పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
అమృత్సర్ : పంజాబ్లోని అమృత్సర్లో మంగళవారం ఓ స్కూల్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. విద్యార్థులను తీసుకు వెళుతున్న ఓ ప్రయివేట్ స్కూలు బస్సు అదుపు తప్పి ముహవా గ్రామంలోని ఓ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు ఘటనా స్థలంలో మరణించగా, మరో పదిమంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మిగతా చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37మంది విద్యార్థులు ఉన్నారు. అయితే వీరంతా నర్సరీ విద్యార్థులు కావటంతో బస్సులో నుంచి బయటకు రాలేక...అందులోనే చిక్కుకుపోయారు. కాగా గల్లంతు అయినవారి కోసం గాలిస్తున్నట్లు అమృత్సర్ రూరల్ ఎస్పీ తెలిపారు. ఘటనాస్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.