధి నయమవుతుంది. ధవనం ►దీనినే మాచిపత్రి అని కూడా అంటారు. ఈ మొక్క మంచి సువాసను వెదజల్లుతుంది. దీని వాసన పీల్చుకోవడం ద్వా రా ఒత్తిడి దూరమవుతుంది. దీని ఆకుల నుంచి తీసిన నూనెను చర్మవ్యాధులు, పంటి నొప్పి, చెవి నొప్పి తగ్గడానికి వినియోగిస్తారు. పాండనస్ ఆకర్షణీయమైన ఆకులతో మనసుకు ఉల్లాసాన్నిస్తుంది. వేడి నీళ్లలో దీని ఆకు వేస్తే మంచి సువాసన వస్తుంది. ఎల్ఐజీ కాలనీలో ఏర్పాటు చేసిన పంచతత్వ పార్కు -
పుడమి తల్లికి ప్రణామాలు
పంచభూతాలలో పృధివికి మాత్రమే దైవత్వం, మాతృత్వం రెండూ ఆపాదించారు శాస్త్రకారులు. అగ్ని దేవుడు, వాయు దేవుడు, వరుణ దేవుడు, ఆకాశరాజు అంటాం... ఒక్క పృధివిని మాత్రమే భూమాత అంటాం. భూదేవి లాంటి విశేషణాలు మిగతా భూతాలకు లేవు. అందుకే ఆమెకు నిత్యం గౌరవంగా వందనాలు సమర్పించాలి. ఉదయాన్నే నిద్ర లేస్తూనే మన పాదాలను భూమి మీద మోపుతూ, ‘అమ్మా! మేం నీ గుండెల మీద నడుస్తున్నాం. మా పాదాలతో నిన్ను బాధిస్తున్నాం. మమ్ము క్షమించు తల్లీ’’ అని ప్రార్థిస్తాం. మహోత్కృష్టమైన భూమి గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు పురాణాలలో గోచరిస్తాయి. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, పునరుత్పత్తి... ఇది సృష్టిక్రమం అని వేదాలు చెబుతున్నాయి. ఓషధులకు భూమి ప్రధానమైనది. ‘భూమి’ శబ్దానికి అన్నిటినీ భరించగలిగేది అని ఒక అర్థం ఉంది. అచల, అనంత... ఒక్కో కారణంగా ఒక్కో పేరు వచ్చింది. భూమి తాను కదులుతున్నప్పటికీ భూమి మీద నివసించే ప్రాణులు, ఇతర వస్తువులను నిశ్చలంగా ఉంచే శక్తి కలిగి ఉంది. అంటే కంపం లేకుండా ఉంచుతుందన్నమాట. అందుకే భూమాతను అచల అంటారు. ఎంత బరువువైనా భరించగల శక్తి భూమికి మాత్రమే ఉంది. సహనానికి మారుపేరు పుడమి. పిల్లలను కనిపెంచడానికి తల్లిదండ్రులకున్నంత సహనం భూమాతకు ఉంది. అంత సహనం కలిగిన భూమాత తన కుమారుడి వల్ల ప్రజలకు చేటు జరుగుతోందని గ్రహించి, తన కుమారుడని కూడా చూడకుండా, నరకాసురుడిని సంహరించింది. మాతృత్వం... పంచభూతాలలో భూమికి మాత్రమే దైవత్వం, మాతృత్వం అనే రెండు లక్షణాలు ఉన్నాయి. వేదాలు మాతృదేవోభవ అని చెప్పిన వాక్యం భూమికి సైతం వర్తిస్తుందని పండితులు చెబుతున్నారు. భూమిని దైవంగా భావించి గౌరవించాలి. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి ఆ తల్లిని బయటకు తీసి, భూభారాన్ని ఆయన స్వయంగా మోశాడు. భరించే వాడు భర్త కనుక, భూదేవికి విష్ణుమూర్తి భర్త అయ్యాడు. అనేక నామాలు... భూమి, భూదేవి, భూమా దేవి, భూమి దేవి, వసుంధర, వసుధ, వైష్ణవి, కాశ్యపి, ఉర్వి, హిరణ్యం, వసుమతి... ఈ పదాలతో నేలతల్లిని పిలుస్తాం. విష్ణుమూర్తి అవతారమైన వరాహావతారంలో వరాహుని భార్య భూమి. లక్ష్మీదేవి రెండు అంశలలో భూదేవి ఒక అంశ. ఆమె నిరంతరం నారాయణునితోనే దర్శనమిస్తుంది. కశ్యప ప్రజాపతి కుమార్తె భూదేవి. అందుకే కాశ్యపి అని పేరు. వీరంతా భూగర్భ ఉద్భవులే... భూమాత అనేకమంది దేవతామూర్తులకు జన్మనిచ్చింది. సీతలాగే పద్మావతీదేవి కూడా ఆకాశరాజు పొలం దున్నుతుండగా దొరుకుతుంది. ఆండాళ్ కూడా పెరియాళ్వార్ నాటిన తులసి చెట్టు కింద దొరుకుతుంది. పంచభూతాలలో మొట్టమొదటగా నమస్కరించేది భూమాతనే. పృథివ్యాపస్తేజో వాయురాకాశః... అని పంచభూతాలను వరుసక్రమంలో చెబుతాం. దేవునికి అర్చించే పుష్పాల జన్మస్థానం భూమి. కుసుమాలు భూమి నుండి ఉద్భవిస్తున్నప్పుడే వాటికి సువాసన సమకూరుతుంది. అంటే భూమి విత్తనంతో సమ్మేళనం చెందుతున్నప్పుడే ఈ ఘుమఘుమలు సమకూరతాయి. ఈ కారణంగానే భూమిని ‘గంధవతీ పృథివీ’ అంటారు. అటువంటి భూమిని సంక్షోభానికి, తాపానికి గురి చేయకుండా ఉండటం ఆమె బిడ్డలుగా మనందరి బాధ్యత. రూపవిలాసం... భూదేవి చతుర్భుజి. ఒక చేతిలో దానిమ్మ, ఒక చేతిలో జలపాత్ర, ఒక చేతిలో మూలికలతో నిండిన పాత్ర, మరో చేతిలో కూరలతో దర్శనమిస్తుంది. రెండు చేతులలో కుడిచేతిలో నీలోత్పలం (కుముదం లేదా ఉత్పలం, రేకలువ), ఎడమ హస్తం అభయముద్రతోను సాక్షాత్కరిస్తుంది. అభయహస్తాన్నే లోలహస్త ముద్ర అని కూడా అంటారు. పృథివికి ఆఘ్రాణ శక్తి ఉంది. అందుకే పృథివిని నాసిక భాగంతో పోలుస్తారు. హస్తంలో పృథివిని ఉంగరం వేలుగా గణిస్తారు. పృధ్విని కేంద్ర స్థానంగాను, నిశ్చలత్వానికి ప్రతీకగాను శాస్త్రం చెబుతోంది. పృధ్వితో జలం కలిస్తే తియ్యటి రుచి ఏర్పడుతుంది. పృథివితో అగ్ని కలిస్తే చేదు రుచి ఉద్భవిస్తుంది. – డా. పురాణపండ వైజయంతి -
పంచభూతాలకు సప్తస్వర నీరాజనం
ప్రకృతిలోని పంచభూతాల తత్వాన్ని సంగీతం ద్వారా శ్రోతలకు అందించే ఉద్దేశంతో రూపొందించిన ‘పంచతత్వ’ కార్యక్రమం శనివారం నగరంలో ఏర్పాటు కానుంది. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ రషీద్‌ఖాన్, పండిట్ విశ్వమోహన్ భట్, సెల్వ గణేశ్, తౌఫిక్ ఖురేషీ, రతన్మోహన్ శర్మ, శుభంకర్ బెనర్జీ, శ్రీధర్ పార్థసారథి వంటి ఉద్దండులు ఈ కార్యక్రమంలో తమ సంగీతంతో నగరవాసులను ఓలలాడించనున్నారు. ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ కుమార్తె దుర్గా జస్రాజ్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ముంబై, అహ్మదాబాద్‌లలో నిర్వహించారు. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, ఢిల్లీలలో నిర్వహించనున్నారు. ‘పంచతత్వ’ నిర్వహణ కోసం ఇక్కడకు వచ్చిన దుర్గా జస్రాజ్ ఈ కార్యక్రమం గురించి కొద్దిసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించారు... స్వచ్ఛభారత్‌కు సంగీతపరమైన కొనసాగింపు.. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్‌స్కేప్, శ్లోకాలతో ప్రకృతిలోని పంచభూతాలను ప్రతిబింబించే ప్రదర్శన ఇది. సంగీతంలో మహామహులైన విద్వాంసులతో పాటు పలువురు సమకాలీన సంగీత విద్వాంసులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్’ అభియాన్‌కు సంగీతపరంగా ఇది మా కొనసాగింపు. దీని ద్వారా మానసిక పరిశుద్ధత కలుగుతుందని నేను, నా సహచరుడు నీరజ్ జైట్లీ విశ్వసిస్తున్నాం. దేశంలోని ఐదు నగరాల్లో ‘పంచతత్వ’ కార్యక్రమాన్ని తలపెట్టాం. ముంబైలో నిర్వహించిన తొలి కచేరీని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ ప్రారంభించారు. తర్వాత అహ్మదాబాద్‌లో నిర్వహించాం. అంతకు ముందు ఒమన్‌లోని మస్కట్‌లో నిర్వహించాం. మస్కట్‌లోని రాయల్ ఒపేరా హౌస్‌లో నిర్వహించిన తొలి భారతీయ ప్రదర్శన ఇదే కావడం విశేషం. మొత్తం నలభై మంది కళాకారులం దాదాపు రెండు నెలల పాటు దీని రూపకల్పనలో శ్రమించాం. సంగీతంతో మానవుల మనసులను శుభ్రపరచడంతో పాటు ప్రకృతి ప్రాధాన్యాన్ని కూడా నేటి తరానికి తెలియజేస్తున్నాం. నగరంతో అనుబంధం మా నాన్న జస్రాజ్ ద్వారా హైదరాబాద్ నగరంతో నాకు అనుబంధం ఏర్పడింది. ఇది గొప్ప నగరం. తెలంగాణ సంస్కృతి అద్భుతమైనది. ఇక్కడి సంస్కృతిలో మనిషిని క్షణాల్లోనే ఆనందపరచే శక్తి ఉంది. నా లక్ష్యం కూడా సంస్కృతికి ప్రాచుర్యం కల్పించడమే. నా క్రతువులో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు - కోన సుధాకర్‌రెడ్డి నేడు పంచతత్వ వేదిక: శిల్ప కళావేదిక, మాదాపూర్ సమయం: సాయంత్రం 6.30 గంటలకు ప్రత్యేకత: ప్రకృతి-పంచభూతాల తత్వాన్ని ఉద్దండులైన పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ రషీద్‌ఖాన్, విశ్వమోహన్‌భట్, తౌఫిక్ ఖురేషి, సెల్వ గణేష్, రతన్మోహన్శర్మ, శ్రీధర్ పార్థసారథి, శుభంకర్ బెనర్జీ, అంకితా జోషి, దుర్గా జస్రాజ్ తదితరులు సంగీతరూపంలో ప్రదర్శిస్తారు.