‘బంగారు’ బాబు
సాక్షి, హైదరాబాద్: ఒళ్లంతా బంగారంతో.. నడిచొచ్చే నగల దుకాణంలా కనిపిస్తున్న ఈయన పేరు పంకజ్ పరేఖ్. మహారాష్ట్రలోని యోలో పట్టణానికి చెందిన వ్యాపారవేత్త. అక్క డి వారంతా ఈయనను ‘గోల్డ్‌మన్’ అంటుంటారు. పేరుకు తగ్గట్టే ఈయన ఒంటి నిండా బంగారమే. కళ్లజోడు నుంచి ఒంటికి వేసుకొనే చొక్కా వరకు అంతా ‘స్వర్ణ’ తాపడమే. పంక జ్ వేసుకున్న షర్టు నాలుగు కేజీల బంగారంతో తయారైంది. కళ్లకు పెట్టుకున్న అద్దాలు 30 గ్రాముల బంగారంతో రూపొందింది. మెడకు నెక్లెస్‌లు, చేతి వేళ్లకు ఉంగరాలతో సహా పంకజ్ తన ఒంటినిండా ఏడు కేజీల 30 గ్రాముల బంగారం దింపేశారు.
వీటి విలువ సుమారుగా రూ.3 కోట్లు ఉంటుందట. గురువారం ఈ ‘బంగారు’ బాబు ను చూసే ‘గోల్డెన్’ చాన్స్ హైదరాబాద్‌కు దక్కింది. హిమాయత్‌నగర్‌లోని సోదరుడు ప్రదీప్ పరేఖ్ గృహప్రవేశానికి పంకజ్ వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు బంగారం అంటే ఎంతో ఇష్టమని, అందుకే ఇలా ఒళ్లంతా బంగారు ఆభరణాలను వేసుకున్నట్లు చెప్పారు. త్వరలో పుత్తడి ప్యాంట్ కూడా కుట్టించుకొని గిన్నిస్ బుక్‌లో స్థానం కోసం దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు.