ప్రకృతి ప్రేమికులకు రా రమ్మని... స్వాగతం
గోదావరికి ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలు, గుట్టలపై ఉండే గిరిజన గూడేలు, ఆకుపచ్చని రంగులో ఆకాశాన్ని తాకేందుకు పోటీ పడుతున్న కొండల అందాలను కనులారా వీక్షించాలని అనుకుంటున్నారా? అయితే, మీరు పాపికొండలు యాత్రకు వెళ్లాల్సిందే. భద్రాచలం సమీపాన పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి నిత్యం బోట్లు నడిపిస్తుండగా.. క్రిస్మస్, కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతి సెలవులు రానున్న నేపథ్యాన పర్యాటకుల రద్దీ పెరగనుంది. ఈ నేపథ్యాన పాపికొండల అందాలు, యాత్ర మిగిల్చే తీయని అనుభవాలపై ప్రత్యేక కథనమిది.రెండు మార్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాపికొండల యాత్రను సందర్శించాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటోది.. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం వద్ద ఉన్న పోచమ్మ గండి పాయింట్ వద్ద నుంచి బోట్లో ప్రారంభమై.. పేరంటాలపల్లి వరకు వెళ్లి తిరిగి తీసుకొస్తారు. రెండోది.. తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి ప్రారంభమయ్యే మార్గం. ఈ పాయింట్ తెలంగాణలోని భద్రాచలానికి సమీపాన ఉంటుంది. దీంతో పర్యాటకులు ఒకరోజు ముందుగానే చేరుకుని రామయ్యను దర్శించుకుని.. ఆపై పాపికొండలు యాత్రకు బయలుదేరుతారు.భద్రాచలం నుంచి ఇలా.. హైదరాబాద్ నుంచి పాపికొండల యాత్రకు రావాలనుకునే వారు ముందుగా భద్రాచలం చేరుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాచలానికి విరివిగా బస్సులు ఉన్నాయి. రైలు మార్గంలో వచ్చే వారు కొత్తగూడెం (భద్రాచలం రోడ్డు) స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం రావాలి. ఇక్కడ వీలు చూసుకుని సీతారాముల దర్శనం చేసుకున్న తర్వాత.. భద్రాచలం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో బోటింగ్ పాయింట్ ఉన్న పోచవరం గ్రామానికి బయలుదేరవచ్చు. 70 కిలోమీటర్ల జలవిహారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల మధ్యలో ప్రారంభమయ్యే యాత్ర సాయంత్రం 4 గంటల నుంచి లేదా 5 గంటల మధ్యలో ముగుస్తుంది. పోచవరం ఫెర్రీ పాయింట్ వద్ద పర్యాటకులను ఎక్కించుకుని మళ్లీ అక్కడే దింపుతారు. సుమారు ఆరు గంటల పాటు 70 కిలోమీటర్లు గోదావరిలోనే జలవిహారం చేసే అద్భుత అవకాశం ఈ యాత్రలో పర్యాటకులకు కలుగుతుంది. పేరంటాలపల్లి సందర్శన పాపికొండల యాత్రలో పేరంటాల పల్లి వద్ద నున్న ప్రాచీన శివాలయం వద్ద బోటు ఆపుతారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుడిని గిరిజనులే నిర్వహిస్తున్నారు. గుట్ట పైనుంచి జాలువారే నది జలాన్ని తీర్థంగా పుచ్చుకుంటారు. యాత్ర ప్రారంభానికి ముందు లేదా తర్వాతైనా పోచవరానికి సమీపాన వీఆర్ పురం మండలంలోని శ్రీరామగిరి రాముడి క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. షెడ్యూల్, ధరలు ఇలా.. పోచవరం వద్ద నుంచి ప్రారంభమయ్యే పాపికొండల యాత్రకు సంబంధించి పెద్దలకు రూ.950, చిన్నారులకు రూ.750గా ఏపీ పర్యాటక శాఖ నిర్ణయించింది. కళాశాల విద్యార్థులు గ్రూపుగా పర్యటనకు వస్తే.. వారికి రూ.850, ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.750 ప్యాకేజీ ధరగా ప్రకటించారు. అయితే శని, ఆదివారం, సెలవు దినాల్లో.. దీనికి అదనంగా రూ.100 వసూలు చేస్తారు. ఈ ప్యాకేజీలోనే భోజన సౌకర్యాన్ని బోటు నిర్వాహకులు కల్పిస్తారు. భద్రగిరిలోని రామాలయం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బుకింగ్ కౌంటర్ల ద్వారా ఏజెంట్లు టికెట్లు విక్రయిస్తారు. ఇసుక తిన్నెల్లో విడిది.. రాత్రివేళ నిశ్శబ్ద వాతావరణంలో గోదావరి ప్రవాహ శబ్దం, ఇసుక తిన్నెలు, వెన్నెల అందాలను ఆస్వాదించాలంటే వెదురు హట్స్ల్లో రాత్రి వేళ బస చేయాల్సిందే. పశ్చిమగోదావరి జిల్లాలోని సిరివాక అనే గ్రామం వద్ద పర్యాటకుల కోసం హట్స్ ఉన్నాయి. గుడారాలలో ఒక్కొక్కరికి రూ.4 వేలు, వెదురు కాటేజీల్లో అయితే రూ.5,500గా ధర నిర్ణయించారు. ఉదయం పోచవరం నుంచి వెళ్లి.. రాత్రికి సిరివాకలో బస చేయిస్తారు. అనంతరం మర్నాడు సాయంత్రానికి పోచవరానికి లాంచీలో చేరుస్తారు. రెండు రోజుల పాటు భోజన వసతి, ఇతర సౌకర్యాలను నిర్వాహకులే చూసుకుంటారు. ఈ టికెట్లు కూడా భద్రాచలంలో అందుబాటులో ఉంటాయి. పటిష్టమైన రక్షణ ఏపీలోని కచ్చలూరు లాంచీ ప్రమాదం అనంతరం పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేశారు. అన్ని బోట్లకు అనుసంధానం చేసిన శాటిలైట్ ఫోన్లు, వాకీటాకీలు, వాటిని నియంత్రించే బోటింగ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు పోలీసు, అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక శాఖ అధికారులు.. పర్యాటకుల ధ్రువీకరణ పత్రాలను సరిపోలి్చన తరువాతే బోటులోకి అనుమతిస్తారు. బోటులో లైఫ్ జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రిని సిద్ధంగా ఉంచుతున్నారు.ఆహారం ఉదయం యాత్ర ప్రారంభమయ్యే సమయంలో అల్పాహారం, టీ అందిస్తారు. మధ్యాహ్న సమయాన బోటులోనే శాఖాహార భోజనంతో ఆతిథ్యాన్ని అందిస్తారు. సాయంత్రం యాత్ర ముగిసిన తరువాత మళ్లీ బోట్ పాయింట్ వద్ద స్నాక్స్, టీ అందజేస్తారు. పాపికొండల ప్రయాణంలో కొల్లూరు, సిరివాక, పోచవరం వద్ద ‘బొంగు చికెన్’ అమ్ముతారు. ఆకట్టుకునే వెదురు బొమ్మలు పేరంటాలపల్లి దగ్గర గిరిజనులు తయారు చేసిన వెదురు బొమ్మలు, వస్తువులు ఆకట్టుకుంటాయి. రూ.50 నుంచి రూ.300 వరకు ధరల్లో ఇవి లభిస్తాయి.👉పర్యాటకుల మనస్సుదోచే పాపికొండల విహార యాత్ర (ఫొటోలు)