పరిటాల అనుచరుడి భూదందా.. అజ్ఞాత వ్యక్తి లేఖతో
మాజీ మంత్రి పరిటాల రవీంద్ర అనుచరుడైన రామగిరి టీడీపీ మాజీ ఎంపీపీ బడిమెద్దుల రంగయ్య ధర్మవరంలో చేసిన భూ దందా కలకలం సృష్టించింది. అత్యంత ఖరీదైన మున్సిపల్ రిజర్వ్డ్ స్థలాన్ని నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించి ఏకంగా కోట్లాది రూపాయలు రుణంగా తీసుకునేందుకు పెద్ద ప్రణాళికను రచించాడు. అయితే మున్సిపల్ అధికారుల విచారణలో కబ్జా వ్యవహారం బట్టబయలు కావడంతో కథ అడ్డం తిరిగింది.
సాక్షి, ధర్మవరం టౌన్: ధర్మవరం పట్టణంలోని ఎస్బీఐ కాలనీ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇక్కడ సర్వే నంబర్ 483–1లో 7.84 సెంట్ల స్థలాన్ని రిజర్వ్డ్ సైట్‌గా అధికారులు కేటాయించారు. దీంతో ఈ స్థలంపై పరిటాల అనుచరుడు, రామగిరి మాజీ ఎంపీపీ బడిమెద్దుల రంగయ్య కన్నుపడింది. పరిటాల హవా సాగుతున్న సమయంలో అంటే 2004లో ఈ స్థలాన్ని చారుగుండ్ల రామలక్ష్మమ్మ అనే మహిళ పేరిట నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు సృష్టించాడు. ఆ తర్వాత అదే సంవత్సరంలో సదరు మహిళతో ఆ స్థలాన్ని కొన్నట్టు బడిమెద్దుల రంగయ్య రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి స్థలాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు. ఈ స్థలం విలువ రూ.3 కోట్లకు పైగానే పలుకుతుంది. (జేసీ కుటుంబానికి మైనింగ్ శాఖ నోటీసులు)
దస్తావేజులో రంగయ్య ఫొటో
అజ్ఞాత వ్యక్తి లేఖతో బట్టబయలు
ఎస్బీఐ కాలనీలో నకిలీ ధ్రువపత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న సర్వే నంబర్ 483–1లోని 7.84సెంట్ల స్థలాన్ని ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో తాకట్టు పెట్టి రూ.2 కోట్ల రుణం పొందేందుకు బాలాజీ హౌసింగ్ డెవలపర్స్ అనే కంపెనీ తరఫున దరఖాస్తు చేసుకున్నాడు. రుణం ఇచ్చే ప్రక్రియ మొదలు కావడంతో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థలానికి సంబంధించిన విచారణ మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేసింది. ఇదే తరుణంలో పది రోజుల కిందట ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు ఈ వ్యవహారాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ ద్వారా తెలిపాడు. దీంతో కమిషనర్ ఆ డాక్యుమెంట్లను పరిశీలించి నకిలీ రిజి్రస్టేషన్గా గుర్తించారు. మున్సిపల్ రిజర్వ్డ్ సైట్‌ను తాకట్టు పెట్టి రుణం పొందాలనుకున్న విషయాన్ని ధ్రువీకరించారు.
కబ్జాదారుపై పోలీసులకు ఫిర్యాదు
మున్సిపల్ రిజర్వ్డ్ స్థలానికి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రుణం పొందాలని చూసిన బడిమెద్దుల రంగయ్య, రామలక్ష్మిలతో పాటు, అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపైన మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు.