అధికారానికి సాష్టాంగం
సూళ్లూరుపేట : అధికారం ముందు అధికార యంత్రాంగం సాష్టాంగపడింది. ప్రభుత్వ కార్యాలయంలో అదీనూ తహశీల్దార్ కార్యాలయంలో ప్రొటోకాల్ లేని ఒక మాజీ మంత్రి పరసా రత్నం ముందు అధికారులు మంగళవారం క్యూ కట్టి జీ హుజూర్ అంటూ సలాం కొట్టారు. ఏ హోదా లేని ఆయన ఇచ్చిన ఆదేశాలను వినయంగా నోట్ చేసుకున్నారు. అంతటితో ఆగలేదు కదా.. తెలుగుదేశం పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు సూచించిన అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. స్థానిక ఎమ్మెల్యే శాసనసభ సమావేశాల్లో ఉండగా ఓటమిపాలైన టీడీపీ అభ్యర్ధి దర్జాగా ప్రభుత్వ కార్యాలయంలోనే సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అధికారపార్టీ నేతల అహంకారానికి, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా మారింది. ఆర్డీవో నుంచి అన్నిశాఖల అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొనడం గమనార్హం. గ్రామ సచివాలయాల నుంచే గ్రామ పాలన జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషిస్తున్నట్టు మాజీమంత్రి చేసిన ఉపన్యాసానికి అధికారులు చప్పట్లు కొట్టి మరీ అధికారపక్షానికి విధేయతను చాటుకున్నారు.
అధికారులతో పరసా సమీక్ష ఎలా చేస్తారు?
ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూటి ప్రశ్న
ప్రజా విశ్వాసం కోల్పోయిన పరసా వెంకటరత్నం సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో ఏ హోదాలో సమీక్షించారని స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రశ్నిం చారు. ఆర్డీఓ సమక్షంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా హైదరాబాద్‌లో ఉన్న సంజీవయ్య ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. విద్యావంతుడైన, రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి పార్టీ కార్యకర్తలను వెంటబెట్టుకుని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడానికి కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా అంటూ మండిపడ్డారు.
ఆయనకు రాజ్యాంగ నిబంధనలు తెలియవా! ఆయన నీతిమాలిన పనిచేస్తే డివిజన్‌స్థాయి అధికారి అయిన ఆర్డీఓ ఎంవీ రమణ మండలంలోని అన్ని శాఖల అధికారులను ఎలా సమావేశానికి పిలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అధికారులకు ప్రొటోకాల్ తెలియదా! ఆయన సమావేశానికి పిలవగానే వచ్చేస్తారా! దీనిపై తాను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఓడిపోయిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు మర్యాదపూర్వకంగా రావచ్చునేమోగాని కార్యాలయంలో కూ ర్చుని అభివృద్ధిపై సమీక్షిస్తే అధికారులు ఎలా అనుమతి ఇస్తారని అన్నారు.
ఇటీవల టీడీపీ నాయకులు తిరుమూరు సుధాకర్‌రెడ్డి తాను అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నానని విమర్శించారు కదా! ఇప్పుడు పరసా అధికారులను బ్లాక్ మెయిల్ చేసి సమీక్ష సమావేశాలు ఎలా నిర్వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు అధికారుల్లా పనిచేయాలే గాని అధికారం ఉందని అధికారపార్టీ నాయకులు చెప్పినట్టు ఆడితే తాను సహించనన్నారు. పరసారత్నం కలల్లో నుంచి బయటకు వచ్చి ఇకనైనా నీతిమాలిన పనులు మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని అన్నారు.