స్వైన్‌ఫ్లూ పై కదిలిన జీవీఎంసీ
విశాఖపట్నం సిటీ : స్వైన్ ఫ్లూ నివారణపై జీవీఎంసీ యంత్రాంగం కదిలింది. వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించేందుకు పారామెడికల్ బృందాలను రంగంలోకి దించింది. నగరంలోని వివిధ జోన్లలో వున్న పారామెడికల్ ఉద్యోగులందరికీ ఈ వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించారు. జోన్-4 ప్రాంతమంతా మురికివాడలతోనే వుండడంతో ఎక్కువ దృష్టి సారించారు. వైరస్ సోకే అవకాశాలున్న వారి ఆరోగ్యో పరిస్థితిపై సహాయ వైద్యాధికారి డాక్టర్ మురళీ మోహన్ ఆరా తీస్తున్నారు. హుదూద్ తుఫాన్ తర్వాత అర్బన్‌లో పారిశుద్ధ్య సమస్య మరింత పెరిగింది. ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోవడంతో వ్యాధులు ఎక్కడ విజృంభిస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
పల్స్‌పోలియో వాలంటీర్లు, పారామెడికల్ ఉద్యోగులకు స్వైన్ ఫ్లూ లక్షణాలున్న వారిని గుర్తించే బాధ్యతలను అప్పగించారు. మరుగుదొడ్లు లేని వారు ఎంత మంది వున్నారో గుర్తించే పనిని కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అర్బన్‌లో 72 వార్డులకూ 86 బృందాలను నియమించారు. 775 మురికివాడల్లో గత వారం రోజులుగా సర్వే చేసి 20 వేల మందికి లెట్రిన్లు లేవని గుర్తించారు. మరో రెండు మూడు రోజుల్లో మరో 20 వేలకు పైగా మరుగుదొడ్లు లేని ఇళ్లను సులువుగానే గుర్తించే అవకాశాలున్నాయని వైద్య సిబ్బంది అంటున్నారు. 4.30లక్షల ఇళ్లు వున్నాయని ఇంకా ఇళ్లు లేని వారు, కొండలపై నివాసముంటున్న వారు, పాకల్లో వుంటున్న వారు, టెంట్లలో వుంటున్న వారందరినీ లెక్కలేస్తే లక్షల్లోనే లెట్రిన్లు లేనట్టుగా నమోదయ్యే ఛాన్స్‌లున్నాయి.