పరిశ్రమలకు కేంద్రంగా జిల్లా..
బూర్గంపాడు: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జిల్లాను ఇండస్ట్రీయల్ కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లాలో పవర్ప్లాంట్లు, కాగితపు పరిశ్రమ, ఉక్కు పరిశ్రమలతో పాటు వీటి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ, భూ లభ్యతపై జిల్లా అధికారయంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. నీరు, బొగ్గు తదితర ప్రకృతి వనరులు అందుబాటులో ఉండటంతో పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా కీలకంగా మారింది.
ఇప్పటికే పాల్వంచలోని కేటీపీఎస్ విస్తరణకు ప్రజాభిప్రాయసేకరణ కూడా పూర్తయింది. మణుగూరు పరిసర ప్రాంతాల్లో మరో పవర్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు భూముల పరిశీలన జరుగుతోంది. మణుగూరుకు సమీపంలోని సాంబాయిగూడెం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట గ్రామాల సమీపంలోని 2 వేల ఎకరాల భూముల లభ్యతపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో రైతుల సాగుభూములు, ప్రభుత్వభూములు, అటవీభూముల వివరాలను సేకరిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు వ్యవసాయభూములను ఇచ్చేందుకు రైతుల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో జిల్లా అధికారులు పవర్‌ప్లాంట్ నిర్మాణాల కోసం అశ్వా పురం మండలంలోని కేశవాపురం, చింతిర్యాలలో కూడా భూముల అన్వేషణ ప్రారంభించారు.
ఇటీవల కలెక్టర్ ఇలంబరితి అశ్వా పురం మండలంలో కూడా భూములను పరిశీలించారు. ప్రత్యామ్నాయంగా బూర్గంపాడు మండలంలోని ఇరవెండి, మోతె గ్రామాల సమీపంలోని భూముల వివరాలను కూడా జిల్లా యంత్రాంగం సేకరిస్తోంది. పినపాక నియోజకవర్గంలో సాగుభూములు ఎక్కువగా ఉండటంతో గోదావరి నదికి అవతలి ఒడ్డున ఉన్న భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో కూడా భూముల లభ్యతపై అధికారులు ఆరా తీస్తున్నారు. బూర్గంపాడు మండలంలోని సారపాక నుంచి మణుగూరు క్రాస్‌రోడ్ వరకు సుమారు 1300 ఎకరాల అటవీభూముల్లో ఐటీసీ మరో మెగా పేపర్పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతోంది.
ఇప్పటికే వన్యప్రాణి సంరక్షణ, అటవీశాఖల నుంచి పేపర్ పరిశ్రమ ఏర్పాటుకు సానుకూల సంకేతలు లభించాయి. ఇటీవల ఐటీసీ యాజమాన్యం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుని కలసి పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం ప్రాంతంలో ఓ కెమికల్ ఇండస్ట్రీని ఏర్పాటుచేసేందుకు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా స్థానికంగా చర్చసాగుతోంది. పేపర్, పవర్‌ప్లాంటు ఏర్పాటుతో పాటు వీటికి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కూడా కొందరు పారిశ్రామికవేత్తలు భూముల అన్వేషణలో ఉన్నారు.
భూసేకరణే అసలు సమస్య: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని వనరులు ఉన్నా భూసేకరణే అసలు సమస్యగా మారనుంది. పరిశ్రమల ఏర్పాటుకు సాగు భూములను ఇచ్చేందుకు రైతులు సుముఖంగా లేరు. తమ జీవనాధారమైన పంట భూములను పరిశ్రమ ఏర్పాటుకు ఇస్తే తమ భవిష్యత్ ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వభూములు అన్యాక్రాంతైమైనాయి.అదేవిధంగా వేలాది ఎకరాల అటవీభూములు కబ్జాకు గురయ్యాయి. వీటిని ప్రభుత్వం గుర్తించి తిరిగి ప్రభుత్వపరం చేసుకుంటే పరిశ్రమల ఏర్పాటు సులభమయ్యే అవకాశం ఉంది. కేంద్రప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో చేసిన భూసేకరణ చట్ట నిబంధనలు కఠినతరంగా ఉండటంతో భూసేకరణ అంతతేలికగా జరిగే పరిస్థితులు లేవు.