ఈనాడులో వచ్చేవి చెల్లింపు వార్తలు: వైఎస్సార్సీపీ
* టీడీపీ-ఈనాడు కుమ్మక్కుకు నిదర్శనమిదే
* చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల వివరాలను ‘ఈనాడు’ తన ఎన్నికల ప్రత్యేకం ‘పాంచజన్యం’లో ప్రచురిస్తూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈనాడు ఎన్నికల ప్రత్యేకం ప్రారంభించినప్పటి నుంచీ తొలి పేజీలో జగన్మోహన్రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డిలపై తప్పుడు వార్తలు ప్రచురిస్తోందని, కోర్టు విచారణలో ఉన్న కేసులపై తప్పుడు కథనాలను ప్రచురించడం ‘సబ్జ్యుడీస్’ అవుతుందని తెలిసినా ఈ పని చేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.
పార్టీ సంస్థాగత వ్యవహారాల కోఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్లాల్కు మంగళవారం ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ ఎన్నికల సీజన్లో టీడీపీ, ఈనాడు కలసి తమ పార్టీని, తమ పార్టీ అధ్యక్షుని ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని అందులో పేర్కొన్నారు. మరో రాజకీయపార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఒక రాజకీయపార్టీతో కలవడమనేది అభ్యంతరకరమని, తన పాఠకులను ప్రభావితం చేసి టీడీపీకి వారి సానుభూతిని సాధించి పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నమని తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. టీడీపీతో ఈనాడు కుమ్మక్కు అయిందనడానికి ఇలాంటి వార్తల ప్రచురణే నిదర్శనమన్నారు. ఈ వార్తలను టీడీపీ డబ్బు చెల్లించి ఈనాడులో రాయించుకుంటున్న వార్తలుగా పరిగణించాలని, వీటిపై విచారణ జరిపించి తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.