వంట గది నుంచి పంట పొలాల్లోకి...
‘అయిదు వేళ్లు కలిస్తేనే ఐకమత్యం’ అనేది ఎంత పాత మాట అయినా ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తు తెచ్చుకోదగ్గ మాట. కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లాలో ఎంతోమంది మహిళలు ‘ప్రకృతి’ పేరుతో స్వయం సహాయక బృందాలుగా ఏర్పడుతున్నారు. ‘ప్రకృతి’ చేసిన మహత్యం ఏమిటంటే... వంటగదికి మాత్రమే పరిమితమైన వారిని పంట నొలాల్లోకి తీసుకువచ్చింది. డ్రోన్ పైలట్‌గా మార్చి కొత్త గుర్తింపు ఇచ్చింది. జెండర్ ఈక్వాలిటీ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకు రకరకాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేసింది. పిల్లలు పెద్ద చదువులు చదివేలా చేసేలా చేసింది.సినిమాల్లో చూడడం తప్ప ఎప్పుడూ చూడని విమానంలో ప్రయాణం చేయించింది....‘మీ గురించి చెప్పండి’ అని సుధా దేవదాస్‌ను అడిగారు ప్రధాని నరేంద్ర మోది. తన వ్యక్తిగత వివరాలతో పాటు తమ స్వయం సహాయక బృందం ‘ప్రకృతి’ గురించి ప్రధానికి వివరంగా చెప్పింది సుధ.మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన ‘లఖ్పతి దీదీస్’ కార్యక్రమంలో పాల్గొనడానికి కేరళ నుంచి వచ్చింది సుధ. ‘లఖ్‌పత్ దీదీస్’ డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు కేరళ నుంచి ఎంపికైన ఇద్దరు మహిళల్లో సుధ ఒకరు. సుధ త్రిసూర్‌లోని కుఝూర్ గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్. కేరళ నుంచి ‘డ్రోన్ పైలట్’ అయిన తొలి మహిళా పంచాయతీ మెంబర్‌గా సుధ ప్రత్యేక గుర్తింపు సాధించింది.‘ఈ శిక్షణా కార్యక్రమాల పుణ్యమా అని డ్రోన్లను ఎగరవేయడం మాత్రమే కాదు ఆండ్రాయిడ్ ఫోన్లు అంటే ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించాలి, పంట పొలాల్లో ఉపయోగించే ఎరువులు, మందులు... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాం’ అంటుంది సుధ.‘ఇప్పుడు నన్ను అందరూ డ్రోన్ పైలట్ అని పిలుస్తున్నారు’ ఒకింత గర్వంగా అంటుంది సుధ. సుధలాంటి ఎంతో మంది మహిళల జీవితాలను మార్చిన స్వయం సహాయక బృందం ‘ప్రకృతి’ విషయానికి వస్తే... ‘ప్రకృతి’లో 30 సంవత్సరాల వయసు మహిళల నుంచి 63 సంవత్సరాల వయసు మహిళల వరకు ఉన్నారు. ‘ప్రకృతి’లోని పన్నెండు మంది సభ్యులు ‘గ్రామిక’‘భూమిక’ పేరుతో విధులు నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్‌లో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు గృహ నిర్మాణం, పిల్లల చదువు, పెళ్లిలాంటి ఎన్నో విషయాలలో ప్రజలకు సహాయపడతారు.‘ప్రకృతి వల్ల మా జీవన విధానం పూర్తిగా మారి΄ పోయింది’ అంటుంది 51 సంవత్సరాల సుధ. ఆమె పెద్ద కుమారుడు ఎం.టెక్., చిన్న కుమారుడు బీటెక్. చేశారు. ‘పై చదువుల కోసం పెద్ద అబ్బాయి కెనడా, చిన్న అబ్బాయి ΄ పోలాండ్ వెళుతున్నాడు’ సంతోషం నిండిన స్వరంతో అంటుంది సుధ. కొన్ని నెలల క్రితం ‘ప్రకృతి’ బృందం కేరళ నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకి వెళ్లింది. ఆ బృందంలోని ప్రతి ఒక్కరికి ఇది తొలి విమాన ప్రయాణం. అది వారికి ఆకాశమంత ఆనందాన్ని ఇచ్చింది.సాధారణ గృహిణి నుంచి గ్రామ వార్డ్ మెంబర్‌గా, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ‘కుటుంబశ్రీ’లో రకరకాల విధులు నిర్వహిస్తున్న కార్యకర్తగా, జెండర్ ఈక్వాలిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లకు సంబంధించి మహిళలకు శిక్షణ ఇచ్చే రిసోర్స్ పర్సన్‌గా, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో) డైరెక్టర్‌గా, డ్రోన్ పైలట్‌గా రకరకాల విధులు నిర్వహిస్తున్న సుధ ఎంతోమంది గృహిణులకు రోల్‌మోడల్‌గా మారింది.‘మహిళలు ఆర్థికంగా సొంత కాళ్లమీద నిలబడినప్పుడు ఎంతో ఆత్మస్థైర్యం వస్తుంది. అది ఎన్నో విజయాలను అందిస్తుంది. ఎవరు ఏమనుకుంటారో అనే భయాలు మనసులో పెట్టుకోకుండా మనకు సంతోషం కలిగించే పని చేయాలి’ అంటుంది సుధా దేవదాస్.