నివాసయోగ్యమైన ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
రూరల్, సిటీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనిల్
నెల్లూరురూరల్ : వైఎస్సార్ నగర్లో నివాసయోగ్యమైన ఇళ్ల నిర్మాణమే తమ లక్ష్యమని నెల్లూరు రూరల్, నగర ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేదలకు గూడు వసతి కల్పించే ఉద్దేశంతో నగర శివారు కొత్తూరు పరిధిలోని వైఎస్సార్‌నగర్‌లో చేపట్టిన పక్కాగృహాల నిర్మాణం అస్తవ్యస్తంగా జరిగిందన్నారు.
ఎమ్మెల్యేలు శనివారం వైఎస్సార్‌నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో ఇక్కడ పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ పాలకులు నాసిరకంగా పక్కాగృహాల నిర్మాణం చేపట్టారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా గృహాలు నిర్మించారని మండిపడ్డారు. నగరంలోని 16 డివిజన్లకు చెందిన పేదలకు 6,500 ఇళ్లు మంజూరు చేశారన్నారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడం విచారకరమన్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.30 కోట్ల ను గృహాల నిర్మాణానికి ఖర్చు చేసినా పూర్తి కాలేదన్నారు. నాసిరకం నిర్మాణాలపై విచారణ జరగలేదన్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న 50 కుటుంబాలకు మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నా రు. 2015 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించడమే తమ లక్ష్యమన్నారు. గృహనిర్మాణ సమస్యపై అసెంబ్లీలో గళమెత్తుతామన్నారు. గృహ నిర్మాణాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకుంటే హడ్కో ద్వారా చేపట్టే విధంగా గృహ నిర్మాణశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఇకపై తా ము ప్రతి రోజూ గృహాల నిర్మాణ పురోగతిపై మాట్లాడతామన్నారు.
అధికారులతో సమీక్ష
వైఎస్సార్‌నగర్‌లో గృహాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై రూరల్, నగర ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్ పలు శాఖల అధికారులతో వైఎస్సార్‌నగర్‌లో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను హౌసింగ్ ఈఈ ద్వారా అడిగి తెలుసుకున్నారు. నెలలో ఎన్ని ఇళ్లు పూర్తి చేసి ఇవ్వగలరని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దీనికి నెలకు 1000 పూర్తి చేస్తామని ఈఈ సమాధానమిచ్చారు.
ఇళ్ల లబ్ధిదారులు రూ.3వేలు కట్టాలంటూ హౌసింగ్ అధికారులు నోటీసులు ఇవ్వడం సమంజసంగా లేదని, లబ్ధిదారులపై ఒత్తిడి తేవద్దని ఎమ్మెల్యేలు హౌసింగ్ ఈఈకి సూచించారు. వైఎస్సార్‌నగర్‌లో విద్యుత్ లైన్ల పనుల పై ఆ శాఖ డీఈతో చర్చించారు. రెండు నెలల్లో విద్యుత్ పరమైన పనులు పూర్తి చేస్తామని డీఈ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌నగర్‌లో మంచినీ టి సరఫరా, అంతర్గత రోడ్ల నిర్మాణానికి సంబంధితశాఖ అధికారులు చొర వ తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు.
కార్పొరేటర్లతో సమావేశం
వైఎస్సార్‌నగర్‌లో పలు ప్రాంతాల కా ర్పొరేటర్లతో రూరల్, నగర ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. ఆయా డివిజన్లలో గృహాలు పొందిన లబ్ధిదారుల జాబితా తీసుకుని లబ్ధిదారుల గృహాల వద్దకు వెళ్లాలన్నారు. గృహాల నిర్మాణంలో ఉన్న ప్రగతిని వారికి వివరించాలన్నారు. రోజుకు ఒక్కొక్క డివిజన్లో కనీసం 30 మంది లబ్ధిదారులనైనా కలవాలన్నారు.
ఇళ్ల పరిశీలన
వైఎస్సార్‌నగర్‌లోని పక్కా గృహాలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. నిర్మాణదశలో ఉన్న, నాసిరకంగా ఉన్న గృహా లను సందర్శించారు. ఎమ్మెల్యేల వెంట డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్లు పావళ్ల మాధవి, తురకా అనిత, షేక్ తాజున్నీ, కొమరగిరి శైలజ, యాకసిరి ప్రశాంతికిరణ్, ఎస్కే వహిదా, బొబ్బల శ్రీనివాసయాదవ్, కాకుటూరు లక్ష్మీసునంద, కమల్‌రాజ్ సంపూర్ణ, ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, ఎ.బాలకోటేశ్వరరావు, దేవరకొండ అశోక్ ఉన్నారు.