నోట్ల రద్దు: కమిటీ ముందు నోరిప్పని అధికారులు
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎన్ని పాత నోట్లు వెనక్కి వచ్చాయి? ఎన్ని కొత్త కరెన్సీ నోట్లు ప్రింట్ చేశారు? అంటే అసలు ఎవరిదగ్గరా ఏం సమాధానాలు లేనట్టు ఉన్నాయి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అడిగిన ప్రశ్నలకు ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులూ ఏం సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. నోట్ల రద్దు నిర్ణయంలో ఆర్బీఐ పాత్ర, నల్లధనం వసూళ్లు, విత్ డ్రా పరిమితిపై ఆంక్షలు వంటి పలు విషయాలపై సమాధానం చెప్పాల్సిందిగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. ఇదే విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) సైతం వారికి నోటీసులు జారీచేసింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరప్పమొయిలీ నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు బుధవారం హాజరైన ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు, ఆ కమిటీ అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎన్ని పాత నోట్లు వచ్చాయంటే వారిదగ్గర సమాధానం లేదట. ఇక ఎన్ని కొత్త నోట్లు ప్రింట్ చేశారన్నా వారు ఏం చెప్పలేదట. ఇక కేవీ థామస్ అధినేతగా ఉన్న మరో కమిటీ పీఏసీ ముందు వీరు శుక్రవారం హాజరుకావాల్సి ఉంది. అప్పుడు కూడా ఇదే మాదిరి సమాధానం చెబితే ప్రధాని నరేంద్రమోదీకైనా సమన్లు జారీచేస్తామని ఆయన ముందస్తుగానే హెచ్చరించారు. నోట్ల రద్దు అనంతరం రిజర్వు బ్యాంకు తన స్వతంత్రను కాపాడుకోవడంలో విఫలమైందని పలు విమర్శలు వచ్చాయి. మరోవైపు నగదు కొరతతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయాలన్నింటిన్నీ విచారిస్తున్న కమిటీలు ఆర్బీఐ గవర్నర్, ఇతర అధికారులకు నోటీసులు జారీచేశాయి.