పాపికొండల పర్యాటకానికి బ్రేక్
పాపికొండల పర్యాటకానికి బ్రేక్
Published Mon, Aug 29 2016 10:10 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
దేవీపట్నం :
గోదావరి నదిపై పాపికొండల పర్యటనకు వెళ్లే పర్యాటక బోట్లకు బ్రేక్ పడింది. ఆదివారం సాయంత్రం పాపికొండల నుంచి తిరిగొస్తూ పోశమ్మగండి వద్ద రాయి తగలడంతో బోటుకు రంధ్రం పడి నీరు చేరిన విషయం విదితమే. అంతకుముందే పర్యాటకులు బోటు నుంచి దిగడంతో పెనుముప్పు తప్పింది. ఈ నేపథ్యంలో సంఘటన ప్రాంతాన్ని సోమవారం బోటు సూపరింటెండెంట్ జి.ప్రసన్నకుమార్ సందర్శించారు. దెబ్బతిన్న బోటును పరిశీలించారు. కేవలం బోటు డ్రైవరు అజాగ్రత్త కారణంగా ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం నుంచి పాపికొండల పర్యటనను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. గోదావరిపై విహరించే 21 టూరిజం బోట్లకు గాను ఐదింటికి ఫిట్‌నెస్ లేకపోవడంతో లైసెన్సు రద్దు చేశామని తెలిపారు. వీటిలో ఆరు చెక్క బోట్లు ఉండగా, వాటిని కూడా గోదావరి విహారానికి అనుమతించబోమని పేర్కొన్నారు. బోట్లలో సామర్థ్యానికి మించి పర్యాటకులను ఎక్కించుకున్నా, లైసెన్సులు లేని డ్రైవర్లు బోట్లను నడిపినా, నిబంధనలను పూర్తిగా పాటించని బోట్ల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు.
Advertisement