హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తా: కేసీఆర్
హైదరాబాద్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పాలన ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజలే కేంద్ర బిందువుగా తమ పరిపాలన ఉంటుందని చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారిగా కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు మధుర ఘట్టమని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగ ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారన్నారు. రాజకీయ అవినీతిని కూకటివేళ్లతో తొలగిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఇచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులకు రూ.లక్షలోపు రుణమాఫీ చేస్తామన్నారు. రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగులతో సమాన వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. బలహీన వర్గాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు.
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీయిచ్చారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సింగిల్ విండో విధానం ప్రవేశపెడమన్నారు. అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తామన్నారు. రాబోయే మూడేళ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా వేద వ్యాసుడు రాసిన శ్లోకాన్ని కేసీఆర్ ఉటంకించారు.
సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్