సీఎం ఇంట్లో పూజలో పాల్గొన్న కొద్దిరోజులకే..!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నివాసంలో గణపతి పూజలో పాల్గొన్న పరమనంద హెవలేకర్ అనే వ్యక్తి మళ్లీ వార్తల్లో నిలిచాడు. సీఎం నివాసంలో పూజల్లో పాల్గొన్న కొద్దిరోజులకే ఆయనను పోలీసులు అరెస్టు చేసి.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఓ మహిళను లైంగికంగా వేధించినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటుండటం రాజకీయంగా సీఎం ఫడ్నవిస్‌ను ఇరకాటంలో నెట్టేసింది.
సింధుదుర్గ్ జిల్లా మహదేవ్వాడి గ్రామానికి చెందిన హెవలేకర్ దంపతులు గత బుధవారం గణేష్ విగ్రహాంతో సచివాలయం ప్రధాన గేటు వద్దకు వచ్చి.. ఆందోళనకు దిగారు. తమను గ్రామంలో సాంఘికంగా వెలివేశారని, గణేష్ ఉత్సవాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటారని ఆరోపిస్తూ.. రచ్చ చేశారు. దీంతో సీఎం ఫడవ్నిస్ తన నివాసం 'వర్ష'కు ఆ దంపతులను ఆహ్వానించి.. గణేష్ పూజలో వారితోపాటు పాల్గొన్నారు. అయితే, హెవలేకర్ పొరుగున ఉండే ఓ మహిళను లైంగికంగా వేధించాడని ఆయనపై ఆగస్టు 7, 2013న కేసు నమోదైంది. 2014లో స్థానిక కోర్టులో ఆయనపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ కేసు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఓ పోలీసు కేసు నమోదైన వ్యక్తిని తన ఇంట్లో పూజలకు పిలువడం సీఎంకు ఇబ్బంది కలిగించే అంశమేనంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.